విదేశీయులే లక్ష్యం..! | Target is foreigners | Sakshi
Sakshi News home page

విదేశీయులే లక్ష్యం..!

Published Mon, Jul 4 2016 12:05 AM | Last Updated on Thu, Oct 4 2018 7:01 PM

విదేశీయులే లక్ష్యం..! - Sakshi

విదేశీయులే లక్ష్యం..!

- ఒకే దెబ్బకు రెండు ప్రయోజనాలు కలిగేలా ఐసిస్ వ్యూహం
- ఎన్‌ఐఏ విచారణలో వెల్లడి... మహారాష్ట్రకు ఇబ్రహీం
 
 సాక్షి, హైదరాబాద్ : విదేశీయులనే టార్గెట్‌గా చేసుకుని ఉగ్రమూకలు బాంబు పేలుళ్లకు కుట్ర రచించినట్లు జాతీయ దర్యాప్తు బృందం (ఎన్‌ఐఏ) విచారణలో తేలింది. అందుకే విదేశీయులు ఎక్కువగా సంచరించే ప్రాంతాలపై దృష్టి పెట్టాలని ఉగ్రవాదులు నిర్ణయించినట్లు వెల్లడైంది. దీనివల్ల ఒకే దెబ్బతో రెండు ప్రయోజనాలు నెరవేరుతాయని ఐసిస్ కీలక నేత షఫీ ఆర్మర్ నూరిపోసినట్లు సమాచారం. అందుకనుగుణంగానే హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఐదుగురు ఉగ్ర సానుభూతిపరులు ప్రణాళిక రూపొందించినట్లు తెలిసింది. హైదరాబాద్‌లో పెద్దఎత్తున పేలుళ్లకు పథకం వేసిన ఐదుగురు ఉగ్ర అనుమానితులను ఆదివారం కూడా ఎన్‌ఐఏ అధికారులు విచారించారు. కాగా, వీరిలో అతికీలకమైన ఇబ్రహీం యజ్దానీని ఎన్‌ఐఏ అధికారులు మహారాష్ట్ర తీసుకెళ్లారు. మిగతా నలుగురిని ఇక్కడే ఉంచి పలు కోణాల్లో ప్రశ్నించారు. విదేశీయులు లక్ష్యంగానే ఐటీ కారిడార్, ప్రముఖ షాపింగ్ మాల్స్, హోటళ్లు, విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకున్నట్టు విచారణలో తెలిసింది. ఈ క్రమంలోనే ఉగ్రవాదులు ఐటీ కారిడార్‌లోని పలు ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించారు. ఎయిర్‌పోర్టుకు వెళ్లే మార్గాలపైనా ప్రత్యేక అధ్యయనం చేశారు.

 అలా చేస్తేనే విస్తృత ప్రచారం...
 విదేశీయులు లక్ష్యంగా పేలుళ్లకు పాల్పడితే అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం జరుగుతుందనేది ఐసిస్ ఉద్దేశం. దీని ద్వారా పాశ్చాత్య దేశాలను భయభ్రాంతులకు గురిచేయవచ్చని ఉగ్రమూకలకు ఐసిస్ ప్రతినిధులు సూచించారు. అలాగే దేశంలో శాంతిభద్రతల అంశం అంతర్జాతీయ వేదికలెక్కేలా కుట్ర చేశారు. తద్వారా ఆయా దేశాలతో భారత సంబంధాలను దెబ్బతీయవచ్చని వారి ఆలోచన. అందుకోసం గత కొంత కాలంగా ఐసిస్ జరుపుతున్న దాడులను ప్రస్తావించినట్లు తెలిసింది. తాజాగా బ్రెజిల్ రాజధాని బ్రస్సెల్స్‌లో జరిగిన ఘటనను పేర్కొంది. ఉగ్రమూకలకు ఉత్సాహం నింపేందుకు స్వయంగా షఫీ ఆర్మర్ తరచుగా వీడియో కాలింగ్ ద్వారా మాట్లాడుతున్నట్లు ఎన్‌ఐఏ విచారణలో వెలుగు చూసింది.

 సీసీ టీవీ ఫుటేజీల పరిశీలన...
 హైదరాబాద్‌లో పేలుళ్లలకు సంబంధించి కీలకంగా వ్యవహరించిన మహ్మద్ ఇబ్రహీం యజ్దానీని ఎన్‌ఐఏ అధికారులు మహారాష్ట్రకు తీసుకెళ్లారు. నాందేడ్‌లో ఆయుధాల కొనుగోలుతో పాటు రెండు పర్యాయాలు ఇబ్రహీం పర్యటించాడు. వీరికి మహారాష్ట్ర కేంద్రంగా సహాయ సహకారాలు లభించినట్లు ఎన్‌ఐఏ అనుమానం వ్యక్తం చేస్తోంది. అందుకోసం అక్కడ ఇబ్రహీం ఎవరెవరిని కలిశాడనే కోణంలో ఆరా తీయడం కోసం స్థానిక సీసీ టీవీ కెమెరాను పరిశీలించాలని  నిర్ణయించింది. అలాగే రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో కూడా ఇబ్రహీం పర్యటించడం, అక్కడి నుంచి వీరికి రసాయనాలు అందడంతో దీనిపైనా ఎన్‌ఐఏ దృష్టి సారించింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement