రూ. 1,598 కోట్ల సాయం కావాలి
కరువు తీవ్రతను ప్రతిబింబించేలా నివేదించండి
కేంద్ర బృందానికి రాష్ట్రం వినతి
సాక్షి, హైదరాబాద్: వరుస విపత్తులతో తీవ్రంగా నష్టపోతున్న రాష్ట్రాన్ని ఆదుకునేందుకు ఉదారంగా సాయం చేసేలా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని కేంద్ర కరువు బృందానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. రూ.1,598 కోట్ల కరువు సాయం ఇవ్వాలని కోరుతూ నివేదిక సమర్పించింది. వైఎస్సార్, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లోని కరువు ప్రాంతాలను పరిశీలించి వచ్చిన కేంద్ర బృందం ప్రతినిధులతో శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు సమీక్షించారు.
కరువు తీవ్రతను వివరించి రాష్ట్రానికి కేంద్రం సాయం అందించేలా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర వ్యవసాయశాఖ సంయుక్త కార్యదర్శి షకీల్ అహ్మద్ నేతృత్వంలోని తొమ్మిదిమంది కేంద్ర బృందం ప్రతినిధులతో సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు సమావేశమయ్యారు. ఏపీ విపత్తు బాధిత రాష్ట్రంగా మారిందని సీఎస్ చెప్పారు.
దుర్భర పరిస్థితి ఉంది: కేంద్ర బృందం
ఈ సందర్భంగా కేంద్ర బృందం ప్రతినిధులు మాట్లాడుతూ గ్రామీణ ప్రజలు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. ‘అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్, ప్రకాశం జిల్లాల్లో తాగునీటి సమస్య కూడా ఉంది. కరువు నివారణకు దీర్ఘకాలిక, శాశ్వత పరిష్కార చర్యలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. నివేదికలో పేర్కొంటాం..’ అని కేంద్ర బృందం నాయకుడు షకీల్ అహ్మద్ తెలిపారు.