అజ్మీర్ నుంచి ‘ఉగ్ర’ నిధులు! | Funds to the terrorits from the Ajmir | Sakshi
Sakshi News home page

అజ్మీర్ నుంచి ‘ఉగ్ర’ నిధులు!

Published Tue, Jul 5 2016 3:10 AM | Last Updated on Mon, Sep 4 2017 4:07 AM

అజ్మీర్ నుంచి ‘ఉగ్ర’ నిధులు!

అజ్మీర్ నుంచి ‘ఉగ్ర’ నిధులు!

- నాలుగో రోజు ఎన్‌ఐఏ దర్యాప్తులో కీలక అంశాలు
- ఒక్కో ఉగ్రవాదికి ఒక్కో బాధ్యత అప్పగించిన ఐసిస్ ముఖ్య నేత షఫీ ఆర్మర్
 
 సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మారణహోమం సృష్టించడానికి ఐసిస్ ఉగ్రవాదులు చేసిన కుట్ర గుట్టును జాతీయ దర్యాప్తు బృందం (ఎన్‌ఐఏ) విప్పుతోంది. పేలుళ్లకు సంబంధించి ఐసిస్ అనుబంధ సంస్థ ‘అన్సార్ ఉల్ తవ్హిద్ ఫి బిలాద్ అల్ హింద్ (ఏయూటీ)’ పక్కా వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు గుర్తించింది. హైదరాబాద్‌లో అరెస్టయిన ఐదుగురు ఉగ్ర సానుభూతిపరులను అధికారులు సోమవారం కూడా విచారించారు. వీరిలో కీలకమైన మహ్మద్ ఇబ్రహీం యజ్దానీని ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లిన అధికారులు.. సోమవారం హబీబ్ మహ్మద్‌ను కూడా తీసుకెళ్లి దర్యాప్తు చేశారు. వారికి రాజస్థాన్‌లోని అజ్మీర్ నుంచి హవాలా ద్వారా నిధులు అందినట్లు గుర్తించారు. అక్కడ వీరికి సహకరించినవారిపై ఆరా తీస్తున్నారు. మిగతా ముగ్గురిని హైదరాబాద్‌లో విచారిస్తున్నారు. రాష్ట్రానికి చెందిన కౌంటర్ ఇంటలిజె న్స్ అధికారులు ఈ విచారణలో పాల్గొన్నారు. పేలుళ్ల కుట్రకు సంబంధించి ఉగ్రమూకలు వెల్లడించిన అంశాలను రికార్డు చేస్తున్నారు.

 ఎవరి పని వారిదే..
 ఐసిస్ ముఖ్య నేత, భారత్ విభాగానికి ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న షఫీ ఆర్మర్ పేలుళ్లకు సంబంధించి ఒక్కొక్కరికి ఒక్కో బాధ్యత అప్పగించాడు. పేలుళ్ల కోసం ఆయుధాల సేకరణ, బాంబుల తయారీ కోసం రసాయన పదార్థాల కొనుగోలు, టార్గెట్ చేసిన ప్రాంతాల్లో రెక్కీ, ఖర్చుల కోసం నిధుల సమీకరణ పనులుగా విభజించి అప్పజెప్పాడు. సిరియా నుంచి వీడియో కాలింగ్ ద్వారా మాట్లాడుతూ లక్ష్యాలపై మార్గనిర్దేశం చేశాడు. షఫీ ఆర్మర్ భారత్‌కు చెందిన వాడు కావడంతో హైదరాబాద్‌లో టార్గెట్ ప్రాంతాలను అతనే స్వయంగా నిర్దేశించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. గూగుల్ మ్యాప్ ఆధారంగా ప్రదేశాలను ఎంచుకుని వాటిపై పరిశీలన బాధ్యతను ఒకరికి అప్పగించాడు. ఆ ఉగ్రవాది 15 ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించి, పూర్తి సమాచారం అందించగా... అందులో మూడు ప్రాంతాలను ‘టార్గెట్’గా ఎంపిక చేశాడు. తర్వాత ఆ ప్రదేశాలపై మరోసారి క్షుణ్ణంగా రెక్కీ చేసినట్లు అధికారుల విచారణ వెల్లడైంది. ఈ మేరకు ఉగ్రవాదులు రెక్కీ నిర్వహించిన ప్రాంతాల్లోని సీసీ కెమెరాల పుటేజీలను తీసుకున్న ఎన్‌ఐఏ అధికారులు.. వాటిని ఢిల్లీలోని ప్రధాన కార్యాలయానికి పంపారు. ఇక బాంబులకు వినియోగించే రసాయన పదార్థాలు, ఆయుధాల కొనుగోలు కూడా షఫీ సూచించిన ప్రాంతాల్లోనే జరిగినట్లు సమాచారం.
 
 నిధుల వేటపై ప్రత్యేకంగా దృష్టి
 బాంబుల తయారీ కోసం, ఉగ్ర సానుభూతి పరుల ఖర్చుల కోసం సమీకరించిన నిధులపై ఎన్‌ఐఏ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఐదుగురు ఉగ్రవాదులకు దాదాపు ఆరు నెలలుగా నిధులు సమకూరుతున్నట్లు అధికారులు భావిస్తున్నారు. వారు డబ్బు సమీకరణ కోసం ఉపయోగించిన మార్గాలపై ఆరా తీస్తున్నారు. ఇందుకోసం ఇబ్రహీం యజ్దానీని, హబీబ్ మహ్మద్‌ను మహారాష్ట్రలోని నాందేడ్‌కు, రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు తీసుకెళ్లి దర్యాప్తు చేశారు. అజ్మీర్ నుంచి హవాలా ద్వారా వారికి నిధులు అందినట్లు గుర్తించారు. అక్కడ వీరికి ఎవరు సహకరించారనే దానిపై కూపీ లాగుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement