మందకొడిగా వివాహ పథకాలు
* పెరుగుతున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ దరఖాస్తులు...
* 10వేలకు పైగా పెండింగ్
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీ వర్గాలకు చెందిన పేదింటి అమ్మాయిలకు వివాహ సమయంలో రూ.51 వేలు అందించేందుకు ఉద్దేశించిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు మందకొడిగా సాగుతున్నాయి. ఈ పథకాల కింద పెట్టుకున్న దరఖాస్తులను అధికారులు చాలా సూక్ష్మంగా పరిశీలిస్తున్నారు. కొందరు అనర్హులు లబ్ధిపొందారన్న వార్తల నేపథ్యంలో పరిశీలనలో జాప్యం జరుగుతోంది.
దాదాపు 1500 దరఖాస్తులను తిరస్కరించారు. అత్యధికంగా ఎస్టీశాఖ పరిధిలో 697, ఎస్సీశాఖ 684, మైనారిటీ శాఖకు సంబంధించి 107 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. సరైన అర్హతలు లేకపోయినా, ఆయా ధ్రువీకరణ పత్రాలను సమర్పించకపోవడంతో అధికారులు తిరస్కరిస్తున్నారు. ఇటీవల దరఖాస్తుల పెండింగ్ సంఖ్య కూడా పెరిగిపోయింది. ఇప్పటివరకు 10 వేలకుపైగా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ప్రస్తుత ఆర్థికసంవత్సరంలో ఆరు నెలల్లో ఈ మూడు శాఖలకు 59,428 దరఖాస్తులు రాగా... 47,728 దరఖాస్తులను ఆమోదించారు.