sfi protest
-
తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత..
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ వద్ద ఆదివారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. అసెంబ్లీ మెరుపు ముట్టడికి ఎస్ఎఫ్ఐ నేతలు, విద్యార్థులు యత్నించారు. 100 మందికి పైగా విద్యార్థులు ఒక్కసారిగి అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు. ఎస్ఎఫ్ఐ విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిరసనకు దిగిన మహిళలను సైతం ఈడ్చిపడేశారు. దీంతో అసెంబ్లీ పరిసరాలు ఉద్రిక్తంగా మారాయి. ఎస్ఎఫ్ఐ నాయకుల డిమాండ్లు ►మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియింబర్స్‌మెంట్ రూ. 5,177 కోట్ల బకాయిలు తక్షణమే విడుదల చేయాలి. ► పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్న టీచర్స్ లెక్చరర్స్ ప్రొఫెసర్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి. ►హై స్కూల్స్, కేజీబీవీలు, మోడల్ స్కూల్స్‌లోకి విద్యార్థి సంఘాలను అనుమతించవద్దని సెక్యులర్ పేరుతో విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన ఇచ్చిన ఆదేశాలు వెనక్కి తీసుకోవాలి. ►తక్షణమే అద్దె భవనాల్లో నడుస్తున్న గురుకులాలు కేజీబీవీ సంక్షేమ హాస్టల్ లను సొంత భవనాలు నిర్మించాలి. ► నూతన జాతీయ విద్యా విధానం 2020 తెలంగాణలో అమలు చేయకుండా అసెంబ్లీ తీర్మానం చేయాలి. -
హెచ్‌సీయూలో ఉద్రిక్తత.. మోదీ బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శనతో టెన్షన్
సాక్షి, హైదరాబాద్: నగరంలోని హెచ్‌సీయూ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. హెచ్‌సీయూలో ప్రధాని నరేంద్ర మోదీపై రూపొందించిన బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శన వల్ల ఏబీవీపీ-ఎస్ఎఫ్ఐ నేతలు, కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. దీంతో, పోలీసులు వారిని ఎంట్రీ ఇచ్చారు. వివరాల ప్రకారం.. హెచ్‌సీయూలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. క్యాంపస్‌లో గురువారం సాయంత్రం కశ్మీర్ ఫైల్స్‌ను ప్రదర్శించేందుకు ఏబీవీపీ ప్రయత్నించింది. ఈ సందర్భంగా మోదీ బీబీసీ డాక్యుమెంటరీని ప్రదర్శించేందుకు ఎస్ఎఫ్ఐ నేతలు ప్రయత్నించారు. దీంతో, ఇరు వర్గాల విద్యార్థి సంఘాలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో క్యాంపస్‌లో ఎలాంటి ప్రదర్శనలకు అనుమతిలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటన కారణంగా హెచ్‌సీయూలో పోలీసులు భారీగా పోలీసులు మోహరించారు. -
‘నా జుట్టు పట్టుకు లాగారు.. కింద పడేశారు’
కోల్‌కతా: బీజేపీ ఎంపీ బాబుల్ సుప్రీయోకు విద్యార్థుల నిరసన సెగ తగిలింది. గురువారం కోల్‌కతాలోని జాదవ్‌పూర్ యూనివర్సిటీలో ఏబీవీపీ విద్యార్థులు ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి బాబుల్ సుప్రియో హాజరయ్యారు. ఈ క్రమంలో కాలేజీలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన బాబుల్ సుప్రియోను కొందరు విద్యార్థులు అడ్డుకుని గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. వీరంతా స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్ఎఫ్ఐ), ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ అసోసియేషన్‌కు(ఏఎస్ఎఫ్ఏ) చెందిన వారు కావడం విశేషం. విద్యార్థుల నిరసన నేపథ్యంలో బాబుల్ సుప్రియో క్యాంపస్‌లోకి వెళ్లకుండానే వెను తిరిగారు. ఈ సందర్భగా బాబుల్ మాట్లాడుతూ.. ‘నేను రాజకీయాలు చేయడం కోసం ఇక్కడకు రాలేదు. కానీ విద్యార్థుల ప్రవర్తన చూస్తే నాకు చాలా బాధ కలుగుతుంది. వారు నన్ను అడ్డుకున్నారు. నా జుట్టు పట్టుకు లాగారు. కింద పడేసారు. వారంతా తమను తాము నక్సల్స్‌గా పిలుచుకుని నన్ను రెచ్చగొట్టాలని చూశారు. కానీ వారు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా నన్ను రెచ్చగొట్టలేరు’ అని పేర్కొన్నారు. ఆ సమయంలో గవర్నర్ జగదీప్ ధంఖర్, యూనివర్సిటీ చాన్సిలర్ అక్కడే ఉన్నారు. జరిగిన విషయాన్ని గవర్నర్ సీరియస్‌గా తీసుకున్నట్లు సమాచారం. -
ప్రత్యేక రాష్ట్రంలో సమస్యల పరిష్కారం శూన్యం
సాక్షి, రంగారెడ్డి జిల్లా : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై నాలుగేళ్లు గడుస్తున్నా విద్యారంగం సమస్యలు ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయని ఎస్ఎఫ్ఐ విద్యార్థులు విమర్శించారు. విద్యారంగాన్ని బలోపేతంపై ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు సోమవారం కలెక్టరేట్‌ను ముట్టడించారు. కలెక్టరేట్ వరకు ర్యాలీగా వచ్చిన విద్యార్థులు ప్రభుత్వ నిర్లక్ష్యంపై ధ్వజమెత్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మూత్రశాలలు, మరుగుదొడ్లు, తాగునీటి సరఫరా వంటి కనీస సౌకర్యాలు లేదన్నారు. సన్నబియ్యం పేరిట నాసిరకం బియ్యాన్ని మధ్యాహ్న భోజనంలో పెడుతున్నారని మండిడ్డారు. వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులకు మూడు నెలలుగా కాస్మోటిక్ చార్జీలు చెల్లించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేజీబీవీల్లో చదువుకుంటున్న విద్యార్థినులకు నోట్‌బుక్స్, దుప్పట్లు, ప్లేట్లు, పెట్టలు అందజేయకపోవడాన్ని తప్పుబట్టారు. రెగ్యులర్ ఎంఈఓలను నియమించాలని డిమాండ్ చేశారు. పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయడానికి సర్కారుకు మనసు రావడం లేదని ధ్వజమెత్తారు. ఆగస్టు 15 నుంచి జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం వడ్డిస్తామన్న హామీ ఎందుకు అమలుకు నోచుకోవడం లేదని ప్రశ్నించారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందజేస్తామని సీఎం కేసీఆర్ హామీ నీటిమీది రాతగా మారిందని ఎద్దేవా చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ రఘునందన్‌రావుకు అందజేశారు. -
ప్రైవేటు దోపిడీని అరికట్టాలి : ఎస్ఎఫ్ఐ
వికారాబాద్ అర్బన్: ప్రైవేటు విద్యా సంస్థల దోపిడీని అరికట్టాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు యాదగిరి డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ, పీడీఎస్‌యూ విద్యార్థి సంస్థల ఆధ్వర్యంలో గురువారం విద్యాసంస్థల బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా కార్పొరేట్ విద్యను ప్రోత్సహిస్తున్నట్లు ఆరోపించారు. సామాన్యులకు ఉన్నత విద్య అందుబాటులో లేకుండా ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నట్లు ఆరోపించారు. కార్పొరేట్ పేరుతో పాఠశాలలు, కళాశాలలు లక్షల ఫీజులు వసూలూ చేస్తున్నట్లు తెలిపారు. కేజీ టూ ఫీజీ వరకు ఉచిత విద్యను అందిస్తానన్న కేసీఆర్ ఎందుకు అమలు చేయడం లేదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉందన్నారు. ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలు కేవలం పేరుకు మాత్రమే ఉన్నాయన్నారు. కనీస వసతులు లేక విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. ఎయిడెడ్ కళాశాలలను ప్రభుత్వం ప్రైవేటు పరం చేసేందుకు కుట్ర చేస్తున్నట్లు ఆరోపించారు. రూ.వేల కోట్ల రూపాయల ఆస్తులను దక్కించుకునేందుకు ప్రభుత్వం ఈ రకమైన కుట్రను చేస్తుందన్నారు. వికారాబాద్‌లోని శ్రీ అనంతపద్మనాభ వంటి ఎయిడెడ్ కళాశాల అందరి సహకారంలో ఏర్పడిందన్నారు. ఈ ప్రాంత రైతులు ధాన్యం అమ్మినప్పుడు కొంత డబ్బు కళాశాల కోసం వెచ్చించారని, ఇప్పుడు ప్రైవేటు చేస్తే ఆ ఆస్తి పూర్తిగా అక్రమార్కుల చేతులోకి పోతుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని మార్చుకోవాలన్నారు. యూజీసీని రద్దు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నట్లు తెలిపారు. యూజీసీ రద్దు చేస్తే దాదాపుగా ప్రభుత్వ పరమైన విద్య ఆగిపోయినట్లే అన్నారు. విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు ఎస్ఎఫ్ఐ, పీడీఎస్‌యూ ఆందోళన చేస్తుందన్నారు. బంద్ నిర్వహిస్తున్న నాయకులను పోలీసులు అరెస్టు చేసి వ్యక్తిగత పూచీపై వదిలిపెట్టారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు మహేందర్ పాల్గొన్నారు. -
నీట్‌పై నిరసన సెగలు
సాక్షి, చెన్నై : నీట్ ఎగ్జామినేషన్‌ను వ్యతిరేకిస్తూ చెన్నైలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టారు. నగరంలోని అన్నానగర్‌లో సీబీఎస్ఈ జోనల్ కార్యాలయం ఎదుట విద్యార్థులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, దేశవ్యాప్తంగా దాదాపు 13 లక్షల మందికి పైగా అభ్యర్థులు ఆదివారం నిర్వహించిన నీట్ పరీక్షకు హజరయ్యారు. దేశవ్యాప్తంగా 136 నగరాల్లో మెడికల్, డెంటల్ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం సీబీఎస్ఈ నీట్ పరీక్షను నిర్వహించింది. 13 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షకు నమోదు చేసుకున్నారని, దేశమంతటా 2,225 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించామని సీనియర్ సీబీఎస్ఈ అధికారి వెల్లడించారు. దరఖాస్తులు పెద్దసంఖ్యలో రావడంతో ఈ ఏడాది అదనంగా 43 నూతన కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. నీట్ అభ్యర్థులకు మెరుగైన ఏర్పాట్లు చేసినప్పటికీ తమిళనాడు సహా పలు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలకు అభ్యర్ధుల హాజరు తక్కువగా ఉందని అన్నారు. నీట్ కేంద్రాల వద్ద అధికారులు కఠిన భద్రతా చర్యలు చేపట్టారు. మాస్ కాపీయింగ్‌ను నిరోధించే క్రమంలో అభ్యర్ధుల డ్రెస్ కోడ్‌పై అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. విద్యార్థినులను హెయిర్ పిన్స్, ఆభరణాలు, షూస్‌ను తీసివేయాలని కోరారు. పరీక్షా కేంద్రాల్లో 4000 మంది పరిశీలకును నియమించారు. దాదాపు 1,20,000 మంది ఇన్విజిలేటర్లను రంగంలో దించారు. -
స్కాలర్షిప్ నిధులు విడుదల చేయాలి
కలెక్టరేట్ ఎదుట ఎస్ఎఫ్ఐ నాయకులు ధర్నా నెల్లూరు(పొగతోట): స్కాలర్షిప్లు, ఫీజురీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు నాయుడురవి డిమాండ్ చేశారు. శుక్రవారం నగరంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట అందోళన చేపట్టారు. కలెక్టరేట్‌లోకి చోచ్చుకుని పోయేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో పోలీసులకు విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది. కలెక్టరేట్ గేట్‌కు వేసిన చైన్‌ను విద్యార్థులు లాగివేశారు. జిల్లా అధికారులు వచ్చి హామీ ఇచ్చేంత వరకు ఇక్కడి నుంచి వెళ్లేది లేదని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జాయింట్ కలెక్టర్ మహమ్మద్‌ఇంతియాజ్ విద్యార్థి సంఘ నాయకులుతో మాట్లాడి వినతి పత్రం స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్, కాస్మోటిక్ చార్జీలు పెంచాలన్నారు. సాంఘిక సంక్షేమ హాస్టళ్లకు సన్న బియ్యం సరఫరా చేయాలన్నారు. హస్టళ్లలో మరుగుదొడ్లు నిర్మించాలన్నారు. గురుకుల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఒక్కోనియోజకవర్గానికి రెండు గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయాలన్నారు. విక్రమ సింహపురి యూనివర్సిటినీ కొత్త భవనంలోకి మార్చాలని కోరారు. -
విద్యార్థుల చావులు కనిపించవా..?
–ఎస్ఎఫ్ఐ అఖిల భారత మాజీ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు – హాస్టళ్ల మూసివేతకు నిరసనగా రెండోరోజుకు చేరుకున్న ఎస్ఎఫ్ఐ నిరవధిక దీక్ష –వైఎస్సార్‌ఎస్‌యూ మద్దతు విజయవాడ (గాంధీనగర్) : రాష్ట్రంలో మూసివేసిన సంక్షేమ హాస్టళ్లను పునఃప్రారంభించాలని, మెస్‌చార్జీలు పెంచాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో స్థానిక అలంకార్ సెంటర్లో చేస్తున్న నిరవధిక దీక్ష ఆదివారం రెండోరోజుకు చేరింది. దీక్షా శిబిరాన్ని ఎస్ఎఫ్ఐ అఖిల భారత మాజీ అధ్యక్షుడు వై.వెంకటేశ్వరరావు సందర్శించి మద్దతు తెలిపారు. ఆయన మాట్లాడుతూ సంక్షేమ హాస్టళ్లపై ప్రభుత్వం సవతి ప్రేమ చూపుతోందన్నారు. మూడు రోజుల క్రితం విశాఖపట్నంలోని సంక్షేమ వసతి గృహంలో చదువుతున్న విద్యార్థి మరణిస్తే మంత్రి రావెల కిషోర్ స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. హాస్టల్ విద్యార్థుల చావులు ప్రభుత్వానికి కనిపించవా అని ప్రశ్నించారు. చిత్తశుద్ధి ఉంటే.. హాస్టల్ విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఒక్క రోజైనా ముఖ్యమంత్రి విద్యార్థులతో మాట్లాడి ఉండేవారన్నారు. విద్యార్థి ఉద్యమాలను అణచివేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు, రాష్ట్ర కార్యదర్శి నూర్‌మహ్మద్ మాట్లాడుతూ మెస్‌చార్జీలు రూ. 750 నుంచి రూ.1500, కళాశాల విద్యార్థులకు రూ. 2వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. దీక్షకు వైఎస్సార్ విద్యార్థి విభాగం మద్దతు... ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక దీక్షకు వైఎస్సార్ విద్యార్థి విభాగం మద్దతు ప్రకటించింది. వైఎస్సార్‌ఎస్‌యూ నగర అధ్యక్షుడు దొడ్డా అంజిరెడ్డి మాట్లాడుతూ హాస్టళ్లు మూసివేసి ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను విద్యకు దూరం చేయొద్దన్నారు. మూసివేసిన హాస్టళ్లను ప్రభుత్వం తిరిగి ప్రారంభించకపోతే అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకొని ఐక్య ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో తుమ్మా రామ్, కె.నాగేంద్రరెడ్డి, ఉదయ్‌కిరణ్, ఎస్ఎఫ్ఐ నాయకులు అశోక్, టి.ప్రవీణ్, మహేష్, కోటబాబు, సుమంత్, రాణి పాల్గొన్నారు.