seshagiri
-
‘జగనన్న విదేశీ విద్యా దీవెన’ కాపులకు ఓ వరం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల్లో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు విదేశాలలో ఉన్నత చదువులు చదువుకునేందుకు ‘జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం’ ఒక వరమని రాష్ట్ర కాపు సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషగిరి చెప్పారు. ఆయన బుధవారం మంగళగిరి కాపు కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కాపు సామాజికవర్గంలో వెనుకబడిన కుటుంబాల విద్యార్థుల కలలను సాకారం చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ పథకాన్ని అందుబాటులోకి తెచ్చినట్టు చెప్పారు. రూ. 8 లక్షల లోపు వార్షికాదాయం ఉండి, విదేశీ విద్యార్హత పరీక్షలో స్కోరు సాధించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ పథకం ద్వారా విదేశాలలో పీజీ, పీహెచ్డీ, ఎంబీబీఎస్ చదవొచ్చని తెలిపారు. ప్రపంచంలో 1 నుంచి 100 ర్యాంకుల్లోని యూనివర్సిటీలకు ఎంపికైన విద్యార్థులకు 100 శాతం ట్యూషన్ ఫీజు ప్రభుత్వమే చెల్లిస్తుందని, 200 వరకు ర్యాంకుల్లో ఉన్న వర్సిటీలకు ఎంపికైన వారికి రూ.50 లక్షలు, లేదా ట్యూషన్ ఫీజులో 50 శాతం చెల్లిస్తుందని వివరించారు. ఈ పథకం కుటుంబంలో ఒక్కరికి మాత్రమే వర్తిస్తుందన్నారు. అర్హత గలవారు సెప్టెంబర్ 30వ తేదీలోపు http:// jnanabhumi. ap. gov. in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని, ఇతర వివరాలు, సందేహాల నివృత్తికి 63054 48393, 63051 59559 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. రాష్ట్రంలో గత మూడేళ్లలో కాపుల సంక్షేమానికి వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా రూ.32 వేల కోట్లు, కాపు నేస్తం కింద మహిళలకు రూ.1,500 కోట్లు అందించామని తెలిపారు. కాపు కార్పొరేషన్ ద్వారా త్వరలో రుణాలు ఇస్తామన్నారు. విజయవాడ సింగ్‌నగర్‌లో కాపు కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.కోటి మంజూరు చేసిందని చెప్పారు. -
మహిమ గల మరచెంబు అంటూ...
బొబ్బిలి : మహిమ గల మరచెంబును విక్రయిస్తున్నామని చెప్పి ఓ రియల్ఎస్టేట్ వ్యాపారి నుంచి రూ. కోటి 13లక్షలు కాజేసిన ముఠా గుట్టును విజయనగరం జిల్లా రామభద్రపురం పోలీసులు ఛేదించారు. నిందితులను అరెస్టు చేసి రూ.లక్ష నగదు, మహిమ ఉందని చెబుతున్న మర చెంబును స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఎస్సై డి.డి.నాయుడు మంగళవారం వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి వల్లేపు శేషగిరికి హైదరాబాద్‌కు చెందిన మోహన్, విజయవాడకు చెందిన వెంకట్ ఇటీవలే స్నేహితులయ్యారు. వారి మధ్య అన్యోన్యత పెరిగిన తరువాత విజయనగరం జిల్లా రామభద్రపురం ప్రాంతానికి చెందిన కొందరివద్ద మహిమగల మరచెంబు ఉందనీ, దానిని కొనుగోలు చేస్తే వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విస్తరిస్తుందని శేషగిరిని మోహన్ నమ్మించాడు. ఆయనను రామభద్రపురానికి తీసుకువచ్చి అక్కడకు చెంబు ఉందని చెప్పిన చింతాడ తేజ్ మోహన్‌రావు (హైదరాబాద్), శ్రీపతి కౌసల్య(పార్వతీపురం), చింతాడ ప్రియదాసు(నర్సిపురం), బొబ్బిలికి చెందిన ఏగిరెడ్డి చిట్టి నాయుడు, కోరాడ సీతారాంలతో పాటు గలావిల్లి రవి (కొమరాడ మండలం దళాయి పేట)ని రప్పించారు. వీరంతా కలసి రామభద్రపురంలో గత అక్టోబర్‌లో చెంబును రూ.ఒక కోటి 13 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా శేషగిరి అడ్వాన్సుగా రూ.13 లక్షలు వారికి ఇచ్చాడు. కొద్దిరోజుల తరువాత రామభద్రపురం బైపాస్ సెంటర్లోని సత్యసాయి ఆలయం వద్ద రెండో విడతగా రూ.కోటి ఇచ్చాడు. రెండో విడతలో మర చెంబును చూపించి దానిని విజయనగరంలో ఇస్తామని చెప్పి శేషగిరిని కారు ఎక్కించుకున్నారు. అందరూ కారులో వెళ్తుండగా ముందుగా వేసుకున్న పథకం ప్రకారం ఇక్కడ పోలీసుల చెకింగ్ ఉందని చెప్పి శేషగిరిని నమ్మించారు. తాము చెంబుతో పాటు వెనుకే వస్తామని ఆయన్ను కారులో వెళ్లిపోవాలని సూచించారు. విజయనగరంలో చెంబు అందజేస్తామని చెప్పగా శేషగిరి విజయనగరంలో చెంబుకోసం వేచి చూడసాగాడు. వారు తిరిగి రాకపోగా.. ఫోన్ చేస్తే ఇదిగో అదిగో అంటూ ఇంతవరకూ కాలయాపన చేశారు. ఇక చేసేది లేక ఈ నెల 1న రామభద్రపురం ఎస్ఐ డి.డి.నాయుడుకు శేషగిరి ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేసిన ఎస్ఐ అందరి ఆచూకీ తెలుసుకుని మోహన్‌తో పాటు అనుచరులు ఐదుగుర్ని సోమవారం అరెస్టు చేశారు. వారి నుంచి లక్ష రూపాయల నగదు, మరచెంబు స్వాధీనం చేసుకున్నారు. అయితే నిందితులను విచారించిన పోలీసులకు నిందితులు తమకు రూ.30లక్షలు మాత్రమే ఇచ్చాడనీ, మిగతా సొమ్ము ఇవ్వలేదనీ చెప్పడం విశేషం. మర చెంబు కేసులో పోలీసుల అదుపులో ఉన్న నిందితులు గతంలో మహిమ గల నాణేలను విక్రయించేవారని కూడా గుర్తించారు. గతంలో బొబ్బిలి, విజయనగరం, విశాఖపట్నం, రాయఘడ ప్రాంతాల్లో వీరు మహిమలున్న నాణేలంటూ పలువురి వద్ద నగదు కాజేసి ఉడాయించిన కేసులున్నాయని ఎస్ఐ డీడీ నాయుడు తెలిపారు. -
ఉద్యమస్థాయిలో కృషి చేద్దాం
–ప్రభుత్వ బడుల్లో చిన్నారుల చేరికలు పెంచుదాం –సర్వ శిక్షాభియాన్ పీవో శేషగిరి భానుగుడి(కాకినాడ సిటీ) : ప్రభుత్వ పాఠశాలల్లో అమలయ్యే కేంద్ర, రాష్ట్ర ప«థకాలను వివరించి విద్యార్థుల తల్లిదండ్రులను చైతన్యపరిచేందుకు ఉద్యమస్థాయిలో పనిచేయాలని సర్వశిక్షాభియాన్ పీవో మేకా శేషగిరి కోరారు. ‘ప్రభుత్వ బడి–అమ్మ ఒడి, పదితర్వాత పెళ్ళి కాదు 11’ కార్యక్రమాలపై సర్వశిక్షాభియాన్ సమావేశ మందిరంలో జిల్లాస్థాయిలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన సమావేశాల ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరిక, బడిబయట పిల్లలను బడిలో చేర్పించే కార్యక్రమాల్లో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉండేలా ఐక్యంగా పనిచేయాలని ఉపాధ్యాయులకు, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ సిబ్బందికి, ఐఈఆర్టీలకు సూచించారు. ఇన్చార్జి డీఈవో ఎస్.అబ్రహాం మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు చాలా మెరుగుపడ్డాయని, వసతులు, విద్యాభివృధ్ధి పథకాలలో ప్రైవేటు పాఠశాలలకు అందనంత స్థాయిలో ప్రభుత్వపాఠశాలలు ఉన్నాయని చెప్పారు. తల్లిదడ్రులు అవగాహనారాహిత్యంతోనే ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల ఉచ్చులో పడుతున్నారన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో ఎల్కేజీ విద్యను పూర్తిచేసుకున్న చిన్నారులకు వర్సిటీ స్నాతకోత్సవం రీతిలో పట్టాలు ప్రదానం చేశారు. డీఈవో కార్యాలయం నుంచి బాలాజీచెరువు వరకు ర్యాలీ నిర్వహించారు. ఐసీడీఎస్ ఇన్చార్జి పీడీ శారదాదేవి, వివిధ మండలాల ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు, ఐఈఆర్టీలు, అంగన్వాడీలు, సర్వశిక్షాభియాన్ సిబ్బంది పాల్గొన్నారు. -
హడలెత్తించిన శేషగిరి
సాక్షి, హైదరాబాద్: ఎస్‌యూసీసీ బౌలర్ శేషగిరి (7/10) చెలరేగాడు. సదర్న్ స్టార్స్ బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించాడు. దీంతో ఎస్‌యూసీసీ 225 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఎ-డివిజన్ వన్డే లీగ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేపట్టిన ఎస్‌యూసీసీ 41 ఓవర్లలో 9 వికెట్లకు 251 పరుగులు చేసింది. చరణ్ తేజ (105 నాటౌట్) సెంచరీ సాధించగా, రాజ్ (53) రాణించాడు. తర్వాత సదర్న్ స్టార్స్ అనూహ్యంగా 26 పరుగులకే కుప్పకూలింది. శేషగిరి ధాటికి ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ ఎవరూ నిలువలేకపోయారు. ఇతర మ్యాచ్ ల స్కోర్లు ఆర్జేసీసీ: 291/9 (అవినాశ్ 51, పృథ్వీ 60, నాగార్జున 40), ఎంపీ యంగ్మన్:178 (సందీప్ 36, నితిన్ 35; కిరణ్ 5/16). యాదవ్ డెయిరీ: 249/6 (సాయివరుణ్ 107, సాకేత్ 53; సురేశ్ 3/43), స్టార్లెట్స్: 118 (సురేశ్ 44). ఆల్ సెయింట్స్: 214/3 (సాత్విక్ రెడ్డి 111, శివ 66; రాఘవ 3/84), రాయల్ సీసీ: 217/4 (నీరజ్ కుమార్ 113 నాటౌట్, నాగ్ 35). సీకే బ్లూస్: 347 (సుశాంత్ 110, బి.సారుు సుశాంత్ 81, బాలకృష్ణ 56 నాటౌట్; రుత్విక్ యాదవ్ 6/57, తేజస్ 3/22), సఫిల్‌గూడ: 93 (రుత్విక్ యాదవ్ 31; అశ్వద్ 6/18, ప్రతీక్ 3/14). అక్షిత్ సీసీ: 242 (భరద్వాజ్ 59, రోనక్ 60, రిలాస 3/69, సాత్విక్ అగర్వాల్ 4/57), సత్యం కోల్ట్స్: 96 (రిత్విక్ 5/7). రాజు సీఏ: 194 (అభినవ్ 66, పునీత్ 50; సంతోష్ 4/22), రంగారెడ్డి జిల్లా: 109 (వర్షిత్ 30; కౌశిక్ 6/33). ఆడమ్స్ ఎలెవన్: 251/5 (సచిన్ కుమార్ 101, జయంత్ 80), పీఎన్ యంగ్‌స్టర్స్: 252/7 (శ్రీకాంత్ 96, నరసింహా 51; దుర్గేశ్ 3/46). యంగ్ సిటీజన్: 142 (పృథ్వి 38, సారుు 34; జిబిన్ 5/15), హెచ్‌సీఏ అకాడమీ: 145/2 (సతీశ్ 56 నాటౌట్, శ్రీనివాస్ 50 నాటౌట్).