Shafi Armor
-
టెక్నాలజీతోనే ఉగ్ర కుట్రకు ప్లాన్
- నిఘాకు చిక్కకుండా సాంకేతికత వినియోగం - లోతుగా ఆరా తీస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో పేలుళ్లకు కుట్ర పన్నిన ‘ఉగ్ర మూకలు’ వినియోగించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని చూసి జాతీయ దర్యా ప్తు బృందం(ఎన్ఐఏ) అధికారులు ఆశ్చర్యపోతున్నారు. నిఘాకు చిక్కకుండా ఉండేందుకు ఐపీ అడ్రస్‌లను హ్యాక్ చేయడం, ‘అండర్‌గ్రౌండ’ వెబ్ ద్వారా బృందంగా ఏర్పడటాన్ని చూసి అధికారులు విస్తుపోయారు. ఉగ్ర అనుమానితుల కస్టడీలో భాగంగా దాడి కుట్రకు దారి తీసిన విధానంపై లోతుగా అధ్యయనం చేస్తున్నారు. పేలుళ్ల కోసం వారు ఎక్కువగా సాంకేతికతను వాడటంపై విచారిస్తున్నారు. ఫేస్బుక్ ద్వారా చాటింగ్, ఈ-మెయిల్స్ నేరుగా పంపితే నిఘా అధికారులు గుర్తించే అవకాశం ఉండటంతో ఉగ్రమూకలు వ్యూహా త్మకంగా వ్యవహరించాయి.వీడియో కాలింగ్, చాటింగ్ కోసం కొన్ని సందర్భాల్లో ఇతరుల ఐపీ అడ్రస్‌లను తస్కరించి ఉపయోగించాయి. హ్యాకింగ్ టూల్స్‌కు చిక్కకుండా ఉండేం దుకు ‘అండర్‌గ్రౌండ్’ వెబ్ ద్వారా బృందం గా ఏర్పడి దాడులకు కుట్రపన్నాయి. ఇందుకోసం టెయిల్స్‌గా పిలిచే ప్రత్యేక ఆపరేటింగ్ సిస్టంను పీసీల్లో ఇన్స్టాల్ చేసుకున్నాయి. అలాగే సోషల్ మీడియా పనిచేయడానికి ఏదో ఒక సర్వర్ హోస్ట్ చేయాల్సి ఉండగా నిఘా వర్గాలకు సర్వర్ అడ్రస్, ఇతర వివరాలు చిక్కకుండా ఉండేందుకు వారు డార్క్ నెట్‌ను ఉపయోగించారు. దీనివల్ల ‘అండర్‌గ్రౌండ్’ నెట్‌కు సంబంధించిన సర్వర్లు, వాటి చిరునామాలతోపాటు వాటిని నిర్వహిస్తున్న వారి వివరాలు తెలిసే అవకాశాలు చాలా కష్టమవుతుంది. కేంద్రం అధీనంలోని నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఎన్టీఆర్వో) ద్వారా ఉగ్ర వ్యూహానికి ఎన్ఐఏ చెక్ పెట్టింది. పరిజ్ఞానం అందించిందెవరు..? ఉగ్ర అనుమానితులకు భారీ స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎవరు అందించారనే దానిపై ఎన్ఐఏ దృష్టిసారించింది. పట్టుబడిన వారందరూ కూడా అంతగా నైపుణ్యం కలిగిన వారు కాకపోవడంతో వారికి సహకారం అందించిన వారెవరనే కోణంలో లోతుగా దర్యాప్తు చేస్తోంది. ముఖ్యంగా వాట్సప్‌లోని ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ద్వారా పెద్ద ఎత్తున సమాచారం మార్పిడి జరిగినట్లు కూడా అధికారులు అనుమానిస్తున్నారు. పూర్తిగా కోడింగ్ విధానం ద్వారా గత కొంత కాలంగా సిరియాలోని ఐఎస్ కీలక నేత షఫీ ఆర్మర్ తరచూ చాటింగ్ చేసినట్లు సమాచారం. ఈ చాటింగ్ సమాచారాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకున్న ఎన్ఐఏ అధికారులు వాటిని ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులతో కలసి అధ్యయనం చేస్తున్నారు. -
అజ్మీర్ నుంచి ‘ఉగ్ర’ నిధులు!
- నాలుగో రోజు ఎన్ఐఏ దర్యాప్తులో కీలక అంశాలు - ఒక్కో ఉగ్రవాదికి ఒక్కో బాధ్యత అప్పగించిన ఐసిస్ ముఖ్య నేత షఫీ ఆర్మర్ సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మారణహోమం సృష్టించడానికి ఐసిస్ ఉగ్రవాదులు చేసిన కుట్ర గుట్టును జాతీయ దర్యాప్తు బృందం (ఎన్ఐఏ) విప్పుతోంది. పేలుళ్లకు సంబంధించి ఐసిస్ అనుబంధ సంస్థ ‘అన్సార్ ఉల్ తవ్హిద్ ఫి బిలాద్ అల్ హింద్ (ఏయూటీ)’ పక్కా వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు గుర్తించింది. హైదరాబాద్‌లో అరెస్టయిన ఐదుగురు ఉగ్ర సానుభూతిపరులను అధికారులు సోమవారం కూడా విచారించారు. వీరిలో కీలకమైన మహ్మద్ ఇబ్రహీం యజ్దానీని ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లిన అధికారులు.. సోమవారం హబీబ్ మహ్మద్‌ను కూడా తీసుకెళ్లి దర్యాప్తు చేశారు. వారికి రాజస్థాన్‌లోని అజ్మీర్ నుంచి హవాలా ద్వారా నిధులు అందినట్లు గుర్తించారు. అక్కడ వీరికి సహకరించినవారిపై ఆరా తీస్తున్నారు. మిగతా ముగ్గురిని హైదరాబాద్‌లో విచారిస్తున్నారు. రాష్ట్రానికి చెందిన కౌంటర్ ఇంటలిజె న్స్ అధికారులు ఈ విచారణలో పాల్గొన్నారు. పేలుళ్ల కుట్రకు సంబంధించి ఉగ్రమూకలు వెల్లడించిన అంశాలను రికార్డు చేస్తున్నారు. ఎవరి పని వారిదే.. ఐసిస్ ముఖ్య నేత, భారత్ విభాగానికి ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న షఫీ ఆర్మర్ పేలుళ్లకు సంబంధించి ఒక్కొక్కరికి ఒక్కో బాధ్యత అప్పగించాడు. పేలుళ్ల కోసం ఆయుధాల సేకరణ, బాంబుల తయారీ కోసం రసాయన పదార్థాల కొనుగోలు, టార్గెట్ చేసిన ప్రాంతాల్లో రెక్కీ, ఖర్చుల కోసం నిధుల సమీకరణ పనులుగా విభజించి అప్పజెప్పాడు. సిరియా నుంచి వీడియో కాలింగ్ ద్వారా మాట్లాడుతూ లక్ష్యాలపై మార్గనిర్దేశం చేశాడు. షఫీ ఆర్మర్ భారత్‌కు చెందిన వాడు కావడంతో హైదరాబాద్‌లో టార్గెట్ ప్రాంతాలను అతనే స్వయంగా నిర్దేశించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. గూగుల్ మ్యాప్ ఆధారంగా ప్రదేశాలను ఎంచుకుని వాటిపై పరిశీలన బాధ్యతను ఒకరికి అప్పగించాడు. ఆ ఉగ్రవాది 15 ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించి, పూర్తి సమాచారం అందించగా... అందులో మూడు ప్రాంతాలను ‘టార్గెట్’గా ఎంపిక చేశాడు. తర్వాత ఆ ప్రదేశాలపై మరోసారి క్షుణ్ణంగా రెక్కీ చేసినట్లు అధికారుల విచారణ వెల్లడైంది. ఈ మేరకు ఉగ్రవాదులు రెక్కీ నిర్వహించిన ప్రాంతాల్లోని సీసీ కెమెరాల పుటేజీలను తీసుకున్న ఎన్ఐఏ అధికారులు.. వాటిని ఢిల్లీలోని ప్రధాన కార్యాలయానికి పంపారు. ఇక బాంబులకు వినియోగించే రసాయన పదార్థాలు, ఆయుధాల కొనుగోలు కూడా షఫీ సూచించిన ప్రాంతాల్లోనే జరిగినట్లు సమాచారం. నిధుల వేటపై ప్రత్యేకంగా దృష్టి బాంబుల తయారీ కోసం, ఉగ్ర సానుభూతి పరుల ఖర్చుల కోసం సమీకరించిన నిధులపై ఎన్ఐఏ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఐదుగురు ఉగ్రవాదులకు దాదాపు ఆరు నెలలుగా నిధులు సమకూరుతున్నట్లు అధికారులు భావిస్తున్నారు. వారు డబ్బు సమీకరణ కోసం ఉపయోగించిన మార్గాలపై ఆరా తీస్తున్నారు. ఇందుకోసం ఇబ్రహీం యజ్దానీని, హబీబ్ మహ్మద్‌ను మహారాష్ట్రలోని నాందేడ్‌కు, రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు తీసుకెళ్లి దర్యాప్తు చేశారు. అజ్మీర్ నుంచి హవాలా ద్వారా వారికి నిధులు అందినట్లు గుర్తించారు. అక్కడ వీరికి ఎవరు సహకరించారనే దానిపై కూపీ లాగుతున్నారు. -
ఆర్మర్ ‘చావు’ తెలివి!
సిరియా కేంద్రంగా ‘కథ’ నడుపుతున్న షఫీ పలుమార్లు చనిపోయినట్లు వదంతులు సృష్టి నిఘా వర్గాల దృష్టి మళ్లించేందుకే: అధికారులు సిటీబ్యూరో: అగ్రరాజ్యంగా భావించే అమెరికాను సైతం గడగడలాడిస్తున్న అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్)కు అనుబంధంగా ఏర్పాటైందే అన్సార్ ఉల్ తవ్హిద్ ఫి బిలాద్ అల్ హింద్ (ఏయూటీ). దీనికి నేతృత్వం వహిస్తున్న షఫీ ఆర్మర్ ఇప్పటికే పలుమార్లు ‘చావు’ తెలివి వినియోగించాడు. బుధవారం పాతబస్తీలో చిక్కిన 11 మంది ఈ మాడ్యుల్‌కు చెందిన, ఆర్మర్ ఆదేశాల మేరకు పని చేస్తున్న వారే. సిరియా కేంద్రంగా వ్యవహారాలు నడిపిస్తున్న షఫీ ఆర్మర్ అక్కడ అమెరికా జరిపిన డ్రోన్ దాడుల్లో తాను చనిపోయినట్లు వదంతులు వ్యాపించజేశాడు. నిఘా వర్గాల దృష్టి మళ్లించడానికే ఈ పంథా అనుసరించినట్లు అధికారులు చెప్తున్నారు. కర్ణాకటలోని ఉత్తర కన్నడ జిల్లా భత్కల్ ప్రాంతానికి చెందిన మహ్మద్ షఫీ ఆర్మర్ భారత్‌లో ఐఎస్ కార్యకలాపాలకు ఇన్చార్జ్గా ఉన్నాడు. కొన్నేళ్ల క్రితం తన అన్న సుల్తాన్ ఆర్మర్‌తో కలిసి దేశం దాటేశాడు. ఐఎస్‌కు అనుబంధంగా ‘అన్సార్ ఉల్ తౌహిద్’ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేశాడు. సిరియాలో అమెరికా సేనలు చేసిన దాడుల్లో సుల్తాన్ చనిపోగా... షఫీ మాత్రం భారత్ టార్గెట్‌గా ఐఎస్‌ను విస్తరించే పనిలో పడ్డాడు. దీనికోసమే స్థానికంగా ఉన్న వారిని ఆకర్షిస్తూ విధ్వంసాలు సృష్టించడానికి జనవరిలో ‘జునూద్ అల్ ఖలీఫా ఏ హింద్’ సంస్థను ఏర్పాటు చేయించాడు. తాజాగా ఏయూటీ ఆధ్వర్యంలోనే 11 మందితో మాడ్యుల్ తయారు చేశాడు. ఐఎస్ నుంచి వచ్చిన నిధులతో పాటు వివిధ మార్గాల్లో నగదు సమీకరిస్తూ భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించడం కోసం హవాలా తదితర మార్గాల్లో ఇక్కడ ఎంపిక చేసుకున్న వాళ్లకు పంపిస్తున్నాడు. వివిధ రకాలైన పేర్లతో ఇంటర్నెట్ కేంద్రంగా యువతను ఆకర్షిస్తున్న షఫీ వయసు ప్రస్తుతం 29 ఏళ్లే అని నిఘా వర్గాలు చెప్తున్నాయి. కొంతకాలం ఆఫ్ఘనిస్థాన్ కేంద్రంగా అల్ కాయిదాతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్న షఫీ... 2014 జూన్ నుంచి సిరియాలో మకాం పెట్టి కార్యకలాపాలను సాగిస్తున్నాడని స్పష్టం చేస్తున్నాయి. ‘జునూద్’ మాడ్యుల్ అరెస్టు తర్వాత భారత నిఘా వర్గాలు ఆర్మర్పై సాంకేతిక నిఘా పెట్టాయి. దీన్ని తప్పించుకోవడంతో పాటు వారి దృష్టి మళ్లించడానికీ తాను చనిపోయినట్లు సామాజిక మాధ్యమాల ద్వారా రెండుమూడు సార్లు ప్రచారం చేశాడు. ప్రతి సందర్భంలోనూ సిరియాలో అమెరికా జరిపిన డ్రోన్ దాడుల్లోనే తన మరణం సంభవించినట్లు ప్రచారం చేసుకున్నాడు. ఈ వల్లోపడని నిఘా వర్గాలు తమ పని కొనసాగించడంతో తాజాగా ఏయూటీకి చెందిన 11 మంది హైదరాబాదీలు చిక్కారు. పేర్లు మార్చి... ఏమార్చి... భారత్‌ను టార్గెట్‌గా చేసుకుని సుదీర్ఘకాలంగా కార్యకలాపాలు సాగిస్తున్న షఫీ ఆర్మర్... ఏ సందర్భంలోనూ తన ‘నిజ స్వరూపాన్ని’ బయటపెట్ట లేదు. ఒక్కో మాడ్యుల్‌ను సంప్రదించేప్పుడు ఒక్కో పేరు వాడినట్లు అధికారులు చెప్తున్నారు. ⇒దేశ వ్యాప్తంగా జరిగిన విధ్వంసాలకు సంబంధించి ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్‌పై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో షఫీ ఆర్మర్ పేరు ఉంది. ఇతడిపై ఇం టర్పోల్ రెడ్‌కార్నర్ నోటీసు సైతం జారీ చేసింది. ⇒2013లో రాజస్థాన్‌కు చెందిన వ్యక్తుల్ని ఐఎస్ వైపు నడిపించడానికి మహ్మద్ అట్టా పేరుతో సంప్రదింపులు జరిపాడు. ⇒2014లో హైదరాబాద్‌కు చెందిన బాసిత్, మాజ్ హుస్సేన్‌లతో పాటు మరో ఇద్దరినీ ఐఎస్ వైపు ఆకర్షించడానికి సమీర్ ఖాన్‌గా మారాడు. ⇒2015లో మధ్యప్రదేశ్‌లోని రత్లంలో ఏర్పాటు చేసుకున్న మాడ్యుల్‌కు యూసుఫ్‌గా పరిచయమయ్యాడు. ⇒ఈ ఏడాది చిక్కిన ‘జునూద్’ మాడ్యుల్లోని సభ్యులతో యూసుఫ్ అల్ హింద్‌గా కథ నడిపాడు. ⇒తాజాగా హైదరాబాద్‌లో పట్టుబడిన 11 మందిని ఏ పేరుతో సంప్రదించాడనే అంశంపై ఎన్ఐఏ అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు.