సాక్షి, అమరావతి: ఆదాయ మార్గాలు పెంచుకునే దిశగా ఆర్టీసీ సన్నాహాలు ముమ్మరం చేసింది. ప్రధానంగా రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీకి ఉన్న విలువైన భూములను వాణిజ్య అవసరాలకోసం సద్వినియోగం చేసుకోవడంపై దృష్టిసారించింది. ఆర్థిక శాఖ సూచనలతో ఈ దిశగా కార్యాచరణ ముమ్మరం చేసింది. అందులో భాగంగా ఆర్టీసీ గ్యారేజీలు, డిపోలను ప్రైవేట్ వాహనాల సర్వీసింగ్ సెంటర్లుగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. ఆర్టీసీకి ప్రస్తుతం రాష్ట్రంలో విలువైన ప్రదేశాల్లో గ్యారేజీలు, డిపోలు ఉన్నాయి. ఒక్కో గ్యారేజీ పది ఎకరాల్లోను, డిపోలు ఆరేడు ఎకరాల్లోను విస్తరించి ఉన్నాయి. వాటిలో ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల సర్వీసింగ్ చేస్తున్నారు. అదే గ్యారేజీలు, డిపోల్లో ప్రైవేటు వాహనాలకు కూడా సర్వీసింగ్ సేవలు అందించాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఇప్పటికే ఆర్టీసీ విజయనగరం, ఏలూరు, కర్నూలుల్లో టైర్ సర్వీసింగ్ సెంటర్లను నిర్వహిస్తోంది. అదే రీతిలో రాష్ట్రంలోని ఆర్టీసీ గ్యారేజీలు, డిపోలలో పూర్తిస్థాయిలో ఆటోమొబైల్ సర్వీసింగ్ సెంటర్లుగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. ఈ మేరకు కార్యాచరణ చేపట్టేందుకు అధికారుల కమిటీని నియమించింది.
తక్కువ చార్జీతో మెరుగైన సేవలు
ప్రైవేటు సర్వీసింగ్ సెంటర్ల కంటే మెరుగైన రీతిలో తక్కువ ధరకు వాహనాల సర్వీసింగ్ సేవలను అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. సాధారణ సర్వీసింగ్, అన్ని రకాల రిపేర్లు, బాడీ పెయింటింగ్, వాటర్ సర్వీసింగ్ మొదలైన సేవలు అందిస్తారు. ఆర్టీసీ టెక్నికల్ స్టాఫ్ స్కిల్డ్ సేవలు అందిస్తారు. అన్‌స్కిల్డ్ సేవల కోసం అవుట్ సోర్సింగ్ విధానంలో సిబ్బందిని నియమిస్తారు. ప్రస్తుతం గ్యారేజీల్లో ఉన్న మౌలిక వసతులతోపాటు అవసరమైన యంత్ర పరికరాలు కొనుగోలు చేస్తారు. ఆర్టీసీ వాహనాలు, ప్రైవేటు వాహనాలకు వేర్వేరుగా ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను ఏర్పాటు చేస్తారు.
ఆర్టీసీ వాహనాల స్పేర్ పార్టులు, ప్రైవేటు వాహనాల స్పేర్ పార్టులకు వేర్వేరుగా స్టోర్ రూమ్‌లు, రికార్డులు నిర్వహిస్తారు. తద్వారా ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా చూస్తారు. తొలిదశలో భారీ వాహనాలకు సర్వీసింగ్ సేవలను అందుబాటులోకి తెస్తారు. అనంతరం కార్లు, ఎస్‌యూవీలు, ఇతర వాహనాల సర్వీసింగ్ అందిస్తారు. తొలిదశలో నాలుగైదు కేంద్రాల్లో రెండు నెలల్లో సర్వీసింగ్ సేవలను ప్రారంభించాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. అనంతరం అన్ని ఆర్టీసీ డిపోలు, గ్యారేజీల్లో ప్రైవేటు వాహనాల సర్వీసింగ్ సేవలను విస్తరించనున్నారు. ప్రైవేటు సర్వీసింగ్ కేంద్రాల కంటే మెరుగైన రీతిలో తక్కువ చార్జీలకు ఆర్టీసీ ఆటోమొబైల్ సర్వీసింగ్ సేవలు అందించేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఆర్టీసీ ఈడీ కృష్ణమోహన్ చెప్పారు.
త్వరలో ఆర్టీసీ సర్వీసింగ్ సెంటర్లు
Published Sun, Mar 27 2022 4:36 AM | Last Updated on Sun, Mar 27 2022 9:53 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment