‘థాకరేను సల్మాన్ ఖాన్ కలవలేదు’
ముంబై: మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్ థాకరేను హీరో సల్మాన్ ఖాన్ కలిసినట్టు వచ్చిన వార్తలను ఆ పార్టీ తోసిపుచ్చింది. పాకిస్థాన్ నటులు ఉన్న ప్రతి సినిమా విడుదలను అడ్డుకుంటామని ఎమ్మెన్నెస్ ప్రకటించిన నేపథ్యంలో థాకరేను సల్మాన్ ఖాన్ కలిసినట్టు వార్తలు వచ్చాయి. ఇవన్నీ వదంతులేనని చిత్రపట్ సేన అధ్యక్షుడు అమేయ్ ఖోపాక్ అన్నారు.
పాకిస్థాన్ కళాకారులు దేశం విడిచి వెళ్లిపోవాలన్న తమ విధానంలో ఎటువంటి మార్పు లేదని స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా తమకు ఎవరితోనూ శత్రుత్వం లేదన్నారు. పారిస్ దాడులను పాక్ నటులు ఖండించి, మృతులకు సంతాపం తెలిపారని.. ఉడీ ఉగ్రదాడి గురించి వారెందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. సినిమా, కళలకు తాము వ్యతిరేకం కాదని, పాకిస్థాన్ నటులకు మాత్రమే వ్యతిరేకమని తెలిపారు. పాక్ నటులున్న ప్రతి సినిమాను అడ్డుకుంటామని హెచ్చరించారు. భారత చానళ్లను పాకిస్థాన్ లో నిషేధించారని, బాలీవుడ్ తారల పట్ల దురుసుగా ప్రవర్తించారని అమేయ్ ఖోపాక్ గుర్తు చేశారు.
తమకు దేశమే ముఖ్యమని, తర్వాతే కళలు అని చిత్రపట్ సేన ప్రధాన కార్యదర్శి షాలిని థాకరే అన్నారు. పాకిస్థాన్ కళాకారులు భారత్ వదిలి వెళ్లాల్సిందేనని స్పష్టం చేశారు.