హిజ్రాలకు ప్రత్యేక టాయిలెట్
చెన్నై (టీనగర్):
హిజ్రాలకు ప్రత్యేక టాయిలెట్స్ ఏర్పాటుచేయాలని కోరుతూ నగర కార్పొరేషన్‌కు మద్రాసు హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. బహిరంగ స్థలాల్లో హిజ్రాలకు ప్రత్యేక మరుగుదొడ్లు నిర్మించేందుకు ఉత్తర్వులివ్వాలని కోరుతూ దేవరాజన్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు ప్రధాన న్యాయమూర్తి హులువాది రమేష్, టీక్కా రామన్ ఆధ్వర్యంలోని బెంచ్ ఎదుట విచారణకు వచ్చింది.
ఆ సమయంలో మొదటి విడతగా హిజ్రాలు అధికంగా నివశించే ప్రాంతాలైన తండయార్‌పేట, చూళైమేడు, పులియాంతోపు, సైదాపేట ప్రాంతాల్లో ప్రత్యేక మరుగుదొడ్లు ఏర్పాటుచేసేందుకు చెన్నై కార్పొరేషన్‌కు రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ సిఫారసులు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలియజేసింది. ఇందుకు సమ్మతించిన న్యాయమూర్తులు టాయిలెట్స్ నిర్మాణ పనులు జరిపేందుకు కార్పొరేషన్‌కు నాలుగు వారాలు అనుమతిస్తూ ఉత్తర్వులిచ్చారు. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా హిజ్రాలు ఎదుర్కొనే సమస్యల గురించి పరిశీలన జరిపి నివేదిక దాఖలు చేయాలంటూ పిటిషనర్ దేవరాజన్‌కు న్యాయమూర్తులు ఉత్తర్వులిచ్చారు.