బెంగళూరులో అనుమానిత ఉగ్రవాది అరెస్టు
న్యూఢిల్లీ: పఠాన్కోట్ దాడితో అప్రమత్తమైన భారత దర్యాప్తు సంస్థ దేశ వ్యాప్తంగా తన నిఘాను విస్తృతపరిచింది. అందులో భాగంగా బెంగళూరులో గురువారం రాత్రి తర్వాత అల్ కాయిదాకు చెందినట్లు భావిస్తున్న ఓ అనుమానిత ఉగ్రవాదిని అదుపులోకి తీసుకుంది. స్థానికంగా బాన్ శంకరీ వద్ద ఓ మదర్సాలో విధులు నిర్వర్తిస్తున్న అంజర్ షా అనే వ్యక్తిని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
గత నాలుగు సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తున్న అంజర్ గత నెలలోనే మక్కా యాత్రకు వెళ్లొచ్చాడు. ఈ బుధవారమే అసిఫ్ అనే వ్యక్తిని అతడు కలిసేందుకు వెళ్లి తిరిగిరాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, అతడి విషయంపై పోలీసులు ఆరా తీయగా ఉగ్రవాదులతో సంబంధాలు నెరిపాడనే ఆరోపణలతో ఎన్ఐఏ అధికారులు అతడిని అరెస్టు చేసినట్లు తెలిసింది. దీంతో వారు ఆ విషయాన్ని వారు కటుంబ సభ్యులకు తెలియజేశారు. ఇప్పటి వరకు ఎన్ఐఏ అధికారులు మొత్తం నలుగురు అల్ కాయిదా ఉగ్రవాదులను అరెస్టుచేశారు.