Shaik Humera
-
షేక్ హుమేరాకు నిరాశ
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఫ్రెంచ్ ఓపెన్ జూనియర్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లో నేరుగా పాల్గొనేందుకు వచ్చిన అవకాశాన్ని హైదరాబాద్ టెన్నిస్ ప్లేయర్ షేక్ హుమేరా సద్వినియోగం చేసుకోలేకపోయింది. పారిస్‌లో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ జూనియర్ వైల్డ్ కార్డు టోర్నీలో హుమేరాకు నిరాశ ఎదురైంది. ముగ్గురు క్రీడాకారిణుల మధ్య జరిగిన ఈ టోర్నీలో విజేతగా నిలిచిన వారికి మెయిన్ ‘డ్రా’లో స్థానం లభిస్తుంది. అయితే హుమేరా ఒక మ్యాచ్‌లో గెలిచి మరో మ్యాచ్‌లో పరాజయం పాలవ్వడంతో మెయిన్ ‘డ్రా’లో చోటు సంపాదించలేకపోయింది. తొలి మ్యాచ్‌లో షేక్ హుమేరా 6–3, 7–5తో కామిల్లా బొస్సి (బ్రెజిల్)పై గెలిచింది. అయితే ఫంగ్రాన్ తియాన్ (చైనా)తో జరిగిన రెండో మ్యాచ్‌లో హుమేరా 1–6, 3–2తో ఓడిపోయింది. -
ఫ్రెంచ్ ఓపెన్ వైల్డ్ కార్డు టోర్నీకి హుమేరా అర్హత
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఫ్రెంచ్ ఓపెన్ జూనియర్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో మెయిన్ ‘డ్రా’లో పాల్గొనే దిశగా తెలంగాణ అమ్మాయి షేక్ హుమేరా ముందంజ వేసింది. భారత్‌లో నిర్వహించిన వైల్డ్ కార్డు టోర్నీలో ఆమె విజేతగా నిలిచింది. న్యూఢిల్లీలో బుధవారం జరిగిన బాలికల సింగిల్స్ ఫైనల్లో హుమేరా 7–5, 6–3తో సారా దేవ్‌పై విజయం సాధించింది. ఎనిమిది మంది మధ్య నాకౌట్ పద్ధతిలో జరిగిన ఈ టోర్నీలో హుమేరా ఒక్క సెట్ కూడా కోల్పోకుండా విజేతగా నిలువడం విశేషం. పారిస్‌లో జరిగే ఫ్రెంచ్ ఓపెన్ జూనియర్ వైల్డ్ కార్డు టోర్నీలో బ్రెజిల్, చైనా క్రీడాకారిణులతో హుమేరా తలపడుతుంది. ఆ టోర్నీలో చాంపియన్‌గా నిలిచిన వారికి ఫ్రెంచ్ ఓపెన్ జూనియర్ టోర్నీ మెయిన్ ‘డ్రా’లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. బాలుర సింగిల్స్ విభాగంలో మన్ మౌలిక్ షా ఈ అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఫైనల్లో మన్ 7–6 (7/1), 6–2తో మధ్విన్ కామత్‌పై గెలిచాడు. విజేతలకు ఏడుసార్లు గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన జస్టిన్ హెనిన్ (బెల్జియం) బహుమతులు అందజేసింది. -
ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీకి హుమేరా, భక్తి, సంస్కృతి
న్యూఢిల్లీ: ఫ్రెంచ్ ఓపెన్ జూనియర్ వైల్డ్ కార్డు టోర్నమెంట్లో పాల్గొనే క్రీడాకారుల జాబితాను అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ–ఐటా) ప్రకటించింది. బాలికల సింగిల్స్ విభాగంలో ఎనిమిది మంది... బాలుర సింగిల్స్ విభాగంలో ఎనిమిది మందిని ‘ఐటా’ ఎంపిక చేసింది. ఏప్రిల్ 29 నుంచి మే 1 వరకు న్యూఢిల్లీలో ఈ టోర్నీ జరుగుతుంది. బాలికల విభాగంలో తెలంగాణకు చెందిన షేక్ హుమేరా, దామెర సంస్కృతి, భక్తి షాలకు అవకాశం లభించింది. ఈ టోర్నీ విజేతలు పారిస్‌లో జరిగే ఫ్రెంచ్ ఓపెన్ జూనియర్ వైల్డ్ కార్డు టోర్నీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తారు. ఆ టోర్నీలో చైనా, బ్రెజిల్, జపాన్, కొరియా అమెరికాలకు చెందిన ఆటగాళ్లు కూడా పాల్గొంటారు. విజేతగా నిలిచిన వారికి ఫ్రెంచ్ ఓపెన్ జూనియర్ ప్రధాన టోర్నమెంట్లో నేరుగా ఆడే అవకాశం లభిస్తుంది. గత నాలుగేళ్లుగా భారత్‌లో ఈ టోర్నీ జరుగుతోంది. బాలికల సింగిల్స్: షేక్ హుమేరా, భక్తి షా, దామెర సంస్కృతి, సాల్సా అహిర్, కావ్య సాహ్ని, సారా దేవ్, నికిత విశ్వాసె, గార్గి పవార్. బాలుర సింగిల్స్: మన్ మౌలిక్ షా, దేవ్ జావియా, కబీర్ హన్స్, మద్విన్ కామత్, సుశాంత్ దబస్, దివేశ్ గెహ్లట్, రిథమ్ మల్హోత్రా, డెనిమ్ యాదవ్. -
షేక్ హుమేరాకు టైటిల్
సాక్షి, హైదరాబాద్: జాతీయ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి షేక్ హుమేరా సత్తా చాటింది. కోల్‌కతాలో జరిగిన ఈ టోర్నీలో హుమేరా మహిళల సింగిల్స్ విభాగంలో విజేతగా నిలిచి టైటిల్‌ను కైవసం చేసుకుంది. శనివారం జరిగిన టైటిల్‌పోరులో హుమేరా 6–1, 4–6, 7–5తో యుబ్రాని బెనర్జీ (కోల్‌కతా)పై విజయం సాధించింది. ఈ గెలుపుతో హుమేరా 40 ర్యాంకింగ్ పాయింట్లు సొంతం చేసుకుంది. మరోవైపు పురుషుల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నిక్కీ పునాచ చాంపియన్‌గా నిలిచాడు. ఫైనల్లో టాప్ సీడ్ నిక్కీ పునాచ 6–3, 6–4తో దక్షిణేశ్వర్ సురేశ్‌పై గెలుపొందాడు.