డాబాగార్డెన్స్: గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనలో సెవెన్‌హిల్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నలుగురి పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. క్షతగాత్రులు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. కేజీహెచ్ సూపర్‌స్పెషాల్టీ బ్లాక్‌లో చికిత్స పొందుతున్న ముగ్గురు చిన్నారులను మెరుగైన వైద్యం కోసం నగరంలోని ఏబీసీ ఆస్పత్రికి తరలించారు. రంగిరీజువీధిలో సోమవారం ఉదయం సంభవించిన గ్యాస్‌లీక్ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇంటి యజమాని కొప్పుల ఈశ్వరరావు (80 శాతం గాయాలు), పకోడి బండి వ్యాపారి కొల్లి సూరిబాబు (76 శాతం గాయాలు), శాంతమ్మ (50 శాతం గాయాలు), పేలుడు సంభవించిన ఇంట్లో అద్దెకు ఉంటున్న కోట సత్యనారాయణ మనుమరాలు పూజిత (60 శాతం గాయాలు) సెవెన్‌హిల్స్ ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు.
ఇదే ఘటనలో కేజీహెచ్ సూపర్ స్పెషాల్టీ బ్లాక్‌లో చికిత్స పొందుతున్న 19 నెలల చిన్నారి జయరామ్ పరిస్థితి విషమించడంతో తొలుత ఏబీసీ ఆస్పత్రికి...అనంతరం ఓమ్ని ఆర్‌కె చిల్డ్రన్ ఆస్పత్రికి తరలించారు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న రెండున్నరేళ్ల చాందిని, ఎనిమిదేళ్ల తనూజను కూడా ఇదే ఆస్పత్రికి తరలించారు. తొమ్మిది శాతం గాయాలతో కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న జి.నాగేశ్వరి, ఏడు శాతం గాయాలతో చికిత్స పొందుతున్న కీర్తిని బుధ, గురువారాల్లో డిశ్చార్జి చేయనున్నట్టు వైద్యులు తెలిపారు. ఇదే ఘటనలో కేజీహెచ్ సూపర్ స్పెషాల్టీ బ్లాకులో చికిత్స పొందుతున్న కోట బుజ్జికి కొల్లాజన్ (కాలిపోయిన చర్మానికి రక్షణ) వేశారు. క్షతగాత్రులను ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, రాజమండ్రి ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ బుధవారం పరామర్శించారు.
పట్టించుకునేవారే లేరు
మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్ చూసి వెళ్లిపోయారే తప్పా తమ గోడు పట్టించుకోలేదని బాధితుల బంధువులు ఆరోపించారు. ఇక్కడ అందుతున్న వైద్యం కోసం ఆరా తీసేవారే లేకపోయారంటూ వాపోయారు. పిల్లల పరిస్థితి విషమంగా ఉందని తెలిసినా.. రాత్రి వేళల్లో సెలైన్ ఆగిపోతే నర్సింగ్ సిబ్బంది లేకుండా పోయారని, వాచ్‌మన్ ఇష్టానుసారంగా వ్యవహరించారని ఎమ్మెల్యేలకు ఫిర్యాదు చేశారు. తమ పిల్లలు ప్రాణాలతో దక్కాలంటే ఇక్కడి నుంచి వేరే ఆస్పత్రికి తీసుకెళ్లి మంచి వైద్యం చేయించాలని మొర పెట్టుకున్నారు.
నర్సింగ్ సిబ్బంది లేకపోవడం దౌర్భాగ్యం
ఎమ్మెల్యేలు స్పందిస్తూ ఇక్కడి వైద్యులు చికిత్స బాగానే అందిస్తున్నారని, నర్సింగ్ సిబ్బంది తక్కువగా ఉండటంతో ఈ దౌర్భాగ్యం నెలకొందని వ్యాఖ్యానించారు. సూపర్ స్పెషాల్టీ బ్లాక్‌లో 36 పడకలున్నాయని, ఇద్దరు నర్సులు మాత్రమే ఇక్కడ సేవలందిస్తున్నారని, ఎంసీఐ నిబంధన మేరకు చాలినంత సిబ్బంది లేకపోవడం బాధాకరమన్నారు. స్మార్ట్ సిటీ కన్నా ముందు కేజీహెచ్‌ను స్మార్ట్ కేజీహెచ్‌గా తీర్చిదిద్దాల్సి ఉందన్నారు.
కేజీహెచ్ బాగుంటే ప్రజలకు వైద్య సదుపాయం దక్కుతుందని, ఆస్పత్రి అభివృద్ధి అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించనున్నట్టు చెప్పారు. గ్యాస్ లీక్ సంఘటనలో ఇక్కడ చికిత్స పొందుతున్న వారిలో ముగ్గురు చిన్నారులను మెరుగైన వైద్యం కోసం కార్పొరేట్ ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. ఎమ్మెల్యేల వెంట కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మధుసూధనబాబు, ఆర్‌ఎంఓ కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, బీజేపీ నేత చెరువు రామకోటయ్య తదితరులున్నారు.
మృత్యువుతో పోరాటం
Published Thu, Dec 11 2014 1:52 AM | Last Updated on Sat, Sep 2 2017 5:57 PM
Advertisement
Advertisement