Servicing Center
-
ఇదేందయ్యా ఇది.. రూ.11 లక్షల కారు రిపేరుకు రూ.22 లక్షలు!
సాక్షి, బెంగళూరు: వరదలతో పాడైపోయిన కారును బాగు చేయించుకుందామనుకున్న ఓ వ్యక్తికి విచిత్రమైన సంఘటన ఎదురైంది. తన కారు రిపేర్ కోసం సర్వీస్ సెంటర్ వాళ్లు ఇచ్చిన ఎస్టిమేట్ స్లిప్ చూసి అవాక్కయ్యాడు. రూ.11 లక్షల విలువైన వోక్స్వాగన్ పోలో హ్యాచ్‌బ్యాక్ కారును రిపేర్ చేసేందుకు రూ.22 లక్షలు అవుతుందని అంచనా వేశారు. తనకు ఎదురైన ఈ సంఘటనను లింక్డ్ఇన్లో షేర్ చేశారు అనిరుధ్ గణేశ్. బెంగళూరులో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గణేశ్ కారు పాడైపోయింది. పూర్తిగా నీటిలో మునిగిపోవటంతో ఇంజిన్ పనిచేయటం లేదు. దాంతో వోక్స్‌వాగ్ సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లారు గణేశ్. సుమారు 20 రోజుల తర్వాత కారు సర్వీస్ కోసం రూ.22 లక్షలు అవుతుందని అంచనా వేసి పంపించారు. దీంతో ఇన్సూరెన్స్ సంస్థను సంప్రదించారు గణేశ్. కారు పూర్తిగా పాడైపోయిందని, దానిని రిపేర్ సెంటర్ నుంచి తీసుకెళ్తామని అధికారులు తెలిపారు. అయితే.. అక్కడి నుంచి తీసుకెళ్లాలంటే రూ.44,840 చెల్లించాలని సర్వీస్ సెంటర్ వాళ్లు చెప్పటంతో మరోమారు అవాక్కవ్వాల్సి వచ్చింది. కారు డ్యామేజ్ అంచనా వేసేందుకు పత్రాలు సిద్ధం చేసినందుకు గానూ ఆ ఫీజు కట్టాలని సూచించారు. ఈ విషయంపై వోక్స్వాగన్ సంస్థకు ఫిర్యాదు చేశారు గణేశ్. చివరకు రూ.5000 వేలు కట్టి కారు తీసుకెళ్లాలని సంస్థ సూచించింది. కారు రిపేరు కోసం ఇచ్చిన ఎస్టిమేషన్ స్లిప్ ఇదీ చదవండి: దసరా ఎఫెక్ట్: హైవేలపై పెరిగిన వాహనాల రద్దీ -
త్వరలో ఆర్టీసీ సర్వీసింగ్ సెంటర్లు
సాక్షి, అమరావతి: ఆదాయ మార్గాలు పెంచుకునే దిశగా ఆర్టీసీ సన్నాహాలు ముమ్మరం చేసింది. ప్రధానంగా రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీకి ఉన్న విలువైన భూములను వాణిజ్య అవసరాలకోసం సద్వినియోగం చేసుకోవడంపై దృష్టిసారించింది. ఆర్థిక శాఖ సూచనలతో ఈ దిశగా కార్యాచరణ ముమ్మరం చేసింది. అందులో భాగంగా ఆర్టీసీ గ్యారేజీలు, డిపోలను ప్రైవేట్ వాహనాల సర్వీసింగ్ సెంటర్లుగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. ఆర్టీసీకి ప్రస్తుతం రాష్ట్రంలో విలువైన ప్రదేశాల్లో గ్యారేజీలు, డిపోలు ఉన్నాయి. ఒక్కో గ్యారేజీ పది ఎకరాల్లోను, డిపోలు ఆరేడు ఎకరాల్లోను విస్తరించి ఉన్నాయి. వాటిలో ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల సర్వీసింగ్ చేస్తున్నారు. అదే గ్యారేజీలు, డిపోల్లో ప్రైవేటు వాహనాలకు కూడా సర్వీసింగ్ సేవలు అందించాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఇప్పటికే ఆర్టీసీ విజయనగరం, ఏలూరు, కర్నూలుల్లో టైర్ సర్వీసింగ్ సెంటర్లను నిర్వహిస్తోంది. అదే రీతిలో రాష్ట్రంలోని ఆర్టీసీ గ్యారేజీలు, డిపోలలో పూర్తిస్థాయిలో ఆటోమొబైల్ సర్వీసింగ్ సెంటర్లుగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. ఈ మేరకు కార్యాచరణ చేపట్టేందుకు అధికారుల కమిటీని నియమించింది. తక్కువ చార్జీతో మెరుగైన సేవలు ప్రైవేటు సర్వీసింగ్ సెంటర్ల కంటే మెరుగైన రీతిలో తక్కువ ధరకు వాహనాల సర్వీసింగ్ సేవలను అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. సాధారణ సర్వీసింగ్, అన్ని రకాల రిపేర్లు, బాడీ పెయింటింగ్, వాటర్ సర్వీసింగ్ మొదలైన సేవలు అందిస్తారు. ఆర్టీసీ టెక్నికల్ స్టాఫ్ స్కిల్డ్ సేవలు అందిస్తారు. అన్‌స్కిల్డ్ సేవల కోసం అవుట్ సోర్సింగ్ విధానంలో సిబ్బందిని నియమిస్తారు. ప్రస్తుతం గ్యారేజీల్లో ఉన్న మౌలిక వసతులతోపాటు అవసరమైన యంత్ర పరికరాలు కొనుగోలు చేస్తారు. ఆర్టీసీ వాహనాలు, ప్రైవేటు వాహనాలకు వేర్వేరుగా ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను ఏర్పాటు చేస్తారు. ఆర్టీసీ వాహనాల స్పేర్ పార్టులు, ప్రైవేటు వాహనాల స్పేర్ పార్టులకు వేర్వేరుగా స్టోర్ రూమ్‌లు, రికార్డులు నిర్వహిస్తారు. తద్వారా ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా చూస్తారు. తొలిదశలో భారీ వాహనాలకు సర్వీసింగ్ సేవలను అందుబాటులోకి తెస్తారు. అనంతరం కార్లు, ఎస్‌యూవీలు, ఇతర వాహనాల సర్వీసింగ్ అందిస్తారు. తొలిదశలో నాలుగైదు కేంద్రాల్లో రెండు నెలల్లో సర్వీసింగ్ సేవలను ప్రారంభించాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. అనంతరం అన్ని ఆర్టీసీ డిపోలు, గ్యారేజీల్లో ప్రైవేటు వాహనాల సర్వీసింగ్ సేవలను విస్తరించనున్నారు. ప్రైవేటు సర్వీసింగ్ కేంద్రాల కంటే మెరుగైన రీతిలో తక్కువ చార్జీలకు ఆర్టీసీ ఆటోమొబైల్ సర్వీసింగ్ సేవలు అందించేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఆర్టీసీ ఈడీ కృష్ణమోహన్ చెప్పారు. -
పని చేసే చోటే చోరీ!!... అయితే చివరికి...
గచ్చిబౌలి: పని చేసే గ్యారేజ్‌కు కన్నం వేసిన ఓ మెకానిక్ భారీ చోరీకి పాల్పడి కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు వివరాలు వెల్లడించారు. అసీఫ్‌నగర్‌కు చెందిన మహ్మద్ తాహెర్ అయ్యప్పసొసైటీలోని శ్రీ మోటార్స్ మల్టీబ్రాండ్ లగ్జరీ కారు సర్వీసింగ్ సెంటర్లో మెకానిక్‌గా పని చేస్తున్నారు. షోరూం యజమాని గేడంపేట్లో మరో షోరూమ్‌ను ఏర్పాటు చేసేందుకు నగదు తీసుకువచ్చి సర్వీసింగ్ సెంటర్లోని అల్మారా పెట్టాడు. ఈ విషయాన్ని గుర్తించిన తాహెర్ నగదు కాజేసేందుకు తన స్నేహితులైన సయ్యద్ జావెద్, సైఫ్ మొయినొద్ధీన్తో కలిసి పథకం పన్నాడు. తెల్లవారు జాము ముగ్గురు కలిసి బైక్‌పై గ్యారేజ్‌కు వచ్చారు. తాహెర్ దూరంగా ఉండి వచ్చిపోయేవారిని గమనిస్తుండగా, సైఫ్ మొయినొద్ధీన్ సర్వీస్ సెంటర్ వెనక డోర్ స్క్రూలు తొలగించి లోపలికి ప్రవేశించాడు. లాకర్‌ను తెరిచి నగదు తీసుకెళ్లాడు. మర్నాడు వాచ్మెన్ బాలరాజు అల్మారా తలుపు తెలిచి ఉండటాన్ని గుర్తించి యజమానికి సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడు తాహెర్గా గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా చోరీ చేసినట్లు అంగీకరించాడు. అతడు ఇచ్చిన సమాచారంతో మిగతా నిందితులను అరెస్టు చేసి వారి నుంచి రూ.55 లక్షల నగదు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. చోరీ సొత్తు మూడు భాగాలుగా.. చోరీ చేసిన సొమ్మును తాహెర్ రూ.20 లక్షలు, జావెద్ రూ.20 లక్షలు, సైఫ్ మొయినొద్ధీన్ రూ.15 లక్షలు పంచుకున్నారు. అయితే ఇందులోంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. తనపై అనుమానం రాకుండా ఉండేందుకు తాహెర్ యథావిధిగా సర్వీసింగ్ సెంటర్‌కు వస్తున్నాడు. దాదాపు 45 మందిని విచారించిన పోలీసులు చివరికి తాహెర్‌ను నిందితుడిగా గుర్తించారు. సమావేశంలో మాదాపూర్ ఏసీపీ రఘునందన్ రావు, సీఐ రాజేంద్ర ప్రసాద్, ఎస్ఓటీ సీఐ శివ ప్రసాద్, ఎస్ఐ విజయ వర్ధన్ పాల్గొన్నారు. -
రూ.200 కోసం!
మన కారో.. బైకో నెలకోసారైనా వాటర్ సర్వీసింగ్‌కు ఇస్తుంటాం. అయితే ఆ డబ్బులు ఎందుకు వృథా చేయడం అనుకున్నవారు ఏం చేస్తారు. ఇంట్లోనే బకెట్లో నీరు తీసుకుని ఎంచక్కా పొద్దున్నే శుభ్రం చేసుకుంటారు. అయితే ఓ చైనీయుడు మాత్రం రూ.200ను ఆదా చేసుకునేందుకు ఓ చెత్త ఆలోచన చేశాడు. ఆ తర్వాత నాలుక్కరుచుకున్నాడు. చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌కు చెందిన ఓ వ్యక్తి తన ఖరీదైన ల్యాండ్‌రోవర్ ఎస్‌యూవీని కడుక్కోవాలనుకున్నాడు. అయితే అందుకు రూ.200 ఖర్చు అవుతుందని వెనుకడుగు వేశాడు. అంతేకాదు ఎంచక్కా తనే శుభ్రం చేయాలని భావించాడు. అదేదో తన ఇంటిలోనే కడిగితే ఇది వార్తే కాదు. ఇంతకీ అతడేం చేశాడంటే.. దగ్గర్లో ఉన్న నదిలో కారును శుభ్రం చేయాలని భావించాడు. అనుకున్నదే తడవు అక్కడికి వెళ్లి ఒడ్డుకు దగ్గరగా తక్కువ ప్రవాహం ఉన్న ప్రాంతంలోకి కారును దింపి.. శుభ్రం చేసుకుంటున్నాడు. అయితే అప్పుడే పక్కనే ఉన్న డ్యాం నుంచి గేట్లు తెరిచారు. దీంతో ఆ కారున్న చోటికి నీటి ప్రవాహం పెరిగింది. వెంటనే మనోడు పక్కనే ఉన్న ఓ బండరాయిపైకి చేరుకున్నాడు. కానీ వెళ్లిపోతున్న కారును తీసుకురాలేకపోయాడు. వెంటనే అక్కడున్న జనం ఫైర్ సిబ్బందికి ఫోన్ చేయడంతో వారు హుటాహుటిన అక్కడికి చేరుకుని కారును ఒడ్డుకు చేర్చారు. దీనికి సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమంలో పెట్టడంతో నెటిజన్లు జోకుల మీద జోకులు పేలుస్తున్నారు. పాపం రూ.200ల కోసం చూసుకుంటే దాదాపు 50 లక్షల కారును పోగొట్టుకునే వాడు పాపం! -
ఆన్లైన్లో జాగ్రత్త సుమా!
తక్కువ ధరకు వస్తోంది కదా అని శ్రీనివాస్ ఆన్లైన్లో ల్యాప్‌టాప్ కొన్నాడు. రెండునెలలు వాడాక బాగా స్లోగా ఉండటంతో హార్డ్‌వేర్ నిపుణుడైన స్నేహితుడికి చూపించగా... దాన్లో నాసిరకం విడిభాగాలున్నట్లు చెప్పాడు. కంపెనీ సర్వీసింగ్ సెంటర్‌కి తీసుకెళ్లి చూపిస్తే అది ఆథరైజ్డ్ డీలర్ వద్ద కొన్నది కాదని, వారంటీ ఇవ్వలేమని చెప్పేశారు. నచ్చకుంటే తిరిగి పంపడానికి ఆన్లైన్ కంపెనీ ఇచ్చిన గడువు అప్పటికి పూర్తయిపోవటంతో చేసేదేమీ లేక తలపట్టుకున్నాడు.సుకుమార్‌ది మరో కథ. ఆన్లైన్లో ఫోన్ కొన్నాడు. ఫోన్ బాగానే ఉంది. వారం రోజులు వాడాక మోజు తీరింది. నచ్చకపోతే తిరిగి పంపడానికి కంపెనీ ఇచ్చిన గడువింకా ఉండటంతో వెనక్కి పంపేశాడు. కంపెనీ తిరిగి తీసుకుని.. డబ్బులు ఆన్లైన్లోనే వెనక్కిచ్చేసింది. సుకుమార్‌కు మొబైల్ పంపిన కంపెనీ (సెల్లర్) నిజానికి పక్కాగా ఒరిజినల్ వస్తువులు పంపేదే. కానీ సుకుమార్ తిరిగి పంపేయటంతో ఆన్లైన్ కంపెనీ నిబంధనల ప్రకారం దాన్ని వెనక్కి తీసుకోక తప్పలేదు. ఆ వస్తువు వాడేసింది కావటంతో పూర్తి ధరకు అమ్ముకునే అవకాశం లేకుండా పోయింది. నష్టపోవటం సెల్లర్ వంతయింది. ఇవండీ ఆన్లైన్ కథలు... నిజానికివన్నీ చిన్నచిన్న సమస్యలే. తక్కువ మందికి పరిమితమైనవే. కానీ ఇప్పుడిప్పుడే వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత ఈ-కామర్స్ రంగంపై వీటి ప్రభావం మాత్రం తక్కువేమీ కాదు. ఈ-కామర్స్ బూమ్‌ను ఆసరా చేసుకుని కొందరు విక్రేతలు నాసిరకం ఉత్పత్తులను, కొత్తగా మార్చిన పాత ఉత్పత్తులను అంటగడుతున్నారు. కొందరు కస్టమర్లు ప్రొడక్టులో లోపంలేకున్నా.. నచ్చలేదంటూ వెనక్కిచ్చేస్తున్నారు. ప్యాక్‌లో రాళ్లు వచ్చాయనేవారు కొందరైతే... విడిభాగాలను మార్చేసే కస్టమర్లు మరికొందరు. ఇవన్నీ ఈ-కామర్స్ రంగం ముందున్న సవాళ్లు. రిటర్న్స్ పాలసీ మారాలా? ఉత్పత్తికి ఏదైనా నష్టం వాటిల్లినా, లోపమున్నా వెనక్కిచ్చి కొత్తది పొందొచ్చు. డబ్బులూ వెనక్కి పొందొచ్చు. ప్రొడక్ట్ నచ్చకపోయినా మార్చుకోవచ్చు. విభాగం, ఈ-కామర్స్ కంపెనీనిబట్టి కస్టమర్లు 7-30 రోజుల్లో ఉత్పత్తులను వెనక్కి పంపే వీలుంది. కస్టమర్ల డబ్బులకు రక్షణ కల్పించేందుకే ఈ-కామర్స్ కంపెనీలు రిటర్న్స్ పాలసీని పాటిస్తున్నాయి. కస్టమర్లు ఫిర్యాదు చేస్తే విక్రేతలు ఆ ఉత్పత్తిని వెనక్కి తీసుకోవాల్సిందే. లేకపోతే ఆన్లైన్ కంపెనీలు విక్రేతలకు చెల్లింపులను నిలిపివేస్తాయి. ఎలక్ట్రానిక్స్‌లోనే అధిక నకిలీలు... అంతర్జాతీయ బ్రాండ్ల పేరిట నాసిరకం ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు వచ్చేస్తున్నాయి. భారత ఎలక్ట్రానిక్స్ మార్కెట్లో ఈ నకిలీల వాటా 5 శాతంతో రూ.2,500 కోట్ల వరకూ ఉంటుందని అంచనా కాగా ఇది 2015లో రూ.5,600 కోట్లకు చేరుకుంటుందని ఈ మధ్య టెలికం మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్వయంగా చెప్పారు. నియంత్రణ లేకపోవటంతో ఇవి ఆన్‌లైన్‌లోకి చొరబడుతున్నాయి. ఉదాహరణకు రవికిరణ్ అనే కార్పొరేట్ ఉద్యోగి అలీబాబాకు చెందిన అలీ ఎక్స్‌ప్రెస్.కామ్‌లో రూ.6,500 విలువగల లెనోవో స్మార్ట్‌ఫోన్ బుక్ చేశారు. ఆయనకు నకిలీది రావటంతో కంపెనీకి ఫిర్యాదు చేశాడు. విక్రేత ఆ ఫోన్‌తో పాటు రూ.4 వేలు పరిహారంగా చెల్లించాడు. ఆన్లైన్ కంపెనీలపై ఫిర్యాదులు పెరుగుతున్నాయని, అధీకృత రిటైలర్ల వద్ద కొంటే సమస్యలుండవని సిరి కమ్యూనికేషన్స్ ప్రమోటర్ ఎం.చిరంజీవి, టెక్నోవిజన్ ఎండీ సికందర్ చెప్పారు. మోసాల ప్రభావం ఇదీ... కొందరు కస్టమర్లు విడిభాగాలను మార్చి, ఉత్పత్తి బాగులేదన్న కారణంతో తిరిగి పంపేస్తారు. ఐటీ ఉత్పత్తుల విక్రయాల్లో ఉన్నవారు ఎక్కువగా ఇలాంటివి చేస్తుండటంతో ఐటీ ఉత్పత్తుల దుకాణాలు అధికంగా ఉన్న అమీర్‌పేట, సికింద్రాబాద్ ప్రాంతాలకు డెలివరీ ఇచ్చేందుకు ఈ-రిటైలర్లు నో చెబుతున్నారు. ఆన్లైన్ వల్ల తమ అమ్మకాలు పడిపోయాయని, అందుకే తామూ ఆన్‌లైన్‌లోకి వెళ్లామనేది వ్యాపారి హమీద్ మాట. ఆన్లైన్ ధరల పోటీని తట్టుకోవడానికి ఒకోసారి విడిభాగాలను మారుస్తున్నట్లు అంగీకరించారాయన. ‘‘ఒరిజినల్ 2జీబీ ర్యామ్ రూ.2,500, హార్డ్ డిస్క్ 1 టీబీది రూ.4 వేల దాకా ఉంటుంది. వీటిని మార్చకపోతే మరీ తక్కువ ధరకు అమ్మటం కష్టం’ అన్నారాయన. మరో వ్యాపారి రవీందర్ మాట్లాడుతూ... ‘‘డెల్ ఐ3 3541 మోడల్ డీలర్ ధర రూ.29,500. హైదరాబాద్‌లోని గ్రే మార్కెట్ వ్యాపారులకు రూ.23 వేలకే వస్తోంది. వారు ఆన్లైన్లో తక్కువ లాభానికే అమ్ముతున్నారు’’ అని చెప్పారు. తాము ఒరిజినల్ వస్తువులు విక్రయిస్తున్నా 10 శాతంపైగా వస్తువులు వెనక్కి రావడంతో ఆన్‌లైన్‌కు గుడ్‌బై ెప్పేశామని మొబైల్ వ్యాపారి శ్రీనివాస్ వెల్లడించారు. ‘‘ల్యాప్‌టాప్‌లు 7వేల వరకూ అమ్మితే 1500 వరకూ తిరిగొచ్చేశాయి. వీటిలో అధికం అమీర్‌పేట్, సికింద్రాబాద్ ప్రాంతాలకు డెలివరీ ఇచ్చినవే. అందుకే ఆన్‌లైన్‌కు గుడ్‌బై చెప్పేశాం’’ అన్నారాయన. సీటీసీకి చెందిన 80 శాతం మంది వ్యాపారులు ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ నుంచి తప్పుకున్నట్లు మరో వ్యాపారి నిజాముద్దీన్ చెప్పారు. - హైదరాబాద్, బిజినెస్ బ్యూరో