లక్షల్లో మెజారిటీ సాధించారు!
కోల్ కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు అభ్యర్థులు లక్షల మెజారిటీతో విజయం సాధించి సంచలనం సృష్టించారు. 500 లోపు మెజారిటీతో గెలిచిన నాయకులు కూడా ఉన్నారు. నీటిపారుదల శాఖ మంత్రి రజీబ్ బెనర్జీ డిస్టింక్షన్ లో పాసయ్యారు. తన సమీప స్వతంత్ర అభ్యర్థి ప్రొతిమ దుత్తాపై 107,701 ఓట్ల ఆధిక్యంతో విజయదుందుభి మోగించారు.
కేశపూర్ నుంచి పోటీ చేసిన మరో టీఎంసీ నేత సియలీ సాహ.. సీపీఎం అభ్యర్థి రామేశ్వర్ దొలయ్ పై 101,151 ఓట్లతో విజయకేతనం ఎగురవేశారు. కాంగ్రెస్ తరపున పోటీ చేసిన మనోజ్ చక్రవర్తి 92,273 ఓట్లతో గెలిచారు. టీఎంసీ ఎంపీ సువేందు అధికారి 81,230 ఓట్ల మెజారిటీతో సత్తా చాటారు. తృణమూల్ నేతలు ఆశిష్ చక్రవర్తి, ఆసిమా పాత్రా, సుకుమార్ హన్సడా 50 వేల ఓట్ల పైగా ఆధిక్యంతో విజయాలు సాధించారు.
కొంతమంది నాయకులు అత్యల్ప మెజారిటీతో గెలుపు సాధించారు. టీఎంసీ నుంచి అబ్దుర్ రెహమాన్ 280 స్వల్ప మెజారిటీతో గెలిచారు. ఇక పలువురు తృణమూల్ అభ్యర్థులు సీపీఎం చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయారు. టీఎంసీ నాయకులు ఏటీఎం అబ్దుల్లా(492), బెంగాలీ నటుడు సోహం చక్రవర్తి(616) పరాజయం పాలయ్యారు. అశోక్ కుమార్ దిండా(సీపీఐ), సాజల్ పాంజా(టీఎంసీ), రవీంద్రనాథ్ ఛటర్జీ(టీఎంసీ), తుషార్ కాంతి భట్టాచార్య(కాంగ్రెస్) కూడా 1000 కంటే తక్కువ ఓట్లతో ఓడిపోయారు.