seperate
-
నిత్యానంద దేశం.. కైలాస!
న్యూఢిల్లీ: అత్యాచారం సహా పలు ఆరోపణలు ఎదుర్కొంటూ దేశం విడిచి పారిపోయిన వివాదాస్పద స్వామీజీ నిత్యానంద సొంతంగా ఓ దేశాన్నే ఏర్పాటు చేసుకున్నారు. ఈక్వెడార్ నుంచి ఒక చిన్న ద్వీపాన్ని కొనుగోలు చేసి, దానికి ‘కైలాస’ అనే పేరు కూడా పెట్టారు. ట్రినిడాడ్ అండ్ టొబాగోకు దగ్గర్లో ఉన్న తన ద్వీప దేశానికి ఒక పాస్‌పోర్ట్‌ను, జెండాను, జాతీయ చిహ్నాన్ని డిజైన్ చేశారు. ఒక ప్రభుత్వాన్ని, ప్రధాన మంత్రిని, కేబినెట్‌ను కూడా ఏర్పాటు చేశారు. రోజూ కేబినెట్ భేటీలు కూడా జరుపుతున్నారని సమాచారం. ప్రధానిగా ‘మా’ని నియమించారని, గోల్డ్, రెడ్ కలర్లలో పాస్‌పోర్ట్‌ను రూపొందించారని ఆ ‘దేశ’ వెబ్సైట్ పేర్కొంది. తన ‘కైలాస’కు ఒక దేశంగా గుర్తింపునివ్వాలని కూడా నిత్యానంద ఐక్యరాజ్య సమితికి విజ్ఞప్తి చేయనున్నారు. హిందూత్వని ప్రచారం చేస్తున్నందువల్ల భారత్‌లో తన జీవితం ప్రమాదంలో పడిందని ఐరాసకు పంపనున్న వినతి పత్రంలో నిత్యానంద పేర్కొన్నారు. కైలాస రాజకీయేతర హిందూ దేశమని, హిందూత్వ పునరుద్ధరణ కోసం కృషి చేస్తుందని ఆ వెబ్సైట్లో పేర్కొన్నారు. దేశ పౌరసత్వం కావాలనుకునేవారు విరాళాలు ఇవ్వాలనే విజ్ఞప్తిని కూడా అందులో పొందుపర్చారు. మెరూన్ కలర్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఓ సింహాసనం ముందు నిత్యానంద కూర్చుని ఉండగా పక్కన నంది ఉన్న చిత్రంతో జెండాను రూపొందించారు. ప్రభుత్వంలో 10 శాఖలను కూడా ఏర్పాటుచేశారు. అందులో ఒకటి నిత్యానంద స్వామి కార్యాలయం కాగా, విదేశీ వ్యవహారాలు, రక్షణ, సోషల్ మీడియా, హోం, కామర్స్, విద్య.. మొదలైన ఇతర శాఖలు ఉన్నాయి. ప్రతిపాదిత కైలాస దేశ పాస్‌పోర్టు తమది సరిహద్దులు లేని దేశమని, తమ తమ దేశాల్లో స్వేచ్ఛగా హిందూయిజాన్ని అనుసరించలేని వారి కోసం ఈ దేశం ఏర్పాటయిందని కైలాస వెబ్ సైట్లో పేర్కొన్నారు. తమ దేశంలో ఉచితంగానే భోజనం, విద్య, వైద్యం లభిస్తాయని, ఆధ్యాత్మిక విద్య, ప్రత్యామ్నాయ వైద్య విధానాలపై దృష్టి పెడతామని ఆ వెబ్సైట్లో పేర్కొన్నారు. ‘మాది భౌగోళికపరమైన దేశం కాదు. ఒక భావనాత్మక దేశం. శాంతి, స్వేచ్ఛ, సేవాతత్పరతల దేశం. ఏ దేశ ఆధిపత్యం కింద లేని మేం ఇతర దేశాలతో, అంతర్జాతీయ సంస్థలతో దౌత్య సంబంధాలు ఏర్పాటు చేసుకుంటాం’ అని అందులో తెలిపారు. నకిలీ పాస్‌పోర్ట్‌తో, నేపాల్ మీదుగా ఇటీవల నిత్యానంద పారిపోయారు. -
మార్కెట్ మాయ...
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లాల పునర్విభజన సమయంలో ప్రభుత్వం మార్కెటింగ్ శాఖను సైతం విభజించింది. ప్రతి జిల్లాకు ఒక మార్కెటింగ్ శాఖ మేనేజర్‌ను నియమిస్తూ జీఓ జారీ చేసింది. అయితే రెండేళ్లకే తిరిగి ‘యూటర్న్’ తీసుకుంది. తాజాగా జీఓ నం.746ను విడుదల చేసింది. దీని ప్రకారం మార్కెటింగ్ జిల్లా స్థాయి కార్యాలయాలను మళ్లీ విలీనం చేయనుంది. జిల్లాల పునర్విభజన అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా 21 జిల్లా మార్కెటింగ్ కార్యాలయాలను ఏర్పాటు చేశారు. వాటికి మేనేజర్లను కూడా నియమించారు. ఖమ్మం జిల్లా నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విడిపోవడంతో కొత్తగూడెం మార్కెట్ యార్డు ఆవరణలో జిల్లా మార్కెటింగ్ కార్యాలయం ఏర్పాటైంది. అయితే అందులో డీఎంఓతోపాటు మరొక అధికారి మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. సిబ్బంది కొరతతో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కార్యాలయాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. దీంతో అగ్రికల్చర్ డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ శాఖాధికారులు ఈ విషయాన్ని అధ్యయనం చేసి, తిరిగి యూటర్న్ తీసుకుని పాత పద్ధతిలోనే హైదరాబాద్ మినహా 9 ఉమ్మడి జిల్లాల్లో జిల్లా మార్కెటింగ్ కార్యాలయాలను మాత్రమే ఉంచాలని నిర్ణయించారు. ఈ మేరకు అగ్రికల్చర్ అండ్ కో–ఆపరేషన్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఇప్పటికే జీఓ కూడా విడుదలైంది. అయితే ప్రస్తుతానికి మాత్రంకొత్తగూడెం జిల్లా కేంద్ర కార్యాలయం నుంచే కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో జీఓ మినహా మరెలాంటి ఆదేశాలు రాకపోవడంతో జిల్లా మార్కెటింగ్ మేనేజర్ జె.నరేందర్ నేతృత్వంలోనే నడుస్తున్నాయి. ఉమ్మడి జిల్లా కేంద్రాలలో డీడీ స్థాయి అధికారిని, విభజన జిల్లాల్లో ఏడీ స్థాయి అధికారులను గతంలో వలె నియమించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎన్నికల అనంతరం ఉమ్మడి జిల్లా అయిన ఖమ్మంలో నూతనంగా ఏర్పాటైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మార్కెటింగ్ కార్యాలయం విలీనమై ఖమ్మం కేంద్రంగానే రెండు జిల్లాల కార్యకలాపాలు కొనసాగనున్నాయి. అయితే కొత్తగూడెం మార్కెట్ యార్డు సెక్రటరీనే విభజన జిల్లాల నిర్వహణను చూస్తారు. దీని ప్రకారం జిల్లా కేంద్రమైన కొత్తగూడెం మార్కెట్ యార్డులో ఉండే సెక్రటరీ జిల్లాలోని కార్యకలాపాలను పరిశీలిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో డీడీ స్థాయిలో ఉండే ఆర్.సంతోష్ కుమార్ ఉమ్మడి జిల్లా డీఎంఓగా బాధ్యతలు నిర్వహించనున్నారు. జీఓ నిజమే.. కానీ ఇంకా అమలుకాలేదు ఉమ్మడి జిల్లాల వారీగా మార్కెటింగ్ శాఖలను విలీనం చేస్తున్నమాట వాస్తవమే. ఈ మేరకు ప్రభుత్వం నుంచి జీఓ కూడా విడుదలైంది. అయితే ఎన్నికల నేపథ్యంలో ఇంకా అమలు కావడం లేదని భావిస్తున్నాం. భవిష్యత్తులో రెండు జిల్లాల కార్యకలాపాలు ఉమ్మడి ఖమ్మం జిల్లా కేంద్రం నుంచే జరుగుతాయి. – జె.నరేందర్, జిల్లా మార్కెటింగ్ శాఖాధికారి -
క్రియాశీలకంగా ‘గుడా’
– చైర్మన్, వైస్ చైర్మన్ నియామకంతో కార్యకలాపాలు వేగవంతం –‘గుడా’ పరిధికి ప్రత్యేక మాస్టర్‌ప్లాన్ – ప్రత్యేకాధికారిగా సంజయ్‌రత్నకుమార్ – రాజమహేంద్రవరంలో జోనల్ కార్యాలయం సాక్షి, రాజమహేంద్రవరం : కాకినాడ, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలు, చుట్టుపక్కల ప్రాంతాలను కలుపుతూ ఏర్పాటు చేసిన గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(గుడా) కార్యకలాపాల వైపు వేగంగా అడుగులు పడుతున్నాయి. గుడా చైర్మన్‌గా టీడీపీ సీనియర్ నేత గన్ని కృష్ణను నియమించిన ప్రభుత్వం కాకినాడలో ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు గతంలోనే ప్రకటించింది. తాజాగా రాజమహేంద్రవరంలోని నగరపాలక సంస్థ రెవెన్యూ కార్యాలయంలో గుడా జోనల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. గుడాకు ప్రత్యేక మాస్టర్‌ప్లాన్‌ను రూపాందించేందుకు నియమించిన ప్రత్యేక అధికారి సంజయ్‌రత్నకుమార్ బాధ్యతలు స్వీకరించారు. వైస్ చైర్మన్‌గా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ వి.