అన్నదాతకు అందుబాటులో ‘మార్కెటింగ్ ’ సేవలు
అనంతపురం అగ్రికల్చర్ : వ్యవసాయ మార్కెట్ యార్డుల ద్వారా మార్కెటింగ్ శాఖ అందిస్తున్న వివిధ రకాల సేవలు రైతులు, వ్యాపారులు సద్వినియోగం చేసుకోవాలని ఆ శాఖ జిల్లా సహాయ సంచాలకులు బి.హిమశైల తెలిపారు.
రైతు బంధు పథకం :
మార్కెట్లో ధర తగ్గిపోయి రైతులకు గిట్టు బాటుధర లభించని సమయంలో పండిన సరుకును వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదాముల్లో నిల్వ ఉంచుకొని, సరుకు విలువపై 75 శాతం మొత్తాన్ని రూ.2,00,000 గరిష్ట పరిమితికి లోబడి రుణం పొందొచ్చు. అలా పొందిన రుణంపై 180 రోజుల వరకు (ఆరు నెలలు) ఎలాంటి వడ్డీ ఉండదు. అమరాపురంలో వక్క రైతులకు సదుపాయం కల్పించారు.
రైతు బజార్లు :
రైతులకు గిట్టు బాటు ధర కల్పించడం, వినియోగదారులు సరసమైన ధరలకు తాజా కూరగాయాలు అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా రైతు బజార్లను ఏర్పాటు చేశారు. రైతులు తాము పండించిన కూరగాయలు, పండ్లను జిల్లా కేంద్రంలో ఉన్న రైతుబజార్లో అమ్ముకొని మంచి ధర పొందొచ్చు.
భూసార పరీక్ష కేంద్రాలు :
తమ పొలాల్లో మట్టి నమూనాలను తీసుకొని వచ్చి భూసార పరీక్ష కేంద్రాల్లో పరీక్షించుకొని, తద్వారా ఎరువుల వాడకం చేపట్టాలి. పెనుకొండ, ధర్మవరం మార్కెట్ యార్డుల్లో భూసార పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. త్వరలో మరికొన్ని మార్కెట్‌యార్డుల్లో మట్టి పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
ధరల సమాచారం :
రోజూ రాష్ట్రంలోని మార్కెట్ కమిటీల పరిధిలోని వివిధ వ్యవసాయోత్పత్తుల కనిష్ట, గరిష్ట ధరల వివరాలను మార్కెట్ కమిటీలు పొందుపరుస్తాయి.
కనీస మద్దతు ధరలు :
కేంద్ర ప్రభుత్వం ఏటా ప్రధానమైన ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరలను (మినిమం సపోర్ట్ ప్రైజెస్ – ఎంఎస్పీ) ప్రకటిస్తుంది. మద్దతు ధర కన్నా మార్కెట్లో ధర తక్కువగా ఉన్నప్పుడు రైతును ఆదుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ నోడల్ ఏజెన్సీలైన నాఫెడ్, సీసీఐ, ఆయిల్ ఫెడ్, మార్క్‌ఫెడ్ సివిల్ సప్లై కార్పొరేషన్ ద్వారా వ్యవసాయోత్పత్తులను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తాయి. కనీస మద్దతు ధరల గురించి రైతులకు అవగాహన కల్పించడంతో పాటు కొనుగోలు కేంద్రాలకు అవసరమైన వసతులను మార్కెటింగ్ శాఖ కల్పిస్తుంది.
ఎలక్ట్రానిక్ తూకం వేసే విధానం :
సంప్రదాయ పద్ధతిలో ఉపయోగిస్తున్న తూకపు విధానం వల్ల రైతులు ఎక్కువగా నష్టపోవడానికి అవకాశం ఉంది. రైతులకు నష్టం జరగకుండా మార్కెట్ యార్డుల్లో ఎలాక్ట్రానిక్ తూకపు యంత్రాలను ఉపయోగించేలా చర్యలు చేపట్టాం.
ఈ.బిడ్డింగ్ విధానం :
వ్యవసాయోత్పత్తుల క్రయ,విక్రయాల్లో పారదర్శకత, సరళీకృతం చేసి రైతులకు మంచి ధరలు కల్పించడానికి ఈ–బిడ్డంగ్ విధానంలో అనంతపురం, హిందూపురం, కళ్యాణదుర్గం యార్డుల్లో క్రయవిక్రయాలు జరుగుతున్నాయి.
క్రయ,విక్రయ మార్కెట్లు :
జిల్లాలో ఉన్న కొన్ని మార్కెట్‌యార్డుల్లో క్రయ విక్రయాలు జరుగుతున్నందున రైతులు వాటిని వినియోగించుకోవాలి. అనంతపురంలో పశువులు, గొర్రెలు, మేకల సంతతో పాటు చీనీకాయలు, కర్బూజా, కళింగర, దానిమ్మ, ఇతరత్రా పండ్లు అమ్ముకోవచ్చు. తాడిపత్రిలో చీనీకాయలు, హిందూపురం, కళ్యాణదుర్గంలో చింతపండు అమ్మకాలు, కదిరిలో చింతపండు, పశువులు, గొర్రెలు, మేకల సంత, అలాగే గోరంట్లలో పశువుల సంత జరుగుతుంది. మామిడి, అరటి మాగబెట్టేందుకు కొన్ని మార్కెట్ యార్డుల్లో రైపనింగ్ ఛాంబర్ల నిర్మాణం జరుగుతోంది. అనంతపురం యార్డులో చీనీకాయల గ్రేడింగ్ పరికరం అందుబాటులో ఉంది.