Sevenhils Hospital
-
గ్రీన్ కార్పెట్‌తో ‘గ్లోబల్’కు కాలేయం తరలింపు
హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో గాయాలపాలై చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాలను దానం చేసేందుకు వారి బంధువులు ముందుకు రాగా.. లివర్‌ను గ్రీన్కార్పెట్తో హైదరాబాద్ లక్డీకాపూల్ గ్లోబల్ హాస్పిటల్‌కు తరలించి ఓ వ్యక్తికి అమర్చారు. విశాఖపట్నం నివాసి సత్యనారాయణ (53) ఈ నెల 26న రోడ్డుప్రమాదానికి గురవగా.. అక్కడి సెవెన్‌హిల్స్ హాస్పిటల్‌కు తరలించారు. 27న బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. జీవన్‌దాన్ చైర్మన్, ఎన్టీఆర్ వర్సిటీ వీసీ డాక్టర్ టి.రవిరాజు, చీఫ్ ట్రాన్స్‌ప్లాంట్ కో ఆర్డినేటర్ కష్ణమూర్తిల సహకారంతో అవయవదానం చేసేందుకు వారి బంధువులు ముందుకు రాగా మంగళవారం తెల్లవారు జామున 3.30 నిమిషాలకు గ్లోబల్ హాస్పిటల్స్ డాక్టర్లు మాథ్యూ జేకబ్, డాక్టర్ రాఘవేంద్ర, మురగన్ రాజన్నల బృందం అవయవాలను శరీరం నుంచి వేరు చేశారు. ఒక కిడ్నీని సెవెన్‌హిల్స్ హాస్పిటల్‌కు, మరో కిడ్నీని విశాఖపట్నం కేర్ హాస్పిటల్‌కు తరలించారు. లివర్‌ను గ్రీన్ కార్పెట్ సాయంతో లక్డీకాపూల్ గ్లోబల్ హాస్పిటల్‌కు తరలించారు. దీంతో నగరంలో నివాసముండే 63 ఏళ్ల వ్యక్తికి లివర్‌మార్పిడి శస్త్రచికిత్సను నిర్వహించినట్లు గ్లోబల్ హాస్పిటల్స్ డాక్టర్ హీరేంద్రనాథ్ తెలిపారు. అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ రాష్ట్రాల పోలీసులు లివర్ తరలించే సమయంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడటం వల్లే సకాలంలో హాస్పిటల్‌కు లివర్‌ను తరలించగలిగామని తెలిపారు. -
మృత్యువుతో పోరాటం
డాబాగార్డెన్స్: గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనలో సెవెన్‌హిల్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నలుగురి పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. క్షతగాత్రులు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. కేజీహెచ్ సూపర్‌స్పెషాల్టీ బ్లాక్‌లో చికిత్స పొందుతున్న ముగ్గురు చిన్నారులను మెరుగైన వైద్యం కోసం నగరంలోని ఏబీసీ ఆస్పత్రికి తరలించారు. రంగిరీజువీధిలో సోమవారం ఉదయం సంభవించిన గ్యాస్‌లీక్ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇంటి యజమాని కొప్పుల ఈశ్వరరావు (80 శాతం గాయాలు), పకోడి బండి వ్యాపారి కొల్లి సూరిబాబు (76 శాతం గాయాలు), శాంతమ్మ (50 శాతం గాయాలు), పేలుడు సంభవించిన ఇంట్లో అద్దెకు ఉంటున్న కోట సత్యనారాయణ మనుమరాలు పూజిత (60 శాతం గాయాలు) సెవెన్‌హిల్స్ ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. ఇదే ఘటనలో కేజీహెచ్ సూపర్ స్పెషాల్టీ బ్లాక్‌లో చికిత్స పొందుతున్న 19 నెలల చిన్నారి జయరామ్ పరిస్థితి విషమించడంతో తొలుత ఏబీసీ ఆస్పత్రికి...అనంతరం ఓమ్ని ఆర్కె చిల్డ్రన్ ఆస్పత్రికి తరలించారు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న రెండున్నరేళ్ల చాందిని, ఎనిమిదేళ్ల తనూజను కూడా ఇదే ఆస్పత్రికి తరలించారు. తొమ్మిది శాతం గాయాలతో కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న జి.నాగేశ్వరి, ఏడు శాతం గాయాలతో చికిత్స పొందుతున్న కీర్తిని బుధ, గురువారాల్లో డిశ్చార్జి చేయనున్నట్టు వైద్యులు తెలిపారు. ఇదే ఘటనలో కేజీహెచ్ సూపర్ స్పెషాల్టీ బ్లాకులో చికిత్స పొందుతున్న కోట బుజ్జికి కొల్లాజన్ (కాలిపోయిన చర్మానికి రక్షణ) వేశారు. క్షతగాత్రులను ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, రాజమండ్రి ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ బుధవారం పరామర్శించారు. పట్టించుకునేవారే లేరు మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్ చూసి వెళ్లిపోయారే తప్పా తమ గోడు పట్టించుకోలేదని బాధితుల బంధువులు ఆరోపించారు. ఇక్కడ అందుతున్న వైద్యం కోసం ఆరా తీసేవారే లేకపోయారంటూ వాపోయారు. పిల్లల పరిస్థితి విషమంగా ఉందని తెలిసినా.. రాత్రి వేళల్లో సెలైన్ ఆగిపోతే నర్సింగ్ సిబ్బంది లేకుండా పోయారని, వాచ్‌మన్ ఇష్టానుసారంగా వ్యవహరించారని ఎమ్మెల్యేలకు ఫిర్యాదు చేశారు. తమ పిల్లలు ప్రాణాలతో దక్కాలంటే ఇక్కడి నుంచి వేరే ఆస్పత్రికి తీసుకెళ్లి మంచి వైద్యం చేయించాలని మొర పెట్టుకున్నారు. నర్సింగ్ సిబ్బంది లేకపోవడం దౌర్భాగ్యం ఎమ్మెల్యేలు స్పందిస్తూ ఇక్కడి వైద్యులు చికిత్స బాగానే అందిస్తున్నారని, నర్సింగ్ సిబ్బంది తక్కువగా ఉండటంతో ఈ దౌర్భాగ్యం నెలకొందని వ్యాఖ్యానించారు. సూపర్ స్పెషాల్టీ బ్లాక్‌లో 36 పడకలున్నాయని, ఇద్దరు నర్సులు మాత్రమే ఇక్కడ సేవలందిస్తున్నారని, ఎంసీఐ నిబంధన మేరకు చాలినంత సిబ్బంది లేకపోవడం బాధాకరమన్నారు. స్మార్ట్ సిటీ కన్నా ముందు కేజీహెచ్‌ను స్మార్ట్ కేజీహెచ్‌గా తీర్చిదిద్దాల్సి ఉందన్నారు. కేజీహెచ్ బాగుంటే ప్రజలకు వైద్య సదుపాయం దక్కుతుందని, ఆస్పత్రి అభివృద్ధి అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించనున్నట్టు చెప్పారు. గ్యాస్ లీక్ సంఘటనలో ఇక్కడ చికిత్స పొందుతున్న వారిలో ముగ్గురు చిన్నారులను మెరుగైన వైద్యం కోసం కార్పొరేట్ ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. ఎమ్మెల్యేల వెంట కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మధుసూధనబాబు, ఆర్ఎంఓ కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, బీజేపీ నేత చెరువు రామకోటయ్య తదితరులున్నారు. -
కిడ్నీ రాకెట్ కలకలం
సెవెన్ హిల్స్ ఆస్పత్రి డెరైక్టర్ అరెస్టుతో వెలుగులోకి నకిలీ పత్రాలతో అక్రమాలు యథేచ్ఛగా అవయవమార్పిడి కిడ్నీ రాకెట్ వ్యవహారం నగరంలో సంచలనమైంది.ఒడిశా-విశాఖ కేంద్రంగా నడుస్తున్న ఈ వ్యవహారం సెవెన్‌హిల్స్ ఆస్పత్రి డెరైక్టర్ అరెస్టుతో వెలుగులోకి వచ్చింది. నకిలీ పత్రాలతో అక్రమాలకు పాల్పడినట్టు తేలింది. కార్పొరేట్ ఆస్పత్రుల మాయాజాలంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విశాఖపట్నం, మెడికల్ : ఒడిశా, ఛత్తీస్‌గఢ్, బెంగాల్లో సాగుతున్న కిడ్నీ కుంభకోణ ఛాయలు విశాఖ నగరాన్ని తాకాయా?.. నగర పరిధిలోని కిడ్నీ మార్పిడులు నిబంధనలకు విరుద్ధంగా యథేచ్చగా జరుగుతున్నాయా అంటే అవుననే సమాధానం వస్తోంది. దీనికి నిదర్శనంగా మంగళవారం విశాఖ సెవెన్ హిల్స్ ఆస్పత్రి డెరైక్టర్ అరెస్టు ఉదంతం నిలుస్తోంది. దీంతో విశాఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలు చేయించుకోవాలంటే ప్రజల్లో భయం పట్టుకుంటోంది. విశాఖ నగరంలోని కార్పొరేట్ ఆస్పత్రులు ఉత్తరాంధ్ర సరిహద్దు రాష్ట్రాలకు వైద్యపరంగా పెద్దదిక్కు. ఎటువంటి వైద్యానికైనా విశాఖపైనే ఆధారపడుతుంటారు. దీనిని ఆసరాగా చేసుకున్న కొన్ని ఆస్పత్రుల యాజమాన్యాలు డబ్బు యావకు లోనై రోగుల ఆరోగ్యంతో వ్యాపారం చేస్తున్నాయన్న అనుమానాలను సెవెల్‌హిల్స్ నిజం చేసింది. కిడ్నీ మార్పిడి సంఘటనలో ఆస్పత్రి డెరైక్టర్ అరెస్టు ఇప్పుడు కలకలం రేపింది. అవయవ మార్పిడికి సంబంధించి రక్త సంబంధీకులు, ఇతర బంధు వర్గాల నుంచి అవయవాలను దానంగా పొందాలంటే ఏపీ అవయవమార్పిడి చట్టం నిబంధనల ప్రకారం స్థానికంగా ఉండే బోధనాస్పత్రి పరిధిలోని ఆథరైజేషన్ కమిటీ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. భార్యాభర్తల విషయంలో అనుమతుల్లో అస్పష్టత ఉండడంతో దీనిని ఆసరాగా తీసుకొని కార్పొరేట్ ఆస్పత్రులు కాసులు దండుకుంటున్నాయన్న విమర్శలు గుప్పుమంటున్నాయి. నగరంలో చాలా కార్పొరేట్ ఆస్పత్రులు ఈ నిబంధనలను తుంగలో తొక్కుతూ దొడ్డిదారిన యథేచ్ఛగా అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలు నిర్వహిస్తూ సొమ్ము చేసుకుంటున్నాయన్న ఆరోపణలున్నాయి. ప్రధానంగా నగరంలోని కేర్, అపోలో ఆస్పత్రుల్లో గుండె, కాలేయం, కిడ్నీ, కళ్లు తదితర అవయవాలను మార్పిడి చేసేందుకు అనుమతులున్నాయి. కీలక అవయవాల మర్పిడికి సంబంధించి ఏపీ జీవన్‌దాన్ అనుమతులను అవయవదాతలు, స్వీకరణకర్తలు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. కళ్లు, కిడ్నీ వంటి అవయవదానాలకు స్థానికంగా ఉండే ఆథరైజేషన్ కమిటీ అనుమతులు తప్పనిసరి అయినప్పటికీ ఎవరూ పాటించడం లేదు. ఈ అనుమతుల కోసం ఆథరైజేషన్ కమిటీ కూడా భారీ మొత్తంలో సొమ్ములు వసూలు చేస్తుండడంతో, కమిటీకి తెలియకుండా అవయవమార్పిడి శస్త్ర చికిత్సలు నిర్వహిస్తుండడం విశేషం.