విద్యార్థుల చావులు కనిపించవా..?
–ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత మాజీ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు
– హాస్టళ్ల మూసివేతకు నిరసనగా
రెండోరోజుకు చేరుకున్న ఎస్‌ఎఫ్‌ఐ నిరవధిక దీక్ష
–వైఎస్సార్‌ఎస్‌యూ మద్దతు
విజయవాడ (గాంధీనగర్) :
రాష్ట్రంలో మూసివేసిన సంక్షేమ హాస్టళ్లను పునఃప్రారంభించాలని, మెస్‌చార్జీలు పెంచాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో స్థానిక అలంకార్ సెంటర్‌లో చేస్తున్న నిరవధిక దీక్ష ఆదివారం రెండోరోజుకు చేరింది. దీక్షా శిబిరాన్ని ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత మాజీ అధ్యక్షుడు వై.వెంకటేశ్వరరావు సందర్శించి మద్దతు తెలిపారు. ఆయన మాట్లాడుతూ సంక్షేమ హాస్టళ్లపై ప్రభుత్వం సవతి ప్రేమ చూపుతోందన్నారు. మూడు రోజుల క్రితం విశాఖపట్నంలోని సంక్షేమ వసతి గృహంలో చదువుతున్న విద్యార్థి మరణిస్తే మంత్రి రావెల కిషోర్ స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. హాస్టల్ విద్యార్థుల చావులు ప్రభుత్వానికి కనిపించవా అని ప్రశ్నించారు.
చిత్తశుద్ధి ఉంటే..
హాస్టల్ విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఒక్క రోజైనా ముఖ్యమంత్రి విద్యార్థులతో మాట్లాడి ఉండేవారన్నారు. విద్యార్థి ఉద్యమాలను అణచివేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు, రాష్ట్ర కార్యదర్శి నూర్‌మహ్మద్ మాట్లాడుతూ మెస్‌చార్జీలు రూ. 750 నుంచి రూ.1500, కళాశాల విద్యార్థులకు రూ. 2వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
దీక్షకు వైఎస్సార్ విద్యార్థి విభాగం మద్దతు...
ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక దీక్షకు వైఎస్సార్ విద్యార్థి విభాగం మద్దతు ప్రకటించింది. వైఎస్సార్‌ఎస్‌యూ నగర అధ్యక్షుడు దొడ్డా అంజిరెడ్డి మాట్లాడుతూ హాస్టళ్లు మూసివేసి ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను విద్యకు దూరం చేయొద్దన్నారు. మూసివేసిన హాస్టళ్లను ప్రభుత్వం తిరిగి ప్రారంభించకపోతే అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకొని ఐక్య ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో తుమ్మా రామ్, కె.నాగేంద్రరెడ్డి, ఉదయ్‌కిరణ్, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు అశోక్, టి.ప్రవీణ్, మహేష్, కోటబాబు, సుమంత్, రాణి పాల్గొన్నారు.