National Investigation Team
-
ఏజెన్సీలో కలకలం
మణుగూరు:ఏజెన్సీ ప్రాంతంలో అమాయక ప్రజలను ఆసరాగా చేసుకొని కొందరు వ్యక్తులు సేవ పేరుతో మత మార్పిడులకు పాల్పడుతున్న సంఘటన ఆలస్యంగా వెలుగు చూడటంతో మణుగూరు ఏజెన్సీలో ఒక్కసారిగా కలకలం రేగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం రామానుజవరం గ్రామంలో ప్రత్యేక కేంద్రంగా ఇస్లాం మత మార్పిడులు జరుగుతున్న విషయాన్ని నేషనల్ ఇన్విస్టిగేషన్ అధికారులు గుర్తించి.. హైదరాబాద్ పోలీసుల ద్వారా ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేయడంతో మతమార్పిడిల బాగోతం బయటపడింది. రామానుజవరం గ్రామం కేంద్రంగా అనాథ పిల్లలు, పేద కుటుంబాలకు డబ్బు ఆశ చూపి మత మార్పిడులకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అనాథాశ్రమం పేరుతో... అనాథ పిల్లలకు సకల సౌకర్యాల ఏర్పాటుతోపాటు ఉన్నత విద్యను అందిస్తామనే ప్రచారంతో హైదరాబాద్ ముఖ్య కేంద్రంగా మణుగూరు మండలం రామానుజవరం, విజయనగరం గ్రామాలతోపాటు వరంగల్, ఖమ్మం నగరాలను అనుకూల ప్రాంతాలుగా ఎంపిక చేసుకొని మత మార్పిడుల బృందం కార్యకలాపాలు కొనసాగించింది. ఏపీలోని రాజమండ్రికి చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి కొన్నేళ్ల కిత్రం ఇస్లాం మతం స్వీకరించి వరంగల్, హైదరాబాద్‌లలో తనకంటూ ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాగా.. హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్, ఎర్రగుంటలో పీస్ ఆర్గనైజేషన్ పేరుతో ప్రత్యేకంగా కార్యాలయం నడుపుతున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని కేంద్రాలు ఏర్పాటు చేసి, హిందువులను ఇస్లాం మతం స్వీకరించేలా ప్రచారం చేయడం ముఖ్య ఉద్దేశం. అన్ని ప్రాంతాల్లో ఉండే అనాథ పిల్లలను, పేదరికం అనుభవిస్తున్న పిల్లలను దగ్గరకు తీసి చదువు పేరుతో హైదరాబాద్ ముఖ్య కేంద్రానికి తరలించడమే కార్యాచరణగా పీస్ ఆర్గనైజేషన్ కార్యాలయాన్ని నడుపుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు, చైల్డ్ వెల్ఫేర్ అధికారులు మల్కాజ్గిరి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటపడింది. 17 మంది పిల్లల గుర్తింపు... మల్కాజ్గిరి పోలీసులు ప్రత్యేక నిఘాతో విచారణ చేపట్టడంతో పీస్ ఆర్గనైజేషన్ కార్యాలయంలో 17 మంది అనాథ పిల్లలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మత మార్పిడులకు పాల్పడుతున్న సత్యనారాయణ అలియాస్ సిద్దిఖీని ముందుగా అదుపులోకి తీసుకొని విచారణ జరిపారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కేంద్రాలు, పీస్ ఆర్గనైజేషన్‌లో పని చేస్తున్న సభ్యుల పేర్లు బయటకు రావడంతో మణుగూరు మండలంలో గల మత మార్పిడుల కేంద్రం వార్తల్లోకి వచ్చింది. మండలంలోని రామానుజవరం గ్రామానికి చెందిన బత్తిని సోమేశ్వరరావు అలియాస్ అబ్దుల్లాతోపాటు ఇదే మండలం విజయనగరం గ్రామానికి చెందిన సాగర్‌ను మల్కాజ్గిరి పోలీసులు అరెస్ట్ చేశారు. పీస్ ఆర్గనైజేషన్ కార్యాలయంతో 10 మందికి సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించగా, అందులో 9 మందిని అరెస్ట్ చేశారు. రామానుజవరం గ్రామానికి చెందిన ఒక పాప, ఒక బాబును సోమేశ్వరరావు ఉచిత విద్య పేరుతో హైదరాబాద్ కేంద్రానికి తరలించినట్లు సమాచారం. గ్రామాల్లో చెరగని నమ్మకం... కాగా.. మత మార్పిడుల విషయం బహిర్గతం కావడంతో పాటు కీలకంగా పని చేస్తున్న బత్తిని సోమే శ్వరరావు, సాగర్లను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించినా.. ఆయా గ్రామాలకు చెందిన కొన్ని కుటుంబాలు మాత్రం ఇప్పటికీ వారు అదే మతంపై పూర్తి నమ్మకంతో ఉన్న ట్లు సమాచారం. సుమారు 35 కుటుంబాలు రహస్యంగా ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నట్లు తెలు స్తోంది. ఈ మత మార్పిడుల విషయంపై ఎన్ఐఏ(నేషనల్ ఇన్విస్టిగేషన్ అధికారులు) రాష్ట్రవ్యాప్తంగా గల పీస్ ఆర్గనైజేషన్ కార్యాలయాలు, వాటి పనులు, నిధుల సేకరణ, నిర్వహణ తీరుపై క్షుణ్ణంగా వివరాలు సేకరించినట్లు సమాచారం. ఇస్లాం మత మార్పిడి, పిల్లలకు ఉచిత విద్య పేరుతో ఉర్దూ, అరబిక్ భాషలు నేర్పడంతోపాటు ఇస్లాం మత సిద్ధాంతాలను నూరిపోయడంపై కూడా ఎన్ఐఏ అధికారులు ప్రత్యేకంగా దర్యాప్తు జరుపుతున్నారు. -
అజ్మీర్ నుంచి ‘ఉగ్ర’ నిధులు!
- నాలుగో రోజు ఎన్ఐఏ దర్యాప్తులో కీలక అంశాలు - ఒక్కో ఉగ్రవాదికి ఒక్కో బాధ్యత అప్పగించిన ఐసిస్ ముఖ్య నేత షఫీ ఆర్మర్ సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మారణహోమం సృష్టించడానికి ఐసిస్ ఉగ్రవాదులు చేసిన కుట్ర గుట్టును జాతీయ దర్యాప్తు బృందం (ఎన్ఐఏ) విప్పుతోంది. పేలుళ్లకు సంబంధించి ఐసిస్ అనుబంధ సంస్థ ‘అన్సార్ ఉల్ తవ్హిద్ ఫి బిలాద్ అల్ హింద్ (ఏయూటీ)’ పక్కా వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు గుర్తించింది. హైదరాబాద్‌లో అరెస్టయిన ఐదుగురు ఉగ్ర సానుభూతిపరులను అధికారులు సోమవారం కూడా విచారించారు. వీరిలో కీలకమైన మహ్మద్ ఇబ్రహీం యజ్దానీని ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లిన అధికారులు.. సోమవారం హబీబ్ మహ్మద్‌ను కూడా తీసుకెళ్లి దర్యాప్తు చేశారు. వారికి రాజస్థాన్‌లోని అజ్మీర్ నుంచి హవాలా ద్వారా నిధులు అందినట్లు గుర్తించారు. అక్కడ వీరికి సహకరించినవారిపై ఆరా తీస్తున్నారు. మిగతా ముగ్గురిని హైదరాబాద్‌లో విచారిస్తున్నారు. రాష్ట్రానికి చెందిన కౌంటర్ ఇంటలిజె న్స్ అధికారులు ఈ విచారణలో పాల్గొన్నారు. పేలుళ్ల కుట్రకు సంబంధించి ఉగ్రమూకలు వెల్లడించిన అంశాలను రికార్డు చేస్తున్నారు. ఎవరి పని వారిదే.. ఐసిస్ ముఖ్య నేత, భారత్ విభాగానికి ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న షఫీ ఆర్మర్ పేలుళ్లకు సంబంధించి ఒక్కొక్కరికి ఒక్కో బాధ్యత అప్పగించాడు. పేలుళ్ల కోసం ఆయుధాల సేకరణ, బాంబుల తయారీ కోసం రసాయన పదార్థాల కొనుగోలు, టార్గెట్ చేసిన ప్రాంతాల్లో రెక్కీ, ఖర్చుల కోసం నిధుల సమీకరణ పనులుగా విభజించి అప్పజెప్పాడు. సిరియా నుంచి వీడియో కాలింగ్ ద్వారా మాట్లాడుతూ లక్ష్యాలపై మార్గనిర్దేశం చేశాడు. షఫీ ఆర్మర్ భారత్‌కు చెందిన వాడు కావడంతో హైదరాబాద్‌లో టార్గెట్ ప్రాంతాలను అతనే స్వయంగా నిర్దేశించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. గూగుల్ మ్యాప్ ఆధారంగా ప్రదేశాలను ఎంచుకుని వాటిపై పరిశీలన బాధ్యతను ఒకరికి అప్పగించాడు. ఆ ఉగ్రవాది 15 ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించి, పూర్తి సమాచారం అందించగా... అందులో మూడు ప్రాంతాలను ‘టార్గెట్’గా ఎంపిక చేశాడు. తర్వాత ఆ ప్రదేశాలపై మరోసారి క్షుణ్ణంగా రెక్కీ చేసినట్లు అధికారుల విచారణ వెల్లడైంది. ఈ మేరకు ఉగ్రవాదులు రెక్కీ నిర్వహించిన ప్రాంతాల్లోని సీసీ కెమెరాల పుటేజీలను తీసుకున్న ఎన్ఐఏ అధికారులు.. వాటిని ఢిల్లీలోని ప్రధాన కార్యాలయానికి పంపారు. ఇక బాంబులకు వినియోగించే రసాయన పదార్థాలు, ఆయుధాల కొనుగోలు కూడా షఫీ సూచించిన ప్రాంతాల్లోనే జరిగినట్లు సమాచారం. నిధుల వేటపై ప్రత్యేకంగా దృష్టి బాంబుల తయారీ కోసం, ఉగ్ర సానుభూతి పరుల ఖర్చుల కోసం సమీకరించిన నిధులపై ఎన్ఐఏ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఐదుగురు ఉగ్రవాదులకు దాదాపు ఆరు నెలలుగా నిధులు సమకూరుతున్నట్లు అధికారులు భావిస్తున్నారు. వారు డబ్బు సమీకరణ కోసం ఉపయోగించిన మార్గాలపై ఆరా తీస్తున్నారు. ఇందుకోసం ఇబ్రహీం యజ్దానీని, హబీబ్ మహ్మద్‌ను మహారాష్ట్రలోని నాందేడ్‌కు, రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు తీసుకెళ్లి దర్యాప్తు చేశారు. అజ్మీర్ నుంచి హవాలా ద్వారా వారికి నిధులు అందినట్లు గుర్తించారు. అక్కడ వీరికి ఎవరు సహకరించారనే దానిపై కూపీ లాగుతున్నారు. -
విదేశీయులే లక్ష్యం..!
- ఒకే దెబ్బకు రెండు ప్రయోజనాలు కలిగేలా ఐసిస్ వ్యూహం - ఎన్ఐఏ విచారణలో వెల్లడి... మహారాష్ట్రకు ఇబ్రహీం సాక్షి, హైదరాబాద్ : విదేశీయులనే టార్గెట్‌గా చేసుకుని ఉగ్రమూకలు బాంబు పేలుళ్లకు కుట్ర రచించినట్లు జాతీయ దర్యాప్తు బృందం (ఎన్ఐఏ) విచారణలో తేలింది. అందుకే విదేశీయులు ఎక్కువగా సంచరించే ప్రాంతాలపై దృష్టి పెట్టాలని ఉగ్రవాదులు నిర్ణయించినట్లు వెల్లడైంది. దీనివల్ల ఒకే దెబ్బతో రెండు ప్రయోజనాలు నెరవేరుతాయని ఐసిస్ కీలక నేత షఫీ ఆర్మర్ నూరిపోసినట్లు సమాచారం. అందుకనుగుణంగానే హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఐదుగురు ఉగ్ర సానుభూతిపరులు ప్రణాళిక రూపొందించినట్లు తెలిసింది. హైదరాబాద్‌లో పెద్దఎత్తున పేలుళ్లకు పథకం వేసిన ఐదుగురు ఉగ్ర అనుమానితులను ఆదివారం కూడా ఎన్ఐఏ అధికారులు విచారించారు. కాగా, వీరిలో అతికీలకమైన ఇబ్రహీం యజ్దానీని ఎన్ఐఏ అధికారులు మహారాష్ట్ర తీసుకెళ్లారు. మిగతా నలుగురిని ఇక్కడే ఉంచి పలు కోణాల్లో ప్రశ్నించారు. విదేశీయులు లక్ష్యంగానే ఐటీ కారిడార్, ప్రముఖ షాపింగ్ మాల్స్, హోటళ్లు, విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకున్నట్టు విచారణలో తెలిసింది. ఈ క్రమంలోనే ఉగ్రవాదులు ఐటీ కారిడార్‌లోని పలు ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించారు. ఎయిర్‌పోర్టుకు వెళ్లే మార్గాలపైనా ప్రత్యేక అధ్యయనం చేశారు. అలా చేస్తేనే విస్తృత ప్రచారం... విదేశీయులు లక్ష్యంగా పేలుళ్లకు పాల్పడితే అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం జరుగుతుందనేది ఐసిస్ ఉద్దేశం. దీని ద్వారా పాశ్చాత్య దేశాలను భయభ్రాంతులకు గురిచేయవచ్చని ఉగ్రమూకలకు ఐసిస్ ప్రతినిధులు సూచించారు. అలాగే దేశంలో శాంతిభద్రతల అంశం అంతర్జాతీయ వేదికలెక్కేలా కుట్ర చేశారు. తద్వారా ఆయా దేశాలతో భారత సంబంధాలను దెబ్బతీయవచ్చని వారి ఆలోచన. అందుకోసం గత కొంత కాలంగా ఐసిస్ జరుపుతున్న దాడులను ప్రస్తావించినట్లు తెలిసింది. తాజాగా బ్రెజిల్ రాజధాని బ్రస్సెల్స్‌లో జరిగిన ఘటనను పేర్కొంది. ఉగ్రమూకలకు ఉత్సాహం నింపేందుకు స్వయంగా షఫీ ఆర్మర్ తరచుగా వీడియో కాలింగ్ ద్వారా మాట్లాడుతున్నట్లు ఎన్ఐఏ విచారణలో వెలుగు చూసింది. సీసీ టీవీ ఫుటేజీల పరిశీలన... హైదరాబాద్‌లో పేలుళ్లలకు సంబంధించి కీలకంగా వ్యవహరించిన మహ్మద్ ఇబ్రహీం