విజయరామరాజు వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. గుడా పరిపాలనా కార్యకలాపాలకు సంబంధించి మంగళవారం వైస్ చైర్మన్ విజయరామరాజు అధ్యక్షతన మొదటి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గుడా పరిధిలోని కాకినాడ, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలు, పిఠాపురం, పెద్దాపురం, సామర్లకోట మున్సిపాలిటీలు, గొల్లప్రోలు నగరపంచాయతీల కమిషనర్లు, టౌన్‌ప్లానింగ్ అధికారులు, టౌన్‌ప్లానింగ్ విభాగం రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ సాయిబాబా, గుడా మాస్టర్‌ప్లాన్ తయారీ ప్రత్యేక అధికారి సంజయ్‌రత్నకుమార్ హాజరయ్యారు. గుడా పరిపాలనపై కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులకు వైస్ చైర్మన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇకపై గుడా పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ మెట్రోపాలిటన్ రీజియన్, అర్బన్ డెవలప్మెంట్ అ«థారిటీస్ చట్టం–2016 కింద జారీ అయిన ఉత్తర్వుల ప్రకారం నగరపాలక, పురపాలక సంఘాలు నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. దీనిలో భాగంగా ఇక నుంచి గుడా పరిధిలో భవనాల నిర్మాణం, ఇతర అనుమతుల కోసం గుడాకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆయా దరఖాస్తులను పరిశీలించిన అనంతరం గుడా వారికి అనుమతులు మంజూరు చేస్తుంది. అంతేకాక పురపాలక శాఖ విడుదల చేసిన జీవో 439 ప్రకారం నగర, పురపాలక సంఘాలు అభివృద్ధి చార్జీలు, బిల్డింగ్ ఫీజులు, లే అవుట్ల అనుమతులకు ఫీజులు ఆయా సంఘాలు గుడాకు జమ చేయాల్సి ఉంటుంది. ఇప్పటి నుంచి కొత్త నిర్మాణాలు, లే అవుట్లు చేపట్టాలంటే గుడా అనుమతి తప్పనిసరి. గుడా పరిధిలో లే అవుట్లు, భవనాల నిర్మాణాలకు ప్లాన్లు తయారు చేసే లైసెన్స్ సర్వేయర్లు తమ పేర్లు తప్పనిసరిగా గుడా వద్ద నమోదు చేయించుకోవాలని వైస్ చైర్మన్ తెలిపారు. ప్రత్యేక మాస్టర్‌ప్లాన్ రూపకల్పనకు చర్యలు గుడా పరిధిలోని ప్రాంతాలకు ప్రత్యేక మాస్టర్‌ప్లాన్ తయారు చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇందు కోసం రాష్ట్ర టౌన్ ప్లానింగ్ విభాగంలో ఉన్న ప్లానింగ్ అధికారి సంజయ్రత్నకుమార్ను గుడా ప్లానింగ్ అధికారిగా నియమించింది. ప్రస్తుతం ఆయన రాజమహేంద్రవరం కేంద్రంగా విధులు నిర్వర్తిస్తున్నారు. వైస్ చైర్మన్ రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ కావడంతో ఇక్కడే ఉంటున్నారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ మాస్టర్ ప్లాన్‌ను రూపాందించిన అనుభవం కమిషనర్‌కు ఉండడం గుడా మాస్టర్‌ప్లాన్ రూపకల్పనకు ఉపయోగపడనుంది. గుడాకు మాస్టర్‌ప్లాన్ రూపాందించి అమలు చేస్తే కాకినాడ, రాజమహేంద్రవరం నగరాల మధ్య అభివృద్ధి వేగవంతం అవుతుందని అధికారులు పేర్కొంటున్నారు. -
కోనసీమ ప్రత్యేక జిల్లాయే అందరి లక్ష్యం
కేఏఎస్ఎస్ అధ్యక్షుడు ఆర్వీ నాయుడు కొత్తపేట : కోనసీమ ప్రత్యేక జిల్లా సాధన ప్రతీఒక్కరి లక్ష్యం కావాలని కోనసీమ అభివృద్ధి సాధన సమితి (కేఏఎస్ఎస్) అధ్యక్షుడు ఆర్వీ నాయుడు పిలుపునిచ్చారు. కొత్తపేటలో సంఘ ప్రణాళిక కార్యదర్శి సత్తిరాజు ఆదిత్యకిరణ్ స్వగృహంలో బుధవారం సమితి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. బీజేపీ కిసాన్‌మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, సమితి వ్యవస్థాపకుడు పాలూరి సత్యానందం అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆర్వీ నాయుడు మాట్లాడారు. కోనసీమలో ఎన్నో ఆర్థిక వనరులున్నా, అవి కోనసీమ అభివృద్ధికి దోహదపడటం లేదని పేర్కొన్నారు. ఇక్కడి చమురు, సహజ వాయువు వంటివి ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కోనసీమ ప్రత్యేక జిల్లా ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. జిల్లా ఆవశ్యకతను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, కోనసీమలో మంత్రి, ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలను కలిసి, వారి మద్దతుతో ఈ డిమాండ్‌ను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాలని తీర్మానించారు. ఈ సమావేశంలో సమితి ప్రతినిధులు కముజు గంగాధరరావు, బండి రామకృష్ణ, అడ్డగాళ్ళ సాయిరాం, గాడి సత్తిబాబు, వాడపల్లి సూరిబాబు, మోకా సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు