serious actions
-
జార్వో... దూసుకొచ్చాడు మళ్లీ!
ఇంగ్లండ్‌కు చెందిన తుంటరి అభిమాని జార్వో మళ్లీ హద్దు మీరాడు. టీమిండియా డ్రెస్ వేసుకొని హల్చల్ చేస్తున్నాడు. ఇది ఒకసారైతే సరదాగా అనిపించినా... పదేపదే మైదానంలోకి దూసుకొస్తుండటం, ఆటగాళ్లను చేరుకోవడం, తాకటం క్రికెటర్ల భద్రతపై ఆందోళన రేకెత్తిస్తోంది. లార్డ్స్, లీడ్స్ వేదికల్లో జార్వో భారత ఆటగాడి వేషంతో మైదానంలోకి దిగాడు. అతని చేష్టలెంతగా ఉన్నాయంటే జట్టు సభ్యుడే అన్నట్లుగా ప్రవర్తిస్తాడు. ఇక ‘ది ఓవల్’లో అయితే అతని తుంటరితనం పరాకాష్టకు చేరింది. ఈసారి ఏకంగా బౌలింగ్ చేయడానికే వచ్చాడు. భౌతిక దూరం పాటించాల్సిన కరోనా కాలంలో ఇలా బయటి వ్యక్తులు ఆటగాళ్లను తాకడం ఏంటని పలువురు క్రికెటర్లు భద్రతా సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జార్వో చర్యను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సీరియస్‌గా తీసుకుంది. అతనిపై ఫిర్యాదు చేయడంతో సౌత్ లండన్ పోలీసులు జార్వోను అరెస్టు చేసినట్లు సమాచారం. -
పగులుతున్న పాపాల పుట్ట
సాక్షి, ఒంగోలు: జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి, అక్రమాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. గత ప్రభుత్వంలో టీడీపీ నాయకులు, మంత్రులు, కార్యకర్తలతో పాటు కార్యాలయాల్లోనే అధికారులు, ఉద్యోగులు చేతివాటం ప్రదర్శించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ భారీ మెజార్టీతో విజయం సాధించింది. టీడీపీ ఘోర ఓటమి పాలైంది. అనంతరం అధికారం చేపట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో పారదర్శక పాలనకు చర్యలు చేపట్టారు. అవినీతి, అక్రమాలకు తావు లేకుండా చూడాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ క్రమంలోనే అన్ని జిల్లాల్లో ప్రభుత్వ అధికారుల బదిలీలు జరిగాయి. కొత్తగా జిల్లాకు వచ్చి బాధ్యతలు చేపట్టిన అధికారులు ఆయా కార్యాలయాల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. దీంతో అవినీతి, అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. దివ్యాంగుల శాఖ ఏడీ లంచావతారం.. రెండు నెలల క్రితం వికలాంగుల శాఖలో అవినీతి లుకలుకలు బయటకు వచ్చాయి. ఆ శాఖ ఇన్చార్జ్ ఏడీగా పనిచేసిన బి.సింగయ్య ఒక స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుని నుంచి లంచం డిమాండ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయారు. అప్పటికే ఆయన మూడు శాఖలకు ఇన్చార్జ్గా ఉంటూ గత ప్రభుత్వం అండతో అందిన కాడికి దోచేశారు. స్వచ్ఛంద సంస్థల నుంచి లక్షల రూపాయలను లంచాల రూపంలో వసూలు చేసుకున్నట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఆయన్ను విధుల నుంచి పక్కన పెట్టి, వేరే జిల్లాకు బదిలీ చేశారు. డీఆర్డీఏ–వెలుగులో సీసీల చేతివాటం: జిల్లా గ్రామీణాభివృద్ధి (డీఆర్డీఏ), వెలుగు సంస్థలో పనిచేస్తూ పొదుపు మహిళల నిధుల స్వాహాకు పాల్పడిన ఇద్దరు సీసీల (కమ్యూనిటీ కో–ఆర్డినేటర్లు)పై ఆ శాఖ పీడీ జి.