వారంపైగా ఎంసెట్‌ | Telangana Government Planning To Conduct EAMCET Exam In August | Sakshi
Sakshi News home page

వారంపైగా ఎంసెట్‌

Published Sat, Jul 18 2020 3:49 AM | Last Updated on Sat, Jul 18 2020 8:53 AM

Telangana Government Planning To Conduct EAMCET Exam In August - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉమ్మడి ప్రవేశ పరీక్షలను వచ్చే నెలలోనే నిర్వహించేలా ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఆన్‌లైన్‌ పరీక్షల నిర్వహణ సంస్థ అయిన టీసీఎస్‌ స్లాట్స్‌ (ఖాళీ తేదీలు) సెప్టెంబర్‌ నెలలో లేనందున, ఆగస్టులోనే సెట్స్‌ నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చింది. ఈనెలలోనే ఈసెట్, ఎంసెట్‌ సహా అన్ని సెట్స్‌ను నిర్వహించాల్సి ఉన్నా కోర్టు కేసు కారణంగా ప్రభుత్వం వాయిదా వేసింది. అయితే అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) జారీ చేసిన అకడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారం సెట్స్‌ నిర్వహించి ప్రవేశాలు చేపట్టాల్సి ఉంది.

ఈ నేపథ్యంలో ఆగస్టు 15 నుంచి వీటిని నిర్వహించేలా షెడ్యూలు ఖరారుపై కసరత్తు ప్రారంభించింది. దీనిపై శనివారం అడ్వొకేట్‌ జనరల్‌తోనూ చర్చించి హైకోర్టుకు తెలియజేయాలని నిర్ణయం తీసుకుంది. విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామ్‌చంద్రన్‌తో ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డి తదితరులు శుక్రవారం సమావేశమై సెట్స్‌ నిర్వహణపై చర్చించారు. ఏఐసీటీఈ మార్గదర్శకాల ప్రకారం ముందుకు సాగాలని సమావేశంలో నిర్ణయించారు. కోర్టు ఆమోదం లభించగానే షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు.

వారంపైగా ఎంసెట్‌ పరీక్షలు 
కరోనా నేపథ్యంలో సెట్స్‌ నిర్వహణలో భౌతిక దూరం పాటించేలా మరింత పకడ్బందీగా చర్యలు చేపట్టాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. ఇందుకోసం ఒక్కో సెషన్‌లో పరీక్షలు రాసే విద్యార్థుల సంఖ్యను 15–16 వేలకు తగ్గించనున్నట్లు తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. సాధారణంగా ఎంసెట్‌ ఇంజనీరింగ్, అగ్రికల్చర్‌ పరీక్షలను వారంపైగా నిర్వహించాల్సి ఉంది. 70 వేల మందికిపైగా హాజరయ్యే అగ్రికల్చర్‌ ఎంసెట్‌ను మూడు సెషన్లలో నిర్వహించనుంది.

ప్రస్తుత పరిస్థితుల్లో ఒక్కో సెషన్‌కు విద్యార్థుల సంఖ్యను తగ్గించి ఇంజనీరింగ్‌ ఎంసెట్‌ను ఐదు రోజుల్లో 8 నుంచి 9 సెషన్లలో, అగ్రికల్చర్‌ ఎంసెట్‌ను మూడ్రోజుల్లో నాలుగైదు సెషన్లలో నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తోంది. అలాగే 55,012 దరఖాస్తులు వచ్చిన ఐసెట్‌ మూడు లేదా నాలుగు సెషన్లలో, 43,356 దరఖాస్తులు వచ్చిన ఎడ్‌సెట్‌ను మూడు సెషన్లలో, 27,978 దరఖాస్తులు వచ్చిన ఈసెట్‌ను రెండు సెషన్లలో, 21,704 దరఖాస్తులు వచ్చిన పీజీఈసెట్‌ను వీలైతే ఒకే సెషన్‌లో, 28,805 దరఖాస్తులు వచ్చిన లాసెట్‌ను రెండు సెషన్లలో నిర్వహించే అవకాశం ఉంది. 

ఆగస్టు మూడో వారంలో లేదా సెప్టెంబర్‌లో ఫైనల్‌ సెమిస్టర్‌ 
ఫైనల్‌ సెమిస్టర్‌ విద్యార్థుల పరీక్షలను ఆగస్టు మూడో వారంలో లేదా సెప్టెంబర్‌లో నిర్వహించాలని ఉన్నత విద్యా శాఖ భావిస్తోంది. దీనికి సంబంధించిన కేసు కూడా కోర్టులో ఉండటంతో యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ), ఏఐసీటీఈ మార్గదర్శకాలను కోర్టుకు వివరించి పరీక్షల నిర్వహణ అనుమతి పొందాలని భావిస్తోంది. ఆ తరువాత పరీక్షల నిర్వహణకు యూనివర్సిటీలు షెడ్యూలు జారీ చేసేలా కసరత్తు చేస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement