భూకబ్జా కేసులో లేడీడాన్ అరెస్ట్
చాంద్రాయణగుట్ట: నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి 400 గజాల ఇంటిని కబ్జా చేసిన లేడీడాన్ను చాంద్రాయణగుట్ట పోలీసులు అరెస్ట్ చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు. ఇన్స్పెక్టర్ ప్రకాష్ రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బండ్లగూడ గౌస్‌నగర్ ఉందాహిల్స్ కాలనీలో సంతోష్‌నగర్ ఈదిబజార్‌కు చెందిన షేక్ వారీస్కు 400 గజాల ఇల్లు ఉంది. ఈ ఇంటిని ఫర్జానా బేగం, మన్సూర్, మరో తొమ్మిది మందితో కలిసి నకిలీ డాక్యూమెంట్లు సృష్టించి కబ్జా చేశారు.
బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు. రెండు రోజుల క్రితం పోలీసులు నిర్వహించిన కార్డన్ సెర్చ్‌లో ఈమెను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించగా బెయిల్‌పై బయటికి రావడంతో మరో కేసులో అదుపులోకి తీసుకున్నారు. కబ్జాలకు పాల్పడుతున్న నిందితురాలిపై ల్యాండ్‌గ్రాబింగ్ షీట్ తెరవనున్నట్లు పోలీసులు తెలిపారు.