యజ్దానీని ఎన్ఐఏ అధికారులు మహారాష్ట్రకు తీసుకెళ్లారు. నాందేడ్‌లో ఆయుధాల కొనుగోలుతో పాటు రెండు పర్యాయాలు ఇబ్రహీం పర్యటించాడు. వీరికి మహారాష్ట్ర కేంద్రంగా సహాయ సహకారాలు లభించినట్లు ఎన్ఐఏ అనుమానం వ్యక్తం చేస్తోంది. అందుకోసం అక్కడ ఇబ్రహీం ఎవరెవరిని కలిశాడనే కోణంలో ఆరా తీయడం కోసం స్థానిక సీసీ టీవీ కెమెరాను పరిశీలించాలని నిర్ణయించింది. అలాగే రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో కూడా ఇబ్రహీం పర్యటించడం, అక్కడి నుంచి వీరికి రసాయనాలు అందడంతో దీనిపైనా ఎన్ఐఏ దృష్టి సారించింది. -
ఎన్ఐఏ అదుపులో అనుమానితులు
సాక్షి,బెంగళూరు: బెంగళూరులోని తిలక్‌నగర్‌లో తలదాచుకున్న ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను జాతీయ దర్యాప్తు బృందం(ఎన్ఐఏ) అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. తమిళనాడులో ఇటీవల అరెస్టయిన ఇద్దరు ఉగ్రవాదులు వెల్లడించిన సమాచారం మేరకు వీరిని అరెస్టు చేసినట్లు సమాచారం. వివిధ రాష్ట్రాల పోలీసుల సమన్వయంతో ఎన్ఐఏ బెంగళూరుతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గతంలో ఆకస్మిక దాడులు నిర్వహించి ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉన్న 10 మందిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దీనికి ప్రతీకారంగా ఈనెల 15 నుంచి 17వ తేదీ మధ్య కర్ణాటకలో స్లీపింగ్ సెల్స్‌గా ఉన్న ఉగ్రవాదులు రాష్ట్రంలోని పలుచోట్ల దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని ఎన్ఐఏకు సమాచారం అందింది. ఈనేపథ్యంలో బెంగళూరులో శుక్రవారం అర్ధరాత్రి తర్వాత సోదాలు నిర్వహించి ఇద్దరు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ విషయాన్ని రాష్ట్ర హోం శాఖ ధ్రువీకరించాల్సి ఉంది. -
బెంగళూరులో అనుమానిత ఉగ్రవాది అరెస్టు
న్యూఢిల్లీ: పఠాన్‌కోట్ దాడితో అప్రమత్తమైన భారత దర్యాప్తు సంస్థ దేశ వ్యాప్తంగా తన నిఘాను విస్తృతపరిచింది. అందులో భాగంగా బెంగళూరులో గురువారం రాత్రి తర్వాత అల్ కాయిదాకు చెందినట్లు భావిస్తున్న ఓ అనుమానిత ఉగ్రవాదిని అదుపులోకి తీసుకుంది. స్థానికంగా బాన్ శంకరీ వద్ద ఓ మదర్సాలో విధులు నిర్వర్తిస్తున్న అంజర్ షా అనే వ్యక్తిని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గత నాలుగు సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తున్న అంజర్ గత నెలలోనే మక్కా యాత్రకు వెళ్లొచ్చాడు. ఈ బుధవారమే అసిఫ్ అనే వ్యక్తిని అతడు కలిసేందుకు వెళ్లి తిరిగిరాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, అతడి విషయంపై పోలీసులు ఆరా తీయగా ఉగ్రవాదులతో సంబంధాలు నెరిపాడనే ఆరోపణలతో ఎన్ఐఏ అధికారులు అతడిని అరెస్టు చేసినట్లు తెలిసింది. దీంతో వారు ఆ విషయాన్ని వారు కటుంబ సభ్యులకు తెలియజేశారు. ఇప్పటి వరకు ఎన్ఐఏ అధికారులు మొత్తం నలుగురు అల్ కాయిదా ఉగ్రవాదులను అరెస్టుచేశారు.