నరసింహులు వేటు వేశారు. వీరిని సస్పెండ్ చేయడంతో పాటు క్రిమినల్ కేసుకు ఆదేశించారు. ఈవీ సుచంద్రరావు గతంలో దొనకొండ మండలం అరివేముల క్లస్టర్ సీసీగా పనిచేసే సమయంలో ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు, స్త్రీనిధి సొమ్ము , గ్రామ ఆర్గనైజేషన్ నుంచి రూ.13.90 లక్షల నిధులను తన భార్య, తన బంధువుల ఖాతాలకు మళ్లించుకున్నాడు. ముందుగానే పథకం వేసుకున్న సీసీ సుచేంద్రరావు స్థానిక గ్రామ సమైక్య సంఘ సభ్యులను ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు, స్త్రీనిధి రుణాల కోసమని నమ్మించి వారి నుంచి ముందుగానే అదనపు చెక్‌లపై సంతకాలు చేయించుకున్నారు. అనంతరం నమ్మకంగా పెద్దగుడిపాడు గ్రామ సమాఖ్య సంఘం, గంగదేవి పల్లి గ్రామసమాఖ్య సంఘం, బేతేల్పురం గ్రామ సమాఖ్య సంఘం ఇలా పలు సంఘాల నుంచి పొదుపు మహిళల సొమ్మును నమ్మకంగా స్వాహా చేశాడు. అనంతరం ఇటీవల జరిగిన బదిలీలలో సీఎస్‌పురం మండలానికి బదిలీపై వెల్లారు. ఈయన స్థానంలో వచ్చిన సీసీ (కమ్యూనిటి కో–ఆర్డినేటర్)పాపారావు బాధ్యతలు చేపట్టారు. తరువాత కార్యాలయంలో రికార్డులు పరిశీలించడంతో నిధుల స్వాహా విషయం వెలుగు చూసింది. గతంలో పనిచేసిన సీసీ సుచేంద్రరరావు చేతివాటం బయటపడి చర్చనీయాంశమైంది. విషయం డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ దృష్టికి రావడంతో ఆయన మార్కాపురం వెలుగు ఏరియా కో–ఆర్డినేటర్‌తో విచారణ చేయించారు. విచారణలో నిధులు స్వాహా వాస్తవమని తేలింది. అవినీతికి పాల్పడిన వెలుగు సీసీపై సస్పెండ్ వేటు వేయడంతో పాటు క్రిమినల్ కేసుకు ఆదేశించారు. స్వాహా చేసిన నిధులను రికవరీ చేయాలని కూడా ఆదేశించారు. ఇదిలా ఉంటే కొండపి మండలం అనకర్ల పూడి క్లస్టర్ (సీసీ)పని చేస్తున్న వి.కోటేశ్వరమ్మ గతంలో ముండ్లమూరు మండలంలోని ఉల్లగల్లు సీసీగా పనిచేసేవారు. ఆ సమయంలో (ఇందిర ఎస్హెచ్గ్రూపు)కు సంబంధించిన సభ్యురాలు ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు ఉన్నతిపథకం కింద తప్పెట సుశీలమ్మ భర్త నాగేశ్వరరావుకు 2018–19 ఆర్ధిక సంవత్సరంలో రూ.50 వేలు మంజూరు చేశారు. అయితే ఇందిరా గ్రూపుపై తయారు చేసిన రూ.50 వేల చెక్‌ను సంబంధిత సభ్యురాలికి ఇవ్వకుండా ఇచ్చినట్లు రికార్డులో గ్రౌండింగ్ (నివేదిక) చూపించారు. ఈ విషయం కూడా ఇటీవల నిర్వహించిన విచారణలో వెలుగు చూసింది. దీనిపై విచారించిన డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ వాస్తవం తేలడంతో ఆమెపై కూడా సస్పెండ్ వేటు పడింది. బీసీ కార్పొరేషన్లో రూ.50.10 లక్షలు స్వాహా తాజాగా వెలుగులోకి... గత ప్రభుత్వ హయాంలో బీసీ కార్పొరేషన్ ఈడీగా పనిచేసిన ఎ.నాగేశ్వరరావు అవినీతి, అక్రమాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. ఆయన బదిలీపై వెళ్లిన తరువాత కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఈడీ కె.నాగముని కార్యాలయాన్ని ప్రక్షాళన చేస్తున్న సమయంలో గత ఈడీ బాగోతం బయటకు వచ్చింది. గత టీడీపీ ప్రభుత్వం బీసీలకు ఆదరణ–2 పథకంను ప్రవేశపెట్టింది. ఈ ఆదరణ పథకంలో బీసీలకు వివిధ పనిముట్లను రాయితీ కింద అందించేందుకు చర్యలు చేపట్టింది. వృత్తిని బట్టి ఇస్త్రీ పెట్టెలు, సన్నాయి, మేళం, నాయిబ్రాహ్మణులకు కుర్చీలు, మత్స్యకారులకు పడవలు, ఇంకా చేతి పనిముట్లను అందిస్తున్నారు. బీసీల ఓట్ల కోసం అప్పటి టీడీపీ ప్రభుత్వం కోట్ల రూపాయలను ఆదరణ పథకం కింద విడుదల చేశారు. అయితే యూనిట్‌కు లబ్ధిదారుల తమ వాటా ధనంగా చెల్లించిన సొమ్ము మొత్తాన్ని ఈడీ నాగేశ్వరరావు, కార్యాలయ ఉద్యోగులు స్వాహా చేసినట్లు ఇటీవల అధికారుల విచారణలో తేలింది. బీసీ కార్పొరేషన్ ఈడీ నాగేశ్వరరావు ఒక్కడే డైరెక్ట్‌గా నగదు డ్రా చేయకుండా కార్యాలయంలో పనిచేసే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ పావుగా వాడుకున్నాడు. మొత్తం రూ.50 లక్షలకు పైగా నిధులను దొడ్డిదారిన మింగేసేందుకు వ్యూహం పన్నాడు. ఇందుకు కార్యాలయ ఏఈవో ఎ.శ్రీనివాసరావు పేరు మీద రూ.8.05,000, జూనియర్ అసిస్టెంట్ వై.ఏడుకొండలు పేరు మీద రూ.12,23,500, వి.రాజేష్ (డేటా ఎంట్రీ ఆపరేటర్) పేరుమీద రూ.8,40,000, బి.వై.కమలేశ్వరరావు (డేటా ఎంట్రీ ఆపరేటర్) పేరు మీద రూ.5,50,000, మరో ఇద్దరు ఇతరుల పేరుమీద రూ.1,24,500, ఇంకొక వ్యక్తి పేరుమీద రూ.95,000, డీబీసీడబ్ల్యూవో కార్యాలయానికి చెందిన జూనియర్ అసిస్టెంట్ పివి.ఆంజనేయులు పేరుమీద రూ.45,000, తన (ఈడీ) పేరు మీద రూ.10,87, 500 లక్షల వరకు చెక్కుల రూపంలో బ్యాంకు డ్రా చేసినట్లు అధికారుల విచారణలో తేల్చారు. మొత్తం రూ.50,10,500 లక్షలను ఈడీ నాగేశ్వరరావు డ్రా చేశారు. డ్రా చేసిన నగదును కొంత ఆయా ఉద్యోగులకు ఇచ్చి మిగతా సొమ్ము ఈడీ నాగేశ్వరరావే స్వాహా చేసినట్లు విచారణ అధికారులు తేల్చారు. వీరితో పాటు కార్యాలయంలో కీలక సూత్రధారులుగా వ్యవహరించిన మహిళా సీనియర్ అసిస్టెంట్లు ఉన్నారు. వీరితో పాటు కార్యాలయ సబార్టినేట్ కూడా ఉన్నారు. వీరందరూ ఈడీ నాగేశ్వరరావు అవినీతి అక్రమాలకు సహకరించారన్న అభియోగం విచారణలో తేలింది. దీంతో మొత్తాన్ని ఉద్యోగాల నుంచి తొలగిస్తూ బీసీ కార్పొరేషన్ ఎండీ ఎం.రామారావు ఉత్తరుŠువ్ల జారీ చేశారు. వీరిపై క్రిమినల్ కేసులకు ఆదేశాలు జారీ చేశారు. బదిలీపై కృష్ణా జిల్లా మచిలీపట్నం వెళ్లిన ఈడీ నాగేశ్వరరావును కూడా సస్పెండ్ చేశారు. డ్వామాలోని వాటర్‌షెడ్ పథకంలో అవినీతిపై ఏపీడీపై వేటు.. జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా)లో గత ఐదేళ్ల కాలంలో అడ్డుఅదుపు లేని అవినీతి జరిగింది. అధికార పార్టీ అండతో అటు రాజకీయ నాయకులు, ఇటు కార్యాలయంలోని అధికారులు ఎవరికి వారే తమ పలుకుబడితో చేతివాటం ప్రదర్శించారు. గుట్టు చప్పుడు కాకుండా లక్షల్లో ప్రజా ధనం లూటీ చేశారు. అందులో ఇటీవల ఒకటి వెలుగు చూసింది. చీమకుర్తి మండలం సండ్రపాటు వాటర్ షెడ్ పథకంలో రూ.2.86 లక్షల నిధులు దుర్వినియోగం అయినట్లు ఇటీవల నిర్వహించిన ఆడిట్లో తేలింది. ఈ విషయాన్ని తమ పలుకుబడితో బయటకు రానీయకుండా కార్యాలయానికే పరిమితం చేశారు. విషయం తెలుసుకున్న ప్రాజెక్టు డైరెక్టర్ దృష్టికి సం బంధిత ఫైల్ని రానీయకుండా దాచిపెట్టారు. అనంతరం ఆయన ఇటీవల బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో శీనారెడ్డి ప్రాజెక్టు డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. పాత పీడీ హయాంలో మరుగున పెట్టిన ఫైల్ ప్రస్తుత ప్రాజెక్టు డైరెక్టర్ టేబుల్‌పైకి వచ్చింది. ఆయన పరిశీలించిన అనంతరం నిధుల స్వాహాకు బాధ్యులైన వారిపై చర్యలకు కలెక్టర్‌కు నివేదిక ఇచ్చారు. కలెక్టర్ ఆదేశాల మేరకు డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ శీనారెడ్డి ఏపీడీ భవానిని సస్పెండ్ చేశారు. ఈ అవినీతి 2016–17 ఆర్ధిక సంవత్సరంలో చీమకుర్తి మండలం సండ్రపాడు వాటర్ షెడ్ పథకం (డబ్ల్యూసీసీ) ఇన్చార్జ్ ప్రాజెక్టు ఆఫీసర్‌గా పనిచేసిన సమయంలో నిధుల దుర్వినియోగం జరిగింది. అప్పట్లో ఈమె అద్దంకి క్లస్టర్ ఏపీడీగా విధులు నిర్వహిస్తూనే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్ఆర్ఈజీఎస్) పథకం అడిషనల్ ప్రాజెక్టు డైరెక్టర్‌గా కూడా బాధ్యతలు చేపట్టారు. మొత్తం మూడు పోస్టులకు విధులు నిర్వర్తించారు. వెలుగులోకి రాని అక్రమాలు ఎన్నో... గత ప్రభుత్వం హయాంలో అటు రాజకీయ నాయకులు నీరు–చెట్టు పేరుతో అనేక కోట్ల ప్రజాధనాన్ని అప్పనంగా దోచేశారు. ఈ అవినీతిలో అప్పటి జిల్లా అధికారులు భాగస్వాములుగా ఉన్నారు. తమ వాటా ధనం తీసుకునే ప్రతి ఫైల్ని అడ్డగోలుగా నడిపారన్నది జగమెరిగిన సత్యం. కొన్ని అభివృద్ధి పనులు చేయకుండా అటు అధికారులు, ఇటు రాజకీయ నాయకులు పంచుకున్నవి ఎన్నో ఉన్నాయి. వాటన్నింటిపై ఏసీబీ, విజిలెన్స్ అధికారులతో విచారణ చేయిస్తే అవినీతి డొంక అంతా కదిలి, వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. -
ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం
సాక్షి, కర్నూలు(అగ్రికల్చర్) : ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని కలెక్టర్ ఎస్.సత్యనారాయణ అన్నారు. ఇసుక విధానంపై కలెక్టర్ శనివారం తన చాంబర్ నుంచి తహసీల్దార్లు, ఈవోఆర్డీలు తదితరులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం జిల్లా స్థాయి ఇసుక కమిటీ సభ్యులతో సమీక్షించారు. జిల్లాలోని 16 రీచ్‌ల నుంచి ఇసుక అక్రమంగా తరలించకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఉచిత ఇసుక విధానాన్ని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, అయితే ఇందులో దళారుల ప్రమేయాన్ని పూర్తిగా అరికట్టాలని సూచించారు. ఇసుక విధానం అమలుకు జిల్లా స్థాయిలో తాను చైర్మన్‌గా, జాయింట్ కలెక్టర్ కన్వీనర్‌గా ఉంటారని, డ్వామా పీడీ, పంచాయతీ రాజ్ ఎస్ఈ, డీపీవో, జెడ్పీ సీఈవోలు సభ్యులుగా ఉంటారని తెలిపారు. మండల స్థాయిలో తహసీల్దారు ఆధ్వర్యంలో కమిటీ ఉంటుందన్నారు. ప్రతి ఇసుక రీచ్‌కు డిప్యూటీ తహసీల్దారు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, ఈవోఆర్డీలను ఇన్‌చార్జ్‌లుగా నియమించాలన్నారు. ఏ రీచ్ నుంచి అక్రమంగా ఇసుక తరలినా ఆ ఇన్‌చార్జ్‌లే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. రీచ్‌లకు ఉపాధి హామీ నిధులతో రోడ్లు వేస్తామన్నారు. ప్రభుత్వ అభివృద్ధి పనులకు ఇసుక తరలించుకోవాలంటే విధిగా ప్రొసీడింగ్స్‌తో పాటు వాహనాలనంబ ర్లు, ఎన్ని ట్రిప్పుల ఇసుక అవసరం తదితర వివరాలు తెలియజేయాల్సి ఉంటుందన్నారు. ఇళ్ల నిర్మాణాలకు ఇసుక తీసుకోవాలంటే పక్కాగృ హం మంజూరు పత్రం ఉండాలన్నారు. ప్రయివేటు ఇళ్ల నిర్మాణాలకైతే పంచాయతీ సెక్రటరీల ధ్రువీకరణ అవసరమన్నారు. సమావేశంలో జా యింట్ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, జెడ్పీ సీఈవో విశ్వేశ్వరనాయుడు, డ్వామా పీడీ వెంకటసుబ్బయ్య, డీపీవో ప్రభాకర్‌రావు పాల్గొన్నారు. ప్రజా సమస్యలు వెంటనే పరిష్కరించండి డయల్ యువర్ కలెక్టర్, మీ కోసంలో వచ్చిన ప్రజా సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరం నుంచి డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాలకు చెందిన 26 మంది తమ సమస్యలను ఫోన్ ద్వారా కలెక్టర్ దృష్టికి తెచ్చారు. కమిషనర్‌కు అభినందన నగర పాలక సంస్థ కమిషనర్ హరినాథరెడ్డిని కలెక్టర్ సత్యనారాయణ అభినందించారు. నగరంలో అంగన్వాడీ కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించడం, మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టినందుకు జాతీయ స్థాయిలో స్కోచ్ అవార్డు లభించడంపై కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జేసీ–2 సుబ్బారెడ్డి, డీఆర్వో శశీదేవి, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. -
నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
సాక్షి, మెదక్ : నిర్ణీత గడువులోగా భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం పూర్తి చేయకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ధర్మారెడ్డి అధికారులను హెచ్చరించారు. శనివారం ఆయన కలెక్టరెట్లోని సమావేశ మందిరంలో భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంపై ఆర్డీఓలు, తహసీల్దార్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం విజయవంతం చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు. కార్యక్రమం చేపట్టి ఆరు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ పూర్తిస్థాయిలో జరగడం లేదన్నారు. ఈ పనితీరుతో తహసీల్దార్లు ఏ స్థాయిలో విధులు నిర్వర్తిస్తున్నారో తెలుస్తుందన్నారు. “డిజిటల్ సంతకాలు పూర్తయిన తర్వాత కూడా తప్పులు సరిచేస్తామంటే ఎలా ? అని మండిపడ్డారు. సంతకాలు చేసేటప్పుడు సరిచేసుకోవాలని తెలియదా? అని ప్రశ్నించారు. ఒకరిద్దరి అజాగ్రత్త వల్ల అందరికి సమస్యలు ఎదురవుతాయని, చివరకు ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందన్నారు. మండలం మొత్తంలో వంద సర్వే నంబర్లలో సమస్యలు ఉంటాయని, వాటినికూడా గుర్తించి పరిష్కరించకపోతే ఎలా? అన్నారు. భుజరంపేట గ్రామంలో సుమారు వెయ్యి ఎకరాలు పార్ట్–బీలో పెట్టారని అక్కడ 150 ఎకరాలు మాత్రమే అసైన్డ్ భూమి ఉంటే మొత్తం పార్ట్–బీలో ఎందుకు పెట్టారని సంబంధిత తహసీల్దార్‌ను ప్రశ్నించారు. సమయం పూర్తి కాగానే ఇంటికి వెళ్దాం అనే ధోరణి మార్చుకొని అందుబాటులో ఉండి కార్యక్రమం పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో జేసీ నగేశ్, డీఆర్ఓ రాములు, ఆర్డీఓలు నగేష్, మధు, తహసీల్దార్లు పాల్గొన్నారు. -
కొక్కొరొకో..
సాక్షి, అనంతపురం: సంక్రాంతి అంటే హరిదాసు సంకీర్తనలు. గొబ్బెమ్మలు గుర్తుకు వస్తాయి. అదే కోస్తా జిల్లాల్లో అయితే పందెంకోళుŠల్ కదనరంగంలో కాళ్లు దువ్వుతాయి. ఈ సంస్కృతి ‘అనంత’కు కూడా విస్తరించింది. అయితే జిల్లాలో కోడిపందేలు ఆడటం మామూలుగా జరుగుతున్నా సంక్రాంతి పండుగ సమయంలో కొంత ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల కోడిపందేలపై కొరడా ఝుళిపించాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) ఆదేశించడంతో జిల్లా పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. వారం రోజుల నుంచి కోడిపందేలపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రతి గ్రామంలోనూ దండోరాల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. ఈ ఏడాది ప్రత్యేకంగా 30 పోలీసు యాక్టు అమలు చేస్తున్నారు. ఐదు కన్నా ఎక్కువ మంది గుమికూడినా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఆ ఆరు డివిజన్లపై ప్రత్యేక దృష్టి జిల్లాలో ఎక్కువగా శింగనమల, తాడిపత్రి, హిందూపురం, కదిరి, అనంతపురం, గుంతకల్లు ప్రాంతాల్లో కోడిపందేలు నిర్వహిస్తారని పోలీసులు గుర్తించారు. దీంతో ఆయ ప్రాంతాల్లో పోలీసులు అలర్ట్ అయ్యారు. గతంలో కోడిపందేలు ఆడుతూ పట్టుబడిన వారిని వారం రోజులుగా పోలీస్స్టేషన్లకు పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించడం, తహసీల్దార్ల వద్ద బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటి వరకూ దాదాపు 271 మందికి పైగా కోడిపందేల నిర్వాహకులను బైండోవర్ చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకూ 18 మందిని అరెస్ట్ చేసి వారి నుంచి 46 కోళ్లు, 23 కత్తులు, రూ. 11530లు స్వాధీనం చేసుకున్నారు. నిఘా కోసం జాయింట్ యాక్షన్ బృందాలు హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం కోడి పందేలపై నిఘా ఉంచడానికి మండల స్థాయిలో జాయింట్ యాక్షన్ బృందాలను ఏర్పాటు చేశారు. రెవెన్యూ, పోలీసు, జంతు సంక్షేమ కమిటీ సభ్యులతో కూడిన ఈ బృందాల ద్వారా నిఘా పెట్టడంతో ప్రజలకు అవగాహన కల్పించాలని నిర్ణయించారు. ఎక్కడైనా తనిఖీలు చేసే అధికారాలు ఈ బృందాలకు అప్పగించారు. కోడిపందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం కోడిపందేలు నిర్వహించడం నిషేదం. ఆడితే కఠిన చర్యలు తీసుకుంటాం. నిర్వాహకులతో పాటు స్థలాలు ఇచ్చిన వారిపై కూడా కేసులు నమోదు చేస్తాం. సుప్రీంకోర్టు ఉత్తర్వులు అమలు చేసేందుకు ప్రజలు సహకరించాలి. లేదంటే కఠిన చర్యలు తప్పవు. – జీవీజీ అశోక్‌కుమార్, ఎస్పీ -
బాల్యవివాహాలు చేస్తే శిక్ష తప్పదు
కే.బ్రాహ్మణపల్లి (కదిరి అర్బన్) : బాల్యవివాహాలు చేయాలని చూస్తే చట్టపరంగా తల్లిదండ్రులకు శిక్ష తప్పనిసరి అని తహశీల్దార్ రామకష్ణారెడ్డి,ఎంపీడీఓ భాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని కే. బ్రాహ్మణపల్లిలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ప్రజాసేవాసమాజ్ సహాకారంతో మంగళవారం బాల్యవివాహాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులతో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. పలువురు వక్తలు మాట్లాడుతూ మండల పరిధిలోని దిగువపల్లి, మల్లయ్యగారిపల్లితండా, రెడ్డిపల్లితండా, ఎగుపల్లిగ్రామాల్లో బాల్యవివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయని కలెక్టర్‌కు ఫిర్యాదు అందిందన్నారు. అందుకే ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ఎక్కడైనా బాల్యవివాహాలు జరుగుతుంటే 1098 నంబరుకు ఫోన్‌చేసి తెలపాలన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ చెన్నకష్ణ, ఐసీడీఎస్ పడమర సీడీపీఓ విజయకుమారి, పాఠశాల హెచ్ఎం నారాయణరెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. -
అసైన్డ్ భూముల కబ్జాపై కఠిన చర్యలు
దుబ్బాక: నిరుపేద ఎస్సీ, ఎస్టీ కుటుంబాల్లో జీవన ప్రమాణాలు పెంచడానికి ప్రభుత్వాలు ఇచ్చిన అసైన్డ్ భూములను కబ్జాచేసిన ఆక్రమణదారులపై రాష్ట్ర ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ జిల్లా కమిటీ సభ్యుడు తౌడ శ్రీనివాస్ హెచ్చరించారు. బుధవారం స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో బతుకు దెరువు లేని దళితులకు బతుకునివ్వాలనే మంచి ఉద్దేశంతో ప్రభుత్వం భూములను పంచితే దళితుల అత్యవసరాలను కొంతమంది ఆసరా చేసుకుని నయానో, భయానో వారి భూములను లాక్కున్నారన్నారు. ప్రభుత్వమిచ్చిన భూముల్లో ఎస్సీ, ఎస్టీలకు చెందిన లబ్ధిదారుల ఆధీనంలోనే ఉండాలని, ఎస్సీ, ఎస్టీలు కాకుండా కబ్జాలో ఇతర వర్గాలుంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అసైన్డ్ భూములు ఎవరి కబ్జాలో ఉన్నాయో విచారణ చేపట్టాలని రెవెన్యూ అధికారులకు ఆయన సూచించారు. దళితుల నుంచి అసైన్డ్ భూములను స్వాధీనం చేసుకున్న ఇతర వర్గాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీలపై కులం పేరుతో దాడులు చేసినా, వారి భూములను ఆక్రమించిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని కోరారు.