Shantha Rangaswamy
-
‘హర్మన్.. నీ కెప్టెన్సీని సమీక్షించుకో’
న్యూఢిల్లీ: మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో భారత జట్టు ఫైనల్‌కు చేరినా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మాత్రం తీవ్రంగా నిరాశపరిచారు. ఈ మెగా టోర్నీ అంతా కలిపి ఆమె 30 పరుగులు మాత్రమే చేశారు. లీగ్ దశలో 28 పరుగులు చేసిన హర్మన్.. ఆసీస్‌తో జరిగిన తుది పోరులో 2 పరుగులకే నిష్క్రమించారు. దాంతో పాటు మిగతా భారత బ్యాటర్స్ కూడా విఫలం కావడంతో ఘోర ఓటమి తప్పలేదు. అయితే భారత్ ఫైనల్‌కు చేరడంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, టీమిండియా కెప్టెన్ కెప్టెన్ విరాట్ కోహ్లి తదితరులు ప్రశంసలు కురిపిస్తుంటే, భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ శాంతా రంగస్వామి మాత్రం విమర్శలు కురిపించారు. ప్రధానంగా హర్మన్ నాయకత్వాన్ని ఆమె వేలెత్తి చూపారు. ఇక హర్మన్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవాల్సిన సమయం వచ్చేసిందని పరోక్షంగా హెచ్చరించారు. లీడర్‌గా కంటే బ్యాటర్‌గా నిరూపించుకోవడమే ఇప్పుడు హర్మన్‌కు చాలా అవసరమన్నారు. (మన వనిత... పరాజిత) ‘ ఇది నన్ను తీవ్రంగా నిరుత్సాహపరిచింది. ఎంతో పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ కల్గిన భారత జట్టు పేలవంగా టోర్నీ ముగించడం బాధించింది. స్మృతీ మంధాన, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్లు విశేషమైన టాలెంట్ ఉన్న క్రీడాకారిణులు. వారు ఈ టోర్నీ మొత్తం విఫలమయ్యారు. ప్రధానంగా హర్మన్ ఫెయిల్యూర్ కావడమైతే నిలకడగా జరిగింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న వేదా కృష్ణమూర్తి కూడా రాణించలేదు. హర్మన్ తన కెప్టెన్సీపై సమీక్షించుకోవాలి. కెప్టెన్సీ ఎప్పుడు తప్పుకోవాలో ఆమెకు తెలుసు. హర్మన్ ఎంతో పరిణితి చెందిన క్రికెటర్. ఇప్పుడు హర్మన్ కెప్టెన్ కంటే కూడా బ్యాటింగ్‌లో నిరూపించుకోవాల్సిన అవసరం ఏర్పడింది’ అని శాంతా రంగస్వామి పేర్కొన్నారు. ఇక భారత మాజీ వుమెన్స్ క్రికెటర్ డయానా ఎడ్జుల్లీ.. ఫైనల్లో భారత క్రీడాకారిణుల ప్రదర్శనపై విమర్శలు గుర్పించారు. ఎవరికి వారు ఆత్మపరిశోధన చేసుకోవాలంటూ సూచించారు. మరొకవైపు భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కోచ్ తుషాన్ ఆర్ధో కూడా విమర్శలు చేశారు. తానియా భాటియాను మూడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపడంపై మండిపడ్డారు. (మనకూ ఒక రోజు వస్తుంది: గంగూలీ) -
సీఏసీకి కపిల్ రాజీనామా
న్యూఢిల్లీ: భారత దిగ్గజ ఆల్‌రౌండర్ కపిల్ దేవ్ క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశంలోనే ఆయన కూడా వైదొలిగారు. ఈ ప్రయోజనాల బాటలో పదవిని వదులుకున్న నాలుగో క్రికెట్ దిగ్గజం కపిల్. ఇదివరకే గంగూలీ, సచిన్, లక్ష్మణ్‌లు తప్పుకున్నారు. ఆయన రాజీనామా నిజమేనని బోర్డు వర్గాలు ధ్రువీకరించాయి. క్రికెట్ పాలక కమిటీ (సీఓఏ) నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉందని బోర్డు వర్గాలు తెలిపాయి. కపిల్, అన్షుమన్ గైక్వాడ్‌లతో పాటు కమిటీలో ఉన్న శాంతా రంగస్వామి కూడా ఈ విరుద్ధ ప్రయోజనాలతోనే ఇటీవల రాజీనామా చేశారు. -
కపిల్‌దేవ్ సంచలన నిర్ణయం
న్యూఢిల్లీ: పరస్పర విరుద్ద ప్రయోజనాల అంశం మరోసారి ప్రకంపనలు సృష్టిస్తోంది. గతంలో సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్ వంటి దిగ్గజాలకు ఈ అంశంపై నోటీసులు రావడంతో అందరూ విమర్శల వర్షం కురిపించారు. తాజాగా బీసీసీఐ క్రికెట్ సలహా మండలి (సీఏసీ) సభ్యులకు కూడా ఆ వేడి తగిలింది. పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశమై అక్టోబర్ 10లోగా వివరణ ఇవ్వాలని దిగ్గజ ఆల్‌రౌండర్ కపిల్‌దేవ్ నేతృత్వంలోని క్రికెట్ సలహా మండలి (సీఏసీ)కి బీసీసీఐ నైతిక విలువల అధికారి జస్టిస్ డీకే జైన్ నోటీసులు పంపారు. ఇప్పటికే తనకు నోటీసులు రావడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన శాంత రంగస్వామి సీఏసీ నుంచి తప్పుకున్నారు. తాజాగా సీఏసీ నుంచి కపిల్‌దేవ్ కూడా తప్పుకుంటూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సీఏసీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు కపిల్ దేవ్ బుధవారం ప్రకటించారు. అయితే ఇందుకు గల కారణాలను వెల్లడించలేదు. కపిల్‌దేవ్ అత్యంత సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం పరస్పర విరుద్ద ప్రయోజనాల అంశంపై నోటీసుల రావడంతో కొంచెం ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా దీనిపై ఎవరికి సమాధానం చెప్పే ఇష్టం లేకనే తప్పుకుంటున్నట్లు సమాచారం. ఇక గత జులై నెలలో బీసీసీఐ ముగ్గురు సభ్యులతో కూడిన క్రికెట్ సలహా మండలిని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ బృందమే టీమిండియా హెడ్ కోచ్, సహాయ సిబ్బందిని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఇక 'భారత క్రికెట్లో ఇదో కొత్త ఫ్యాషన్. విరుద్ద ప్రయోజనాల కింద నోటీసులు ఇవ్వడం.. వార్తల్లో నిలవడం. భగవంతుడే భారత క్రికెట్‌ను కాపాడాలి’ అంటూ మాజీ సారథి సౌరవ్ గంగూలీ బహిరంగంగా విమర్శించాడు. అంతేకాకుండా ప్రస్తుత పరిస్థితుల్లో ఇతర పదవులు, పనులు చేయకుండా కేవలం క్రికెట్ పాలనకు తగిన మాజీ ఆటగాళ్లను ఎంపిక చేయడం బీసీసీఐకి పెద్ద తలపోటుగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ అంశంపై మాజీ క్రికెటర్లు పెదవి విరుస్తున్న విషయం తెలిసిందే. కపిల్ వ్యాఖ్యాతగా, ఫ్లడ్‌లైట్ల సంస్థ అధిపతిగా, భారత క్రికెటర్ల సంఘం సభ్యుడి (ఐసీఏ)గా ఉన్నాడు. గైక్వాడ్ సొంత అకాడమీతో పాటు బీసీసీఐ అఫిలియేషన్ కమిటీలో సభ్యుడు. శాంత కూడా ఐసీఏ సభ్యురాలు. వీటిని పేర్కొంటూ మధ్యప్రదేశ్ క్రికెట్ సంఘం సభ్యుడు సంజీవ్ గుప్తా ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. -
సీఏసీ నుంచి తప్పుకున్న శాంత రంగస్వామి
న్యూఢిల్లీ: పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశమై అక్టోబర్ 10లోగా సమాధానం ఇవ్వాలంటూ నోటీసు రావడంతో భారత మహిళల క్రికెట్ జట్టు మాజీ కెపె్టన్ శాంత రంగస్వామి... క్రికెట్ సలహా మండలి (సీఏసీ), భారత క్రికెటర్ల సంఘం (ఐసీఏ) నుంచి ఆదివారం తప్పుకొన్నారు. దిగ్గజ ఆల్‌రౌండర్ కపిల్ దేవ్ నేతృత్వంలోని సీఏసీలో సభ్యురాలిగా ఉన్న శాంత... ఇటీవల టీమిండియా హెడ్ కోచ్‌గా రవిశాస్త్రి ఎంపికలో పాల్గొన్నారు. దీంతో ఆమె విరుద్ధ ప్రయోజనాల పరిధిలోకి వస్తారంటూ మధ్యప్రదేశ్ క్రికెట్ సంఘం సభ్యుడు సంజీవ్ గుప్తా బీసీసీఐ ఎథిక్స్ అధికారికి ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో పదవుల నుంచి శాంత వైదొలగారు. ‘నాకు వేరే ప్రణాళికలున్నాయి. వాటిపై దృష్టిపెట్టాలి. అయినా, సీఏసీ ఏడాదికో రెండేళ్లకో ఒకసారి సమావేశం అవుతుంది. ఇందులో విరుద్ధ ప్రయోజనాలు ఏమున్నాయో? సీఏసీలో సభ్యురాలిని కావడం గౌరవంగా భావిస్తున్నా. కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో క్రికెట్ పాలనకు తగిన మాజీ ఆటగాళ్లను ఎంపిక చేయడం కష్టమేమో? ఐసీఏకు దాని ఎన్నికల కంటే ముందే రాజీనామా చేశా’ అని శాంత కాస్త తీవ్రంగా స్పందించారు. -
ఈ సీఏసీ పదవి నాకొద్దు..!
న్యూఢిల్లీ: పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశమై అక్టోబర్ 10లోగా వివరణ ఇవ్వాలని దిగ్గజ ఆల్‌రౌండర్ కపిల్ దేవ్ నేతృత్వంలోని క్రికెట్ సలహా మండలి (సీఏసీ)కి బీసీసీఐ నైతిక విలువల అధికారి జస్టిస్ డీకే జైన్ శనివారం నోటీసు పంపిన సంగతి తెలిసిందే. కపిల్ ఆధ్వర్యంలో అన్షుమన్ గైక్వాడ్, శాంత రంగస్వామి సభ్యులుగా ఉన్న సీఏసీకి డీకే జైన్ నోటీసులు పంపారు. దీనిపై అలిగిన శాంతా రంగస్వామి.. సీఏసీ పదవికి రాజీనామా చేశారు. దాంతోపాటు భారత క్రికెటర్స్ అసోసియేషన్‌కు డైరెక్టర్ పదవి కూడా ఆమె రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం శాంతా రంగస్వామి మాట్లాడుతూ.. ‘ సీఏసీ సమావేశం అనేది ఏడాదికి ఒకసారో, రెండేళ్లకు ఒకసారో జరుగుతుంది. మరి దీనికి పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశాన్ని ముడిపెట్టడం ఏమిటి. నాకైతే ఏమీ అర్థం కాలేదు. అందుచేత ఈ నిర్ణయం తీసుకున్నా’ అని తెలిపారు. కాగా, సీఏసీలో తనను చేర్చుకోవడాన్ని గొప్ప గౌరవం భావిస్తున్నానని, తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించినట్లే అనుకుంటున్నానని పేర్కొన్నారు. ఇదొక చాలా కఠినతరమైన పదవి అని ఆమె తెలిపారు. ఇటీవల కపిల్ నేతృత్వంలోని సీఏసీ కమిటీ.. భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రిని నియమించింది. ఆ క్రమంలోనే ఇందులో సభ్యులుగా ఉన్నవారు పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందకు వస్తారనే వాదన వినిపించింది. దాంతో తాజాగా డీకే జైన్.. సీఏసీకి నోటీసులు పంపడంతో శాంతా రంగస్వామి కలత చెందారు. ఈ నేపథ్యంలోనే తన సభ్యత్వానికి రాజీనామా చేశారు.(ఇక్కడ చదవండి: కపిల్ ‘సీఏసీ’కి నోటీసు)