బొబ్బిలి : మహిమ గల మరచెంబును విక్రయిస్తున్నామని చెప్పి ఓ రియల్‌ఎస్టేట్ వ్యాపారి నుంచి రూ. కోటి 13లక్షలు కాజేసిన ముఠా గుట్టును విజయనగరం జిల్లా రామభద్రపురం పోలీసులు ఛేదించారు. నిందితులను అరెస్టు చేసి రూ.లక్ష నగదు, మహిమ ఉందని చెబుతున్న మర చెంబును స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఎస్సై డి.డి.నాయుడు మంగళవారం వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి.
నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి వల్లేపు శేషగిరికి హైదరాబాద్‌కు చెందిన మోహన్, విజయవాడకు చెందిన వెంకట్ ఇటీవలే స్నేహితులయ్యారు. వారి మధ్య అన్యోన్యత పెరిగిన తరువాత విజయనగరం జిల్లా రామభద్రపురం ప్రాంతానికి చెందిన కొందరివద్ద మహిమగల మరచెంబు ఉందనీ, దానిని కొనుగోలు చేస్తే వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విస్తరిస్తుందని శేషగిరిని మోహన్ నమ్మించాడు. ఆయనను రామభద్రపురానికి తీసుకువచ్చి అక్కడకు చెంబు ఉందని చెప్పిన చింతాడ తేజ్ మోహన్‌రావు (హైదరాబాద్), శ్రీపతి కౌసల్య(పార్వతీపురం), చింతాడ ప్రియదాసు(నర్సిపురం), బొబ్బిలికి చెందిన ఏగిరెడ్డి చిట్టి నాయుడు, కోరాడ సీతారాంలతో పాటు గలావిల్లి రవి (కొమరాడ మండలం దళాయి పేట)ని రప్పించారు. వీరంతా కలసి రామభద్రపురంలో గత అక్టోబర్‌లో చెంబును రూ.ఒక కోటి 13 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు.
ఇందులో భాగంగా శేషగిరి అడ్వాన్సుగా రూ.13 లక్షలు వారికి ఇచ్చాడు. కొద్దిరోజుల తరువాత రామభద్రపురం బైపాస్ సెంటర్‌లోని సత్యసాయి ఆలయం వద్ద రెండో విడతగా రూ.కోటి ఇచ్చాడు. రెండో విడతలో మర చెంబును చూపించి దానిని విజయనగరంలో ఇస్తామని చెప్పి శేషగిరిని కారు ఎక్కించుకున్నారు. అందరూ కారులో వెళ్తుండగా ముందుగా వేసుకున్న పథకం ప్రకారం ఇక్కడ పోలీసుల చెకింగ్ ఉందని చెప్పి శేషగిరిని నమ్మించారు. తాము చెంబుతో పాటు వెనుకే వస్తామని ఆయన్ను కారులో వెళ్లిపోవాలని సూచించారు. విజయనగరంలో చెంబు అందజేస్తామని చెప్పగా శేషగిరి విజయనగరంలో చెంబుకోసం వేచి చూడసాగాడు. వారు తిరిగి రాకపోగా.. ఫోన్ చేస్తే ఇదిగో అదిగో అంటూ ఇంతవరకూ కాలయాపన చేశారు.
ఇక చేసేది లేక ఈ నెల 1న రామభద్రపురం ఎస్‌ఐ డి.డి.నాయుడుకు శేషగిరి ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేసిన ఎస్‌ఐ అందరి ఆచూకీ తెలుసుకుని మోహన్‌తో పాటు అనుచరులు ఐదుగుర్ని సోమవారం అరెస్టు చేశారు. వారి నుంచి లక్ష రూపాయల నగదు, మరచెంబు స్వాధీనం చేసుకున్నారు. అయితే నిందితులను విచారించిన పోలీసులకు నిందితులు తమకు రూ.30లక్షలు మాత్రమే ఇచ్చాడనీ, మిగతా సొమ్ము ఇవ్వలేదనీ చెప్పడం విశేషం. మర చెంబు కేసులో పోలీసుల అదుపులో ఉన్న నిందితులు గతంలో మహిమ గల నాణేలను విక్రయించేవారని కూడా గుర్తించారు. గతంలో బొబ్బిలి, విజయనగరం, విశాఖపట్నం, రాయఘడ ప్రాంతాల్లో వీరు మహిమలున్న నాణేలంటూ పలువురి వద్ద నగదు కాజేసి ఉడాయించిన కేసులున్నాయని ఎస్‌ఐ డీడీ నాయుడు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment