రూటు మారేనా?
తలైమన్నార్కు వంతెన మార్గం
పాంబన్లో మరో ట్రాక్
సాక్షి, చెన్నై: తమిళనాడు సర్వతోముఖాభివృద్ధికి దోహదకారిగా గతంలో ప్రకటించిన సేతు సముద్రం ప్రాజెక్టు రూట్ మ్యాప్ మారేనా అన్న ప్రశ్న సర్వత్రా నెలకొంది. ఇందుకు తగ్గ కసరత్తుల్ని కేంద్రం వేగవంతం చేసినట్టుంది. రామసేతు వంతెనకు ఎలాంటి ముప్పు వాటిళ్లకుండా ఈ ప్రాజెక్టును కొత్త మార్గంలో తీసుకెళ్లేందుకు తగ్గ పరిశీలనలను నిపుణులు వేగవంతం చేశారు. అలాగే, ధనుస్కోడి నుంచి తలైమన్నార్కు వంతెనతో రోడ్డు మార్గం పరిశీలనులు సాగుతుండడం గమనార్హం. శ్రీలంక తో పాటు సముద్ర తీర దేశాల మధ్య భారత్ నుంచి నౌకాయాన మార్గాన్ని సులభతరం చేయడం లక్ష్యంగా సేతు సముద్రం ప్రాజెక్టుకు 2005లో యూపీఏ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
ప్రస్తుతం వివిధ దేశాల నుంచి నౌకలు దక్షిణ భారత్లోకి రావాలంటే, శ్రీలంకను చుట్టి రావాల్సి ఉంది. దీంతో సమయం వృథా. దూరంతో పాటు ఖర్చులు ఎక్కువే. అందుకే శ్రీలంకను చుట్టకుండా నేరుగా రవాణా సాగే రీతిలో సేతు సముద్రం కాలువను అభివృద్ధి పరిచేందుకు చర్యలు చేపట్టారు. ఆ మేరకు రామనాథపురం జిల్లా రామేశ్వరం నుంచి ధనుస్కోడి మీదుగా నాగపట్నం తీరం వెంబడి భారత సరిహద్దుల గుండా 167 కి.మీ దూరం ఈ ప్రాజెక్టుకు చర్యలు తీసుకున్నారు. ఈ ప్రాజెక్టు పనులకు వేలాది కోట్లతో అత్యాధునిక పరికరాల్ని రంగంలోకి దించారు. పనులు ముందుకు సాగుతున్న మార్గంలో శ్రీరాముడు నిర్మించిన రామ సేతు వంతెన బయట పడింది. దీంతో పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పడి ఉన్నాయి.
ఈ పనుల్ని ముందుకు తీసుకెళ్లేందుకు గతంలో డీఎంకే ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నించినా, వివాదం కోర్టుకు చేరడంతో ఇక, పనులు ఆగినట్టే అన్న ప్రశ్న బయలు దేరింది. 2011లో అధికార పగ్గాలు చేపట్టిన అన్నాడీఎంకే సర్కారు రాముడు నిర్మించిన వంతెనను కూల్చేందుకు వీలు లేదని, ఆ వంతెనను పురాతన చిహ్నంగా ప్రకటించాలంటూ ఏకంగా అసెంబ్లీలో తీర్మానం సైతం తీసుకొచ్చింది. ఈ పరిణామాలతో సేతు ప్రాజెక్టు శకం ముగిసినట్టే అన్నది తేట తెల్లమైంది. అయితే, ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం మళ్లీ సేతుకు జీవం పోయడానికి తగ్గ కసరత్తుల్ని చేపట్టి ఉన్నట్టుంది. కేవలం తమిళనాడు ప్రగతిని పరిగణలోకి తీసుకోకుండా, దేశ ప్రగతికి దోహద పడే విధంగా ఈ ప్రాజెక్టు రూపు రేఖల్ని మార్చేందుకు నిర్ణయించినట్టుంది. పాత మార్గంలో కాకుండా, కొత్త మార్గంలో ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు తగ్గట్టుగా ప్రణాళిక సిద్ధమవుతున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి.
రూటు మారేనా: గత ఏడాది కేంద్ర నౌకాయాన, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కారీ రాష్ట్ర పర్యటనకు వచ్చిన వేళ హెలికాప్టర్లో చక్కర్లు కొడుతూ సేతు సముద్ర ప్రాజెక్టు మార్గాన్ని పరిశీలించి వెళ్లారు. తదుపరి దక్షిణ తమిళనాడు ప్రగతి మీద దృష్టి పెట్టే విధంగా రహదారుల విస్తరణ, కన్యాకుమారి జిల్లా కులచల్లో హార్బర్ తదితర పనుల ప్రకటనలు ఒక దాని తర్వాత మరొకటి వెలువడిందని చెప్పవచ్చు. ఈ పరిస్థితుల్లో గత వారం చెన్నైలో జరిగిన ప్రాంతీయ మీడియా సంపాదకుల సదస్సులో సేతు ప్రాజెక్టు పరిస్థితిపై ప్రశ్నల వర్షం కురిసినా, అధికారులు దాటవేత దోరణి అనుసరించారు. అదే సమయంలో ఆ ప్రాజెక్టు వివాదం కోర్టులో ఉందని, ప్రత్యామ్నాయం ఆలోచించే అవకాశాలు ఉన్నాయని సమాధానాలు ఇచ్చారు.
ఈ పరిస్థితుల్లో సేతు సముద్ర ప్రాజెక్టును పాత మార్గంలో కాకుండా, కొత్త మార్గంలో తీసుకెళ్లడానికి తగ్గ ప్రక్రియకు శ్రీకారం చుట్టే విధంగా పరిశీలనల వేగం పెరగడం ఆలోచించాల్సిందే. ధనుస్కోడి మీదుగా కాకుండా, పాంబన్ వంతెన మార్గం గుండా దారి మళ్లించి రామసేతు వంతెనకు ఎలాంటి ముప్పు ఎదురు కాని విధంగా రూట్ మ్యాప్ సిద్ధం చేసేందుకు నిపుణుల బృందం రంగంలోకి దిగి ఉన్నట్టుంది. ఇందు కోసం కేంద్రనౌకాయాన శాఖ కార్యదర్శి రాజీవ్ కుమార్ నేతృత్వంలోని బృందం రెండు రోజుల క్రితం ఆ మార్గాల్లో పరిశీలన జరిపింది. ఈ బృందం ఇచ్చే నివేదిక ఆధారంగా కొత్త మార్గంలో పనులకు తగ్గ కార్యాచరణను కేంద్రం ప్రకటించేందుకు అవకాశాలు ఉన్నాయి.
అదే సమయంలో కొత్త మార్గంలో ఈ ప్రాజెక్టును తీసుకెళ్లడంతో పాటు రామేశ్వరం లోని ధనుస్కోడి నుంచి శ్రీలంకలోని తలైమన్నార్కు సముద్రంలో వంతెన మార్గంలో రోడ్డు నిర్మాణాలకు తగ్గ పరిశీలన జరిగి ఉండటం విశేషం. అలాగే, ప్రఖ్యాతి గాంచిన పాంబన్ రైల్వే వంతెన విస్తరణకు తగ్గ ప్రక్రియకు చర్యలు చేపట్టి ఉన్నారు. వేలాడి వంతెన తరహాలో భారీ ట్రాక్ నిర్మాణానికి తగ్గట్టు రైల్వే శాఖ దృష్టి పెట్టి ఉండడం బట్టి చూస్తే, తమిళనాడు సర్వతోముఖాభివృద్ధికి దోహద పడే విధంగా మున్ముందు పరిణామాల వేగం పుంజుకునేనా అన్న ఎదురు చూపులు పెరిగాయి.