HYD: డీమార్ట్‌లో ఫ్రీగా చాకెట్లు తింటూ ఇన్‌స్టా రీల్.. ఇలా బుక్కయ్యాడు
సాక్షి, హైదరాబాద్: డీమార్ట్.. ఈ పేరు తెలియని వారు ఎవరూ ఉండరు. ప్రజల్లో ఎంతో ఆదరణ పొందిన రిటైల్ సూపర్‌మార్కెట్ ఇది. దాదాపు అన్ని నగరాల్లో దీని బ్రాంచ్‌లు ఉన్నాయి. ఎక్కువగా మధ్యతరగతి కుటుంబాలు నెలవారి సరకులు ఇక్కడే కొంటుంటారు. ఇందులో ఉప్పు, పప్పూ నుంచి అన్ని రకాల వంట సామగ్రి, చాక్లెట్లు, బిస్కెట్లు, ఫర్నీచర్, స్టీల్ సామాను, దుస్తులు ఇలా ఏ వస్తువులైనా అందుబాటు ధరలకే లభిస్తాయి. అన్నీ ఒకేచోట ఉండటం వల్ల నిత్యం జనం తాకిడి ఎక్కువగానే ఉంటుంది.
కొంతమంది డీమార్ట్‌లో చెయ్యకూడని పనులు చేస్తుంటారు. తమను ఎవరూ చూడటం లేదనుకొని అమ్మడానికి ఉంచిన వస్తువులను దొంగిలించడం, లేదా చాక్లెట్లను తినడం వంటివి చేస్తుంటారు. కానీ సీసీటీవీ ఫుటేజీలో మన ప్రవర్తన మొత్తం రికార్డవుతోంది. తాజాగా ఓ వ్యక్తి డీమార్ట్‌లో చేసిన దొంగతనం విచిత్రంగా బయటపడింది. ఇటీవల హనుమంతనాయక్ అనే యువకుడు స్నేహితులతో కలిసి షేక్‌పేట ప్రధాన రహదారిపై ఉన్న డీమార్ట్ సూపర్ మార్కెట్లోకి వెళ్లాడు.
అక్క అమ్మడానికి పెట్టిన కొన్ని చాక్లెట్లను డబ్బులు చెల్లించకుండా తిన్నాడు. అంతేగాకుండా ‘బిల్లు చెల్లించకుండా ఫ్రీగా చాక్లెట్లు ఎలా తినాలో తెలుసా? అంటూ వీడియో తీశాడు. దీనిని ఇన్‌స్టాగ్రామ్‌తోపాటు ఇతర సోషల్‌మీడియాల్లో పోస్టు చేశాడు. మంగళవారం ఈ వీడియోలను గుర్తించిన డీమార్ట్ షేక్‌పేట బ్రాంచ్ మేనేజర్ అర్జున్‌సింగ్ బుధవారం ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చాక్లెట్లను దొంగిలించిన వహనుమంత్నాయక్తోపాటు అతడి స్నేహితులపై ఐపీసీ 420, 379 సెక్షన్లతోపాటు ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.