దుబ్బాక: నిరుపేద ఎస్సీ, ఎస్టీ కుటుంబాల్లో జీవన ప్రమాణాలు పెంచడానికి ప్రభుత్వాలు ఇచ్చిన అసైన్డ్ భూములను కబ్జాచేసిన ఆక్రమణదారులపై రాష్ట్ర ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ జిల్లా కమిటీ సభ్యుడు తౌడ శ్రీనివాస్ హెచ్చరించారు.
బుధవారం స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో బతుకు దెరువు లేని దళితులకు బతుకునివ్వాలనే మంచి ఉద్దేశంతో ప్రభుత్వం భూములను పంచితే దళితుల అత్యవసరాలను కొంతమంది ఆసరా చేసుకుని నయానో, భయానో వారి భూములను లాక్కున్నారన్నారు.
ప్రభుత్వమిచ్చిన భూముల్లో ఎస్సీ, ఎస్టీలకు చెందిన లబ్ధిదారుల ఆధీనంలోనే ఉండాలని, ఎస్సీ, ఎస్టీలు కాకుండా కబ్జాలో ఇతర వర్గాలుంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అసైన్డ్ భూములు ఎవరి కబ్జాలో ఉన్నాయో విచారణ చేపట్టాలని రెవెన్యూ అధికారులకు ఆయన సూచించారు.
దళితుల నుంచి అసైన్డ్ భూములను స్వాధీనం చేసుకున్న ఇతర వర్గాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీలపై కులం పేరుతో దాడులు చేసినా, వారి భూములను ఆక్రమించిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని కోరారు.