బీజేపీ కొత్త సారధి పాటిల్?
ముంబై: బీజేపీ రాష్ట్ర పగ్గాలు పుణే గ్రాడ్యుయేట్ నియోజక వర్గం ఎమ్మెల్సీ చంద్రకాంత్ పాటిల్‌కు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం బీజేపీ ప్రదేశ్ అధ్యక్ష పదవిలో కొనసాగుతున్న దేవేంద్ర ఫడ్నవీస్‌కు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి పదవి రేసులో తను లేనని నితిన్ గడ్కరీ స్పష్టం చేయడంతో ఫడ్నవిస్‌కు రాష్ట్ర పగ్గాలు కట్టబెట్టడానికి ఎదురైన అడ్డంకులన్నీ తొలగిపోయాయి.
దీంతో ఖాళీకానున్న ప్రదేశ్ అధ్యక్ష పదవిలో పశ్చిమ మహారాష్ట్రకు చెందిన చంద్రకాంత్ పాటిల్‌ను నియమించాలని పార్టీ సీనియర్ నాయకులు యోచిస్తున్నారు. ఇదిలాఉండగా పాటిల్‌కు, జాతీయ అధ్యక్షుడు అమిత్ షాల మధ్య తత్సంబంధాలున్నాయి. దీంతో ఆ పదవి పాటిల్‌కు కట్టబెట్టేందుకు షా కూడా సానుకూలంగా ఉన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన వెంటనే పాటిల్‌ను ప్రదేశ్ అధ్యక్ష పదవిలో నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి.