సంక్షేమ హాస్టళ్లను పరిరక్షించాలి
ఏలూరు సిటీ : సంక్షేమ హాస్టళ్లను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో విజయవాడలో చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షల్లో జిల్లాకు చెందిన ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు వై.రాము, జిల్లా సహాయ కార్యదర్శి కాగిత అనిల్ ఉన్నారని జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కారుమంచి క్రాంతిబాబు, వి.మహేష్ ఆదివారం తెలిపారు. సంక్షేమ హాస్టళ్లను మూసివేయాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని, సమస్యలు పరిష్కరించాలని వారు డిమా ండ్ చేశారు.
ఈ మేరకు సోమవారం చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చామన్నారు. చలో విజయవాడ కార్యక్రమానికి జిల్లాలోని వేలా ది మంది విద్యార్థులు కదలివెళుతున్నట్టు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులకు విద్యను దూరం చేసేలా నిరంకుశ చర్యలపై ఎస్ఎఫ్ఐ ఉద్యమిస్తుందన్నారు. సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థికి మెస్ చార్జీలను రూ.1,050 నుంచి రూ.2 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. విద్యావ్యవస్థను కార్పొరేట్ మయం చేసే కుట్రలు మానుకోవాలని ప్రభుత్వానికి హితవుపలికారు. ప్రభుత్వం తన విధానాలు మార్చుకోకుంటే భారీస్థాయిలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.