set exam
-
ఏపీ ప్రవేశ పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశ పరీక్షలపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సచివాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు. ఎంసెట్ సహా ఏడు సెట్ల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని, కోవిడ్ 19 నేపథ్యంలో ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ పరీక్షలు నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు అన్ని భద్రతా సదుపాయాలు కల్పించాలన్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పరీక్షా కేంద్రాలను పరిశుభ్రంగా ఉంచాలని అధికారులకు సూచించారు. సెప్టెంబర్ 17 నుండి 25 వరకు ఎంసెట్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎంసెట్ కు ఈ ఏడాది లక్షా 84 వేలమంది హాజరకానున్నారని అన్నారు. సెప్టెంబర్ 10, 11 తేదీల్లో ఐ సెట్ నిర్వహిస్తామని, ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 64 వేల 839 మంది హాజరవుతున్నారని మంత్రి సురేష్ వెల్లడించారు. మొత్తం అన్ని ప్రవేశ పరీక్షలకు 4 లక్షల 36 వేల మంది హాజరుకానున్నట్లు మంత్రి ప్రకటించారు. -
వారంపైగా ఎంసెట్
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ప్రవేశ పరీక్షలను వచ్చే నెలలోనే నిర్వహించేలా ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఆన్లైన్ పరీక్షల నిర్వహణ సంస్థ అయిన టీసీఎస్ స్లాట్స్ (ఖాళీ తేదీలు) సెప్టెంబర్ నెలలో లేనందున, ఆగస్టులోనే సెట్స్ నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చింది. ఈనెలలోనే ఈసెట్, ఎంసెట్ సహా అన్ని సెట్స్‌ను నిర్వహించాల్సి ఉన్నా కోర్టు కేసు కారణంగా ప్రభుత్వం వాయిదా వేసింది. అయితే అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) జారీ చేసిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం సెట్స్ నిర్వహించి ప్రవేశాలు చేపట్టాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 15 నుంచి వీటిని నిర్వహించేలా షెడ్యూలు ఖరారుపై కసరత్తు ప్రారంభించింది. దీనిపై శనివారం అడ్వొకేట్ జనరల్‌తోనూ చర్చించి హైకోర్టుకు తెలియజేయాలని నిర్ణయం తీసుకుంది. విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామ్‌చంద్రన్‌తో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి తదితరులు శుక్రవారం సమావేశమై సెట్స్ నిర్వహణపై చర్చించారు. ఏఐసీటీఈ మార్గదర్శకాల ప్రకారం ముందుకు సాగాలని సమావేశంలో నిర్ణయించారు. కోర్టు ఆమోదం లభించగానే షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు. వారంపైగా ఎంసెట్ పరీక్షలు కరోనా నేపథ్యంలో సెట్స్ నిర్వహణలో భౌతిక దూరం పాటించేలా మరింత పకడ్బందీగా చర్యలు చేపట్టాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. ఇందుకోసం ఒక్కో సెషన్లో పరీక్షలు రాసే విద్యార్థుల సంఖ్యను 15–16 వేలకు తగ్గించనున్నట్లు తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. సాధారణంగా ఎంసెట్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ పరీక్షలను వారంపైగా నిర్వహించాల్సి ఉంది. 70 వేల మందికిపైగా హాజరయ్యే అగ్రికల్చర్ ఎంసెట్‌ను మూడు సెషన్లలో నిర్వహించనుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక్కో సెషన్‌కు విద్యార్థుల సంఖ్యను తగ్గించి ఇంజనీరింగ్ ఎంసెట్‌ను ఐదు రోజుల్లో 8 నుంచి 9 సెషన్లలో, అగ్రికల్చర్ ఎంసెట్‌ను మూడ్రోజుల్లో నాలుగైదు సెషన్లలో నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తోంది. అలాగే 55,012 దరఖాస్తులు వచ్చిన ఐసెట్ మూడు లేదా నాలుగు సెషన్లలో, 43,356 దరఖాస్తులు వచ్చిన ఎడ్‌సెట్‌ను మూడు సెషన్లలో, 27,978 దరఖాస్తులు వచ్చిన ఈసెట్‌ను రెండు సెషన్లలో, 21,704 దరఖాస్తులు వచ్చిన పీజీఈసెట్‌ను వీలైతే ఒకే సెషన్లో, 28,805 దరఖాస్తులు వచ్చిన లాసెట్‌ను రెండు సెషన్లలో నిర్వహించే అవకాశం ఉంది. ఆగస్టు మూడో వారంలో లేదా సెప్టెంబర్‌లో ఫైనల్ సెమిస్టర్ ఫైనల్ సెమిస్టర్ విద్యార్థుల పరీక్షలను ఆగస్టు మూడో వారంలో లేదా సెప్టెంబర్‌లో నిర్వహించాలని ఉన్నత విద్యా శాఖ భావిస్తోంది. దీనికి సంబంధించిన కేసు కూడా కోర్టులో ఉండటంతో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ), ఏఐసీటీఈ మార్గదర్శకాలను కోర్టుకు వివరించి పరీక్షల నిర్వహణ అనుమతి పొందాలని భావిస్తోంది. ఆ తరువాత పరీక్షల నిర్వహణకు యూనివర్సిటీలు షెడ్యూలు జారీ చేసేలా కసరత్తు చేస్తోంది. -
ఖరారు కానున్న సెట్స్ తేదీలు
సాక్షి, హైదరాబాద్: వివిధ వృత్తి సాంకేతిక విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించాల్సిన ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్) తాజా తేదీలు శుక్రవారం ఖరారు కానున్నాయి. కరోనా నేపథ్యంలో వాయిదా వేసిన ప్రభుత్వం ఈనెల 1వ తేదీ నుంచి వరుసగా ఈసెట్, ఎంసెట్ తదితర ప్రవేశ పరీక్షలను నిర్వహించేలా గతంలో షెడ్యూలు జారీ చేసింది. అయితే కరోనా ఉధృతి తగ్గని పరిస్థితుల్లో పరీక్షలను ఎలా నిర్వహిస్తారంటూ కోర్టులో కేసు వేయడంతో పరీక్షలను మళ్లీ వాయిదా వేయాల్సి వచ్చింది. అయితే జాతీయ స్థాయిలో జేఈఈ మెయిన్‌ను సెప్టెంబర్ 1 నుంచి 6 వరకు నిర్వహించేలా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) తాజా షెడ్యూల్ జారీ చేసిన నేపథ్యంలో అదే పద్ధతిలో రాష్ట్రంలోనూ సెట్స్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన గురువారం జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలోనూ దీనిపై చర్చించారు. విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా చూడాలని సీఎం ఆదేశాలు జారీ చేయడంతో తదుపరి కార్యాచరణపై ఉన్నత విద్యాశాఖ దృష్టి సారించింది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన శుక్రవారం జరిగే ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి తదితరులు పాల్గొననున్నారు. ఈ సమావేశంలో ఎంసెట్ నిర్వహణపైనా చర్చించనున్నారు. దాంతోపాటు ఇతర సెట్స్ నిర్వహించే తేదీలను కూడా ఖరారు చేయనున్నారు. -
విద్యార్థుల భవిష్యత్తు కోసమే...
సాక్షి, హైదరాబాద్: ‘ప్రస్తుత పరిస్థితుల్లో రిస్క్ అయినా పకడ్బందీ ఏర్పాట్ల మధ్య ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్) నిర్వహణకు చర్యలు చేపట్టాం. జూలై 1 నుంచి సెట్స్ ప్రారంభమవుతాయి. విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించే వాటి నిర్వహణకు పక్కాగా చర్యలు చేపడుతున్నాం’అని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి చెప్పారు. ‘ఇప్పుడు సెట్స్ నిర్వహించకపోతే ప్రవేశాలపై తీవ్ర ప్రభావం ఉంటుంది. దాంతో పిల్లలు ఒక విద్యా సంవత్సరం నష్టపోయే ప్రమాదం ఏర్పడవచ్చు. ఈ నష్టాన్ని ఆపలేకపోయామనే బాధ మమ్మల్ని వెంటాడకూడదు. అందుకే ధైర్యంగా ముందడుగు వేస్తున్నాం. ఒక్కో విద్యార్థి మూడు గంటల పాటు హాజరయ్యే పరీక్షల నిర్వహణకు అన్ని రకాల జాగ్రత్తలతో ముందుకు సాగుతున్నాం’అని వివరించారు. రాష్ట్రంలో నిర్వహించనున్న ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు 4,68,271 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఆయా పరీక్షల ఏర్పాట్లపై పాపిరెడ్డి ‘సాక్షి’తో చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే.. అడుగడుగునా శానిటైజేషన్.. సెట్స్‌కు హాజరయ్యే విద్యార్థులు మాస్క్‌లు, గ్లౌజులు ధరించడం తప్పనిసరి. పరీక్ష కేంద్రాల్లో అడుగడుగునా శానిటైజ్ చేస్తాం. గేట్ దగ్గరి నుంచి మొదలు.. ల్యాబ్స్, బాత్రూమ్లు ప్రతిచోటా శానిటైజర్లను ఉంచుతాం. ఆయా చోట్ల సిబ్బందిని నియమించి శానిటైజర్ వేసేలా ఏర్పాట్లు చేస్తున్నాం. లేదా విద్యార్థులు సొంతంగా శానిటైజర్ బాటిల్స్, చిన్న వాటర్ బాటిల్ వెంట తెచ్చుకోవచ్చు. పరీక్ష హాల్ ఎక్కడో బోర్డులు, పోస్టర్ల ద్వారా ప్రదర్శన పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల వెంట తల్లిదండ్రుల్లో ఒక్కరే రావాలి. వారిని కూడా సెంటర్‌కు 200మీ. నుంచి 300 మీటర్ల దూరంలోనే ఆపేస్తాం. ఏ హాల్‌టికెట్ నంబరు నుంచి ఏ నంబరు వరకు ఏ రూమ్‌లో పరీక్ష రాయాలో బోర్డులను ఏర్పాటు చేస్తాం. పరీక్ష కేంద్రం బయటా ఇవి ఉంటాయి. విద్యార్థులు ఎవరి దగ్గరికి వెళ్లక్కర్లేకుండా, ఎవరిని అడగక్కర్లేకుండా ఈ చర్యలు చేపడుతున్నాం. ప్రతీ సెషన్‌కు మధ్య 3 గంటల వ్యవధి పరీక్ష హాల్లోనూ పక్కాగా శానిటైజేషన్ చేస్తాం. భౌతికదూరం పాటించేలా చూస్తాం. ఆన్లైన్ పరీక్షలు కాబట్టి ప్రతి ఇద్దరు విద్యార్థుల మధ్య దూరం ఎక్కువగా ఉండేలా చూస్తాం. విద్యార్థి ముందు భాగంలో కంప్యూటర్ స్క్రీన్ ఉంటుంది. దాని వెనుక చెక్క బోర్డు అడ్డుగా ఉంటుంది. ల్యాబ్‌లో క్యాబిన్ తరహాలోనే ఉంటుంది. పరీక్ష పూర్తయ్యాక కూడా ఆ కేంద్రంలోని ఏ ల్యాబ్ విద్యార్థుల తరువాత ఏ ల్యాబ్ వారు వెళ్లాలనేది నిర్ణయిస్తాం. వాటికి నంబరింగ్ ఇస్తాం. అంతా ఒకేసారి బయటకు వెళ్లకుండా, ఒకరి దగ్గరకు ఒకరు వెళ్లకుండా చూస్తాం. బయటకు వెళ్లాక కూడా తల్లిదండ్రులు తమ పిల్లలను ఇతర పిల్లలతో కలవకుండా వెంటనే తీసుకెళ్లాలి. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలుంటాయి. ఒక సెషన్ పరీక్ష పూర్తయ్యాక కంప్యూటర్, కీబోర్డు, మౌస్, టేబుల్, చైర్తోపాటు ఆ హాల్ అంతా, కింద ఫ్లోర్‌తో సహా శానిటైజ్ చేస్తాం. ఆ తరువాత మధ్యాహ్నం పరీక్షకు సిద్ధం చేస్తాం. ఉదయం సెషన్‌కు మధ్యాహ్నం సెషన్‌కు మధ్య మూడు గంటల వ్యవధి ఉంటుంది. విద్యార్థుల మేలు కోరే.. సెట్స్ నిర్వహణ ఇప్పుడు చేపట్టకపోతే ఎప్పుడు నిర్వహించాల్సి వస్తుందో తెలియదు. విద్యార్థులకేమో త్వరగా పరీక్ష పూర్తి కావాలని ఉంది. మేలో జరగాల్సిన పరీక్ష వాయిదా పడి నెలన్నర దాటిపోయింది. ఇంకా ఎన్ని రోజులు ప్రిపేర్ కావాలనే ఆందోళన వారిలో ఉంది. ఇప్పుడు నిర్వహించకుండా వాయిదా వేస్తే మళ్లీ అక్టోబరుకు వెళ్లాల్సి రావచ్చు. దానివల్ల విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతారు. అప్పుడు నిర్వహణ సాధ్యమవుతుందో లేదో తెలియదు. అందుకే విద్యార్థుల కోసం సెట్స్ నిర్వహించక తప్పడం లేదు. వీలైనంత మందికి సెంటర్ల మార్పు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు పలువురు లాక్‌డౌన్‌కు ముందు ఎంసెట్, ఇతర సెట్స్‌కు దరఖాస్తు చేశారు. అపుడు హైదరాబాద్‌లో పరీక్ష రాసేలా సెంటర్‌ను ఎంచుకున్నారు. తరువాత లాక్డౌన్ కొనసాగడంతో ఏపీకి వెళ్లిపోయారు. ఇప్పుడు వారు ఏపీలో తమ ప్రాంతాల్లో పరీక్షలు రాస్తామని, తెలంగాణకు రాలేమని, బస్సులు నడవడం లేదని అంటున్నారు. వారు కోరుకున్నట్లుగా పరీక్ష కేంద్రాలను మార్పు చేశాం. తెలంగాణలోనూ మార్పులు చేశాం. కాలేజీ హాస్టళ్లలో ఉన్న వారు మొదట్లో హైదరాబాద్ కేంద్రం పెట్టుకున్నారు. తరువాత జిల్లాలకు మార్చుకున్నారు. ఇలా పరీక్ష కేంద్రాలను దాదాపు 20 వేల మందికి మార్చాం. వీలైనంత వరకు, విద్యార్థులకు సమీపంలోనే పరీక్ష కేంద్రాలను కేటాయించాం. కంప్యూటర్లు, ఇంటర్నెట్ సదుపాయం లేకపోతే ఇతర ప్రాంతాల్లో కేంద్రాలను వేశాం. విద్యార్థులు ఆందోళన చెందకుండా, తగిన జాగ్రత్తలు, భౌతికదూరం పాటిస్తూ పరీక్షలకు హాజరు కావాలి. -
జనవరిలో సెట్స్ షెడ్యూల్!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్) షెడ్యూల్‌పై కసరత్తు మొదలైంది. ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలో షెడ్యూల్ జారీ చేయాలని ఉన్నత విద్యా మండలి భావిస్తోంది. గతంలో దేశం మొత్తం ఒకే రకమైన కోర్సులో ప్రవేశాలకు ఒకే ప్రవేశ పరీక్ష నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచనలు చేసింది. అలాగే జేఈఈ మెయిన్ ద్వారానే ఇంజనీరింగ్ ప్రవేశాలను 2019–20 విద్యా సంవత్సరం నుంచి చేపట్టాలని ప్రయత్నించింది. అయితే దీనిపై ఇంతవరకు కేంద్రం నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడం, మరోవైపు జేఈఈ మెయిన్ నిర్వహణకు సెప్టెంబర్‌లోనే నోటిఫికేషన్ జారీ అవ్వడంతో ఉన్నత విద్యా మండలి ఈసారి ఎంసెట్ నిర్వహించాలని నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తోంది. దీంతో ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలో సెట్స్ షెడ్యూల్ జారీ చేయనుంది. ఈలోగా అన్ని యూనివర్సిటీల వైస్ చాన్సలర్లతో ఓసారి సమావేశమయ్యే అవకాశం ఉంది. అనంతరం ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, బీఎడ్, ఎల్ఎల్బీ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు ఎంసెట్, ఈసెట్, ఐసెట్, ఎడ్‌సెట్, లాసెట్ ప్రవేశ పరీక్షల తేదీలను ఖరారు చేసి ప్రకటించాలని భావిస్తోంది. ముఖ్యంగా ఎంసెట్‌ను ఏప్రిల్ నెలాఖరు లేదా మే మొదటి వారంలో నిర్వహించేలా షెడ్యూల్ జారీ చేయాలని యోచిస్తోంది. -
‘సెట్ హాల్‌టికెట్లు రాకుంటే సంప్రదించండి’
హైదరాబాద్: ఈ నెల 15న తెలంగాణ, ఏపీ రాష్ట్రాలలో జరిగే సెట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు వెబ్సైట్ ద్వారా హాల్‌టికెట్లు అందకుంటే ఓయూలోని కార్యాలయాన్ని సంప్రదించాలని సెట్ సభ్య కార్యదర్శి ప్రొ.రాజేశ్వర్‌రెడ్డి బుధవారం తెలిపారు. లేదా 040-27097733 నంబర్‌కు ఫోన్ చేసి గాని, settsap@gmail.com వెబ్సైట్ ద్వారా తెలియచేసి గాని కొత్త హాల్‌టికెట్‌ను పొందవచ్చని అన్నారు. రెండు రాష్ట్రాల్లో 27 సబ్జెక్టులకు నిర్వహించే సెట్‌కు 1,35,939 మంది అభ్యర్థులు హాజరవుతున్నారు. వీరికోసం 12 ప్రాంతీయ కేంద్రాలలో 218 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పూర్తి వివరాలకు www.settsap.org అనే వెబ్సైట్ చూడవచ్చు.