shar centre
-
SSLV D2 రాకెట్ ప్రయోగం విజయవంతం
సాక్షి, తిరుపతి: శ్రీహరికోట నుంచి ఎస్ఎస్ఎల్వీ డీ2 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగంలో ఎస్ఎస్ఎల్వీ డీ2.. మూడు ఉప గ్రహాలను అంతరిక్షంలోకి మోసుకెళ్లింది. కాగా, 13 నిమిషాల 2 సెకన్లలో రాకెట్ ప్రయోగం పూర్తికానుంది. దీని ద్వారా 2 దేశీయ, అమెరికాకు చెందిన ఒక ఉపగ్రహం కక్షలోకి చేరుకున్నాయి. కాగా, సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని మొదటి ప్రయోగవేదిక నుంచి స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (ఎస్ఎస్ఎల్వీ–డీ2)ను శుక్రవారం ఉదయం 9.18 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగం ద్వారా ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్, జానుస్–1, ఆజాదీ శాట్–2 అనే మూడు ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఇక, ఎస్ఎస్ఎల్వీ–డీ1 పేరుతో గత ఏడాదిలో చేసిన మొదటి ప్రయోగం విఫలం కావడంతో ఈ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు కృషి చేశారు. రాకెట్ వివరాలు ఇవే.. ఎస్ఎస్ఎల్వీ–డీ2 రాకెట్ 34 మీటర్లు పొడవు, రెండు మీటర్లు వెడల్పు, 119 టన్నుల బరువు కలిగి ఉంది. దీనిని నాలుగు దశల్లో ప్రయోగించనున్నారు. ఈ రాకెట్ మొదటి దశను 87 టన్నుల ఘన ఇంధనాన్ని ఉపయోగించి 124 సెకన్లలో పూర్తిచేస్తారు. రెండో దశను 7.7 టన్నుల ఘన ఇంధనంతో 384.2 సెకన్లలో, మూడో దశను 4.5 టన్నుల ఘన ఇంధనంతో 674.9 సెకన్లలో పూర్తి చేయనున్నారు. నాలుగో దశలో మాత్రమే 0.05 టన్నుల ద్రవ ఇంధనం సాయంతో 785.1 సెకన్లలో పూర్తి చేస్తారు. -
డిసెంబర్ లోపు పీఎస్ఎల్వీ సీ49 ప్రయోగం
సాక్షి, సూళ్లూరుపేట: కోవిడ్–19 మహమ్మారి కారణంగా ప్రయోగాలను వాయిదా వేసుకున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో).. ఈ ఏడాది డిసెంబర్‌లోపు ఒక్క ప్రయోగమైనా చేయాలని భావిస్తోంది. అలాగే ఆర్థిక సంవత్సరం పూర్తయ్యేలోపు మరో మూడు ప్రయోగాలు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లో.. క్రమేపి లాక్‌డౌన్‌ను సడలించుకుంటూ అన్ని విభాగాల్లో భౌతిక దూరాన్ని పాటిస్తూ 50 శాతం మంది అధికారులు, సిబ్బంది ప్రస్తుతం విధులకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రయోగాలను మళ్లీ ప్రారంభించేందుకు ఇస్రో రంగం సిద్ధం చేసుకుంటోంది. ఈ ఏడాది డిసెంబర్ నెలలోపు పీఎస్ఎల్వీ సీ49 ప్రయోగాన్ని పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో పాటు పీఎస్ఎల్వీ సీ50.. ఈ ఏడాది మార్చి 5న ఆఖరి నిమిషంలో వాయిదా పడిన జీఎస్ఎల్వీ ఎఫ్10 ప్రయోగాన్ని 2021 మార్చి ఆఖరు నాటికి పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్నారు. చిన్న చిన్న ఉపగ్రహాలను వాణిజ్యపరంగా ప్రయోగించేందుకు ప్రత్యేకంగా డిజైన్ చేసిన స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (ఎస్ఎస్ఎల్వీ) ప్రయోగాన్ని కూడా మొట్ట మొదటిసారి ప్రయోగాత్మకంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. -
చంద్రయాన్-2 చూసేందుకు వి'ల'క్షణ వేదిక
సాక్షి, సూళ్లూరుపేట : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ నెల 22న మధ్యాహ్నం 2.43 గంటలకు ప్రయోగించనున్న చంద్రయాన్–2 ప్రయోగాన్ని వీక్షించేందుకు సందర్శకుల కోసం విలక్షణమైన గ్యాలరీని షార్ అధికారులు నిర్మించారు. తొలుత ఈ నెల 15వ తేదీ తెల్లవారుజామున చంద్రయాన్–2 ప్రయోగానికి సిద్ధం చేశారు. ఈ ప్రయోగం ఇస్రోకే ప్రతిష్టాత్మకం కావడంతో ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు దేశా వ్యాప్తంగా పౌరులను ఆహ్వానించింది. వీరి కోసం షార్‌లోని శబరి గిరిజన కాలనీ ప్రాంతంలో సుమారు 60 ఎకరాల అటవీ భూమిలో సుమారు 5 వేల మంది సందర్శకులు కూర్చుని రాకెట్ ప్రయోగాన్ని వీక్షించేందుకు వీలు కల్పిస్తూ గ్యాలరీ నిర్మాణం చేపట్టారు. ఈ తరహా గ్యాలరీ నిర్మాణాన్ని సైతం షార్ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. అయితే ప్రయోగానికి గంట వ్యవధిలో సాంకేతిక కారణాలతో కౌంట్ డౌన్ ప్రక్రియను నిలిపివేసిన విషయం తెలిసిందే. ఆహ్వానితులకు మళ్లీ అవకాశం ఈ నెల 15న ప్రయోగం నిర్వహించతలపెట్టినప్పుడు సందర్శకులు దేశంలోని నలుమూలల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఇస్రో వెబ్సైట్లో ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకుని ఆ పాస్‌లతో రాకెట్ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా తిలకించాలని ఎన్నో ఆశలతో వచ్చారు. అర్ధరాత్రి వేళ అని చూడకుండా సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన సందర్శకులు ప్రయోగం వాయిదా పడడంతో నిరుత్సాహంగా వెనుదిరిగి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. అందుకే వారిని సంతృప్తి పరిచేందుకు గతంలో ఆన్లైన్లో నమోదు చేసుకున్న వాళ్లకు ఇచ్చిన సీరియల్ నంబర్లో వెబ్సైట్లో కొడితే అనుమతి వస్తోంది. కొత్తగా రావాలనుకునే వారికి మాత్రం సైట్ ఓపెన్ కాకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. కొత్త వారికి కూడా చంద్రయాన్–2 ప్రయోగాన్ని వీక్షించే భాగ్యాన్ని కల్పించాలని పలువురు సందర్శకులు కోరుతున్నారు. -
షార్ ను సందర్శించిన ట్రైనీ ఐపీఎస్‌లు
శ్రీహరికోట : నేషనల్ పోలీస్ ఆకాడమీ హైదరాబాద్‌కు చెందిన 16 మంది ట్రైనీ ఐపీఎస్ అధికారుల బృందం శుక్రవారం సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం (షార్)ను సందర్శించారు. ఇన్‌ఛార్జి సీఐ రత్తయ్య, ఎస్సైలు జీ గంగాధరరావు, విజయకుమార్‌లు వారికి స్వాగతం పలికి షార్ లోపలకు తీసుకెళ్లారు. భాస్కర్ అతిథి భవనంలోని కాన్ఫరెన్స్ హాలులో చిన్నపాటి సమావేశం ఏర్పాటు చేసి షార్ ఇంజినీర్లు శ్రీహరికోట రేంజ్ గురించి క్షుణ్ణంగా వివరించారు. ఆ తరువాత షార్ సెక్యూరిటీ ఏర్పాట్లను కూడా ప్రత్యేకంగా పరిశీలించి వివరాలను తెలుసుకున్నారు. అనంతరం షార్ ఇంజినీర్లు 16 మంది అధికారుల బృందాన్ని రెండోగేట్ తరువాత వున్న మిషన్ కంట్రోల్‌సెంటర్, రెండు ఫ్రయోగవేదికలు, ఇక్కడ జరిగే రాకెట్ ప్రయోగాల గురించి తెలుసుకున్నారు. శ్రీహరికోట రాకెట్ కేంద్రాన్ని సందర్శించి ఇక్కడ జరుగుతున్న ప్రయోగాలు, సెక్యూరిటీ గురించి తెలుసుకోవడం శిక్షణలో భాగమని బృందం నాయకుడు అన్నారు. -
షార్ బృందానికి మోడీ అభినందనలు
-
యే దిల్ మాంగే మోర్: ప్రధాని మోడీ
ఉపనిషత్తుల నుంచి ఉపగ్రహాల వరకు మానవ జీవనయానాన్ని తీసుకెళ్లిన శాస్త్రవేత్తలకు అభినందనలు అంటూ ప్రధానమంత్రి మోడీ షార్ శాస్త్రవేత్తలను అభినందనలలో ముంచెత్తారు. పీఎస్ఎల్వీ సి-23 ప్రయోగం విజయవంతం అయిన తర్వాత శ్రీహరికోటలోని షార్ మానిటరింగ్ సెంటర్ నుంచి ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. శాస్త్రవేత్తలను వారు సాధించిన విజయాలకు ప్రశంసిస్తూనే.. యే దిల్ మాంగే మోర్ అంటూ సార్క్ దేశాలకు ఉపయోగపడేలా ఓ కొత్త ఉపగ్రహాన్ని రూపొందించాలని, ఇది సార్క్ దేశాలన్నింటికీ సేవలు అందించేలా ఉండాలని కోరారు. అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఉపగ్రహాలు పట్టుకుని మన వద్దకే వస్తున్నాయంటూ అంతరిక్ష రంగంలో విజయాన్ని శ్లాఘించారు. ఇంకా మోడీ ఏమన్నారంటే.. మనం ఐదు ఉపగ్రహాలను 660 కిలోమీటర్ల ఎత్తున కక్ష్యలోకి ప్రవేశపెట్టాం. దీనివల్ల ప్రతి భారతీయుడి గుండె ఉప్పొంగిపోతోంది. మీ ముఖాల్లోఆ ఆనందం కనిపిస్తోంది. అంతరిక్ష పరిజ్ఞానం విషయంలో మన విజయాన్ని ప్రత్యక్షంగా చూసినందుకు గర్వకారణంగా ఉంది. ప్రపంచంలోని ఐదారు దేశాల్లో మనది కూడా ఒకటిగా నిలిచింది. అభివృద్ధి చెందిన దేశాల ఉపగ్రహాలను కూడా మనం ప్రవేశపెట్టాం. ఒక్క పీఎస్‌ఎల్‌వీయే 67 ఉపగ్రహాలను ఇప్పటివరకు ప్రవేశపెట్టింది. ఫ్రాన్స్, కెనడా, జర్మనీ, సింగపూర్ లాంటి దేశాలు కూడా శాటిలైట్లు పట్టుకుని మనదగ్గరకే వస్తున్నాయి. ఇదే మన అంతరిక్ష సామర్థ్యానికి నిదర్శనం. మనది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానం. అంతర్జాతీయంగా ఒత్తిళ్లు వచ్చినా, అవరోధాలు వచ్చినా, మన శాస్త్రవేత్తలు వాటిని అధిగమించారు. అందుకు అందరికీ కృతజ్ఞతలు. వనరుల కొరత ఉన్నా, అనేక పరిమితులున్నా, మనం అనేక విజయాలు సాధించాం. నేనిక్కడ సైకిల్ మీద రాకెట్‌ను తీసుకెళ్తున్న ఫొటో చూశాను. అలాంటి రోజు నుంచి ఈ స్థితికి వచ్చాం. ఇప్పుడు ప్రపంచంలోనే మనం అత్యంత విజయవంతమైన బృందంగా ఉన్నాం. హాలీవుడ్ సినిమా గ్రావిటీ కంటే కూడా తక్కువ ఖర్చుతో మనం మార్స్ మిషన్ చేస్తున్నాం. ఇంధన ఇంజనీరింగ్ విషయంలో మన శాస్త్రవేత్తలు ప్రపంచానికి తమ సత్తా చాటి చూపించారు. మనకు శాస్