ఆన్‌లైన్‌లో జాగ్రత్త సుమా! | online shopping be careful | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌లో జాగ్రత్త సుమా!

Published Wed, Jan 14 2015 2:09 AM | Last Updated on Sat, Sep 2 2017 7:39 PM

ఆన్‌లైన్‌లో జాగ్రత్త సుమా!

ఆన్‌లైన్‌లో జాగ్రత్త సుమా!

తక్కువ ధరకు వస్తోంది కదా అని శ్రీనివాస్ ఆన్‌లైన్లో ల్యాప్‌టాప్ కొన్నాడు. రెండునెలలు వాడాక బాగా స్లోగా ఉండటంతో హార్డ్‌వేర్ నిపుణుడైన స్నేహితుడికి చూపించగా... దాన్లో నాసిరకం విడిభాగాలున్నట్లు చెప్పాడు. కంపెనీ సర్వీసింగ్ సెంటర్‌కి తీసుకెళ్లి చూపిస్తే అది ఆథరైజ్డ్ డీలర్ వద్ద కొన్నది కాదని, వారంటీ ఇవ్వలేమని చెప్పేశారు. నచ్చకుంటే తిరిగి పంపడానికి ఆన్‌లైన్ కంపెనీ ఇచ్చిన గడువు అప్పటికి పూర్తయిపోవటంతో చేసేదేమీ లేక తలపట్టుకున్నాడు.సుకుమార్‌ది మరో కథ. ఆన్‌లైన్లో ఫోన్ కొన్నాడు. ఫోన్ బాగానే ఉంది. వారం రోజులు వాడాక మోజు తీరింది. నచ్చకపోతే తిరిగి పంపడానికి కంపెనీ ఇచ్చిన గడువింకా ఉండటంతో వెనక్కి పంపేశాడు. కంపెనీ తిరిగి తీసుకుని.. డబ్బులు ఆన్‌లైన్లోనే వెనక్కిచ్చేసింది.
 
 సుకుమార్‌కు మొబైల్ పంపిన కంపెనీ (సెల్లర్) నిజానికి పక్కాగా ఒరిజినల్ వస్తువులు పంపేదే. కానీ సుకుమార్ తిరిగి పంపేయటంతో ఆన్‌లైన్ కంపెనీ నిబంధనల ప్రకారం దాన్ని వెనక్కి తీసుకోక తప్పలేదు. ఆ వస్తువు వాడేసింది కావటంతో పూర్తి ధరకు అమ్ముకునే అవకాశం లేకుండా పోయింది. నష్టపోవటం సెల్లర్ వంతయింది. ఇవండీ ఆన్‌లైన్ కథలు... నిజానికివన్నీ చిన్నచిన్న సమస్యలే. తక్కువ మందికి పరిమితమైనవే. కానీ ఇప్పుడిప్పుడే వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత ఈ-కామర్స్ రంగంపై వీటి ప్రభావం మాత్రం తక్కువేమీ కాదు. ఈ-కామర్స్ బూమ్‌ను ఆసరా చేసుకుని కొందరు విక్రేతలు నాసిరకం ఉత్పత్తులను, కొత్తగా మార్చిన పాత ఉత్పత్తులను అంటగడుతున్నారు. కొందరు కస్టమర్లు ప్రొడక్టులో లోపంలేకున్నా.. నచ్చలేదంటూ వెనక్కిచ్చేస్తున్నారు. ప్యాక్‌లో రాళ్లు వచ్చాయనేవారు కొందరైతే... విడిభాగాలను మార్చేసే కస్టమర్లు మరికొందరు. ఇవన్నీ ఈ-కామర్స్ రంగం ముందున్న సవాళ్లు.
 
 రిటర్న్స్ పాలసీ మారాలా?
 ఉత్పత్తికి ఏదైనా నష్టం వాటిల్లినా, లోపమున్నా వెనక్కిచ్చి కొత్తది పొందొచ్చు. డబ్బులూ వెనక్కి పొందొచ్చు. ప్రొడక్ట్ నచ్చకపోయినా మార్చుకోవచ్చు. విభాగం, ఈ-కామర్స్ కంపెనీనిబట్టి కస్టమర్లు 7-30 రోజుల్లో ఉత్పత్తులను వెనక్కి పంపే వీలుంది. కస్టమర్ల డబ్బులకు రక్షణ కల్పించేందుకే ఈ-కామర్స్ కంపెనీలు రిటర్న్స్ పాలసీని పాటిస్తున్నాయి. కస్టమర్లు ఫిర్యాదు చేస్తే విక్రేతలు ఆ ఉత్పత్తిని వెనక్కి తీసుకోవాల్సిందే. లేకపోతే ఆన్‌లైన్ కంపెనీలు విక్రేతలకు చెల్లింపులను నిలిపివేస్తాయి.
 
 ఎలక్ట్రానిక్స్‌లోనే అధిక నకిలీలు...
 అంతర్జాతీయ బ్రాండ్ల పేరిట నాసిరకం ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు వచ్చేస్తున్నాయి. భారత ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌లో ఈ నకిలీల వాటా 5 శాతంతో రూ.2,500 కోట్ల వరకూ ఉంటుందని అంచనా కాగా ఇది 2015లో రూ.5,600 కోట్లకు చేరుకుంటుందని ఈ మధ్య టెలికం మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్వయంగా చెప్పారు. నియంత్రణ లేకపోవటంతో ఇవి ఆన్‌లైన్లోకి చొరబడుతున్నాయి. ఉదాహరణకు రవికిరణ్ అనే కార్పొరేట్ ఉద్యోగి అలీబాబాకు చెందిన అలీ ఎక్స్‌ప్రెస్.కామ్‌లో రూ.6,500 విలువగల లెనోవో స్మార్ట్‌ఫోన్ బుక్ చేశారు. ఆయనకు నకిలీది రావటంతో కంపెనీకి ఫిర్యాదు చేశాడు. విక్రేత ఆ ఫోన్‌తో పాటు రూ.4 వేలు పరిహారంగా చెల్లించాడు. ఆన్‌లైన్ కంపెనీలపై ఫిర్యాదులు పెరుగుతున్నాయని, అధీకృత రిటైలర్ల వద్ద కొంటే సమస్యలుండవని సిరి కమ్యూనికేషన్స్ ప్రమోటర్ ఎం.చిరంజీవి, టెక్నోవిజన్ ఎండీ సికందర్ చెప్పారు.
 
 మోసాల ప్రభావం ఇదీ...
 కొందరు కస్టమర్లు విడిభాగాలను మార్చి, ఉత్పత్తి బాగులేదన్న కారణంతో తిరిగి పంపేస్తారు. ఐటీ ఉత్పత్తుల విక్రయాల్లో ఉన్నవారు ఎక్కువగా ఇలాంటివి చేస్తుండటంతో ఐటీ ఉత్పత్తుల దుకాణాలు అధికంగా ఉన్న అమీర్‌పేట, సికింద్రాబాద్ ప్రాంతాలకు డెలివరీ ఇచ్చేందుకు ఈ-రిటైలర్లు నో చెబుతున్నారు. ఆన్‌లైన్ వల్ల తమ అమ్మకాలు పడిపోయాయని, అందుకే తామూ ఆన్‌లైన్లోకి వెళ్లామనేది వ్యాపారి హమీద్ మాట. ఆన్‌లైన్ ధరల పోటీని తట్టుకోవడానికి ఒకోసారి విడిభాగాలను మారుస్తున్నట్లు అంగీకరించారాయన. ‘‘ఒరిజినల్ 2జీబీ ర్యామ్ రూ.2,500, హార్డ్ డిస్క్ 1 టీబీది రూ.4 వేల దాకా ఉంటుంది. వీటిని మార్చకపోతే మరీ తక్కువ ధరకు అమ్మటం కష్టం’ అన్నారాయన.
 
 మరో వ్యాపారి రవీందర్ మాట్లాడుతూ... ‘‘డెల్ ఐ3 3541 మోడల్ డీలర్ ధర రూ.29,500. హైదరాబాద్‌లోని గ్రే మార్కెట్ వ్యాపారులకు రూ.23 వేలకే వస్తోంది. వారు ఆన్‌లైన్లో తక్కువ లాభానికే అమ్ముతున్నారు’’ అని చెప్పారు. తాము ఒరిజినల్ వస్తువులు విక్రయిస్తున్నా 10 శాతంపైగా వస్తువులు వెనక్కి రావడంతో ఆన్‌లైన్‌కు గుడ్‌బై ెప్పేశామని మొబైల్ వ్యాపారి శ్రీనివాస్ వెల్లడించారు. ‘‘ల్యాప్‌టాప్‌లు 7వేల వరకూ అమ్మితే 1500 వరకూ తిరిగొచ్చేశాయి. వీటిలో అధికం అమీర్‌పేట్, సికింద్రాబాద్ ప్రాంతాలకు డెలివరీ ఇచ్చినవే. అందుకే ఆన్‌లైన్‌కు గుడ్‌బై చెప్పేశాం’’ అన్నారాయన. సీటీసీకి చెందిన 80 శాతం మంది వ్యాపారులు ఆన్‌లైన్ మార్కెట్ ప్లేస్ నుంచి తప్పుకున్నట్లు మరో వ్యాపారి నిజాముద్దీన్ చెప్పారు.
 - హైదరాబాద్, బిజినెస్ బ్యూరో
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement