ఆర్మర్ ‘చావు’ తెలివి! | Syria is the center of the 'story' running Shafi | Sakshi
Sakshi News home page

ఆర్మర్ ‘చావు’ తెలివి!

Published Wed, Jun 29 2016 11:14 PM | Last Updated on Mon, Sep 4 2017 3:43 AM

Syria is the center of the 'story' running Shafi

సిరియా కేంద్రంగా   ‘కథ’ నడుపుతున్న షఫీ
పలుమార్లు చనిపోయినట్లు
వదంతులు సృష్టి
నిఘా వర్గాల దృష్టి
మళ్లించేందుకే: అధికారులు

 

సిటీబ్యూరో: అగ్రరాజ్యంగా భావించే అమెరికాను సైతం గడగడలాడిస్తున్న అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్)కు అనుబంధంగా ఏర్పాటైందే అన్సార్ ఉల్ తవ్హిద్ ఫి బిలాద్ అల్ హింద్ (ఏయూటీ). దీనికి నేతృత్వం వహిస్తున్న షఫీ ఆర్మర్ ఇప్పటికే పలుమార్లు ‘చావు’ తెలివి వినియోగించాడు. బుధవారం పాతబస్తీలో చిక్కిన 11 మంది ఈ మాడ్యుల్‌కు చెందిన, ఆర్మర్ ఆదేశాల మేరకు పని చేస్తున్న వారే. సిరియా కేంద్రంగా వ్యవహారాలు నడిపిస్తున్న షఫీ ఆర్మర్ అక్కడ అమెరికా జరిపిన డ్రోన్ దాడుల్లో తాను చనిపోయినట్లు వదంతులు వ్యాపించజేశాడు. నిఘా వర్గాల దృష్టి మళ్లించడానికే ఈ పంథా అనుసరించినట్లు అధికారులు చెప్తున్నారు. కర్ణాకటలోని ఉత్తర కన్నడ జిల్లా భత్కల్ ప్రాంతానికి చెందిన మహ్మద్ షఫీ ఆర్మర్ భారత్‌లో ఐఎస్ కార్యకలాపాలకు ఇన్‌చార్జ్‌గా ఉన్నాడు. కొన్నేళ్ల క్రితం తన అన్న సుల్తాన్ ఆర్మర్‌తో కలిసి దేశం దాటేశాడు. ఐఎస్‌కు అనుబంధంగా ‘అన్సార్ ఉల్ తౌహిద్’ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేశాడు. సిరియాలో అమెరికా సేనలు చేసిన దాడుల్లో సుల్తాన్ చనిపోగా... షఫీ మాత్రం భారత్ టార్గెట్‌గా ఐఎస్‌ను విస్తరించే పనిలో పడ్డాడు. దీనికోసమే స్థానికంగా ఉన్న వారిని ఆకర్షిస్తూ విధ్వంసాలు సృష్టించడానికి జనవరిలో ‘జునూద్ అల్ ఖలీఫా ఏ హింద్’ సంస్థను ఏర్పాటు చేయించాడు. తాజాగా ఏయూటీ ఆధ్వర్యంలోనే 11 మందితో మాడ్యుల్ తయారు చేశాడు. ఐఎస్ నుంచి వచ్చిన నిధులతో పాటు వివిధ మార్గాల్లో నగదు సమీకరిస్తూ భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించడం కోసం హవాలా తదితర మార్గాల్లో ఇక్కడ ఎంపిక చేసుకున్న వాళ్లకు పంపిస్తున్నాడు.

 
వివిధ రకాలైన పేర్లతో ఇంటర్‌నెట్ కేంద్రంగా యువతను ఆకర్షిస్తున్న షఫీ వయసు ప్రస్తుతం 29 ఏళ్లే అని నిఘా వర్గాలు చెప్తున్నాయి. కొంతకాలం ఆఫ్ఘనిస్థాన్ కేంద్రంగా అల్ కాయిదాతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్న షఫీ... 2014 జూన్ నుంచి సిరియాలో మకాం పెట్టి కార్యకలాపాలను సాగిస్తున్నాడని స్పష్టం చేస్తున్నాయి. ‘జునూద్’ మాడ్యుల్ అరెస్టు తర్వాత భారత నిఘా వర్గాలు ఆర్మర్‌పై సాంకేతిక నిఘా పెట్టాయి. దీన్ని తప్పించుకోవడంతో పాటు వారి దృష్టి మళ్లించడానికీ తాను చనిపోయినట్లు సామాజిక మాధ్యమాల ద్వారా రెండుమూడు సార్లు ప్రచారం చేశాడు. ప్రతి సందర్భంలోనూ సిరియాలో అమెరికా జరిపిన డ్రోన్ దాడుల్లోనే తన మరణం సంభవించినట్లు ప్రచారం చేసుకున్నాడు. ఈ వల్లోపడని నిఘా వర్గాలు తమ పని కొనసాగించడంతో తాజాగా ఏయూటీకి చెందిన 11 మంది హైదరాబాదీలు చిక్కారు.

 

పేర్లు మార్చి... ఏమార్చి...
భారత్‌ను టార్గెట్‌గా చేసుకుని సుదీర్ఘకాలంగా కార్యకలాపాలు సాగిస్తున్న షఫీ ఆర్మర్... ఏ సందర్భంలోనూ తన ‘నిజ స్వరూపాన్ని’ బయటపెట్ట లేదు. ఒక్కో మాడ్యుల్‌ను సంప్రదించేప్పుడు ఒక్కో పేరు వాడినట్లు అధికారులు చెప్తున్నారు.


⇒దేశ వ్యాప్తంగా జరిగిన విధ్వంసాలకు సంబంధించి ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్‌పై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో షఫీ ఆర్మర్ పేరు ఉంది. ఇతడిపై ఇం టర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీసు సైతం జారీ చేసింది.

 
⇒2013లో రాజస్థాన్‌కు చెందిన వ్యక్తుల్ని ఐఎస్ వైపు నడిపించడానికి మహ్మద్ అట్టా పేరుతో సంప్రదింపులు జరిపాడు.


⇒2014లో హైదరాబాద్‌కు చెందిన బాసిత్, మాజ్ హుస్సేన్‌లతో పాటు మరో ఇద్దరినీ ఐఎస్ వైపు ఆకర్షించడానికి సమీర్ ఖాన్‌గా మారాడు.


⇒2015లో మధ్యప్రదేశ్‌లోని రత్లంలో ఏర్పాటు చేసుకున్న మాడ్యుల్‌కు యూసుఫ్‌గా పరిచయమయ్యాడు.


⇒ఈ ఏడాది చిక్కిన ‘జునూద్’ మాడ్యుల్‌లోని సభ్యులతో యూసుఫ్ అల్ హింద్‌గా కథ నడిపాడు.


⇒తాజాగా హైదరాబాద్‌లో పట్టుబడిన 11 మందిని ఏ పేరుతో సంప్రదించాడనే అంశంపై ఎన్‌ఐఏ అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు.

 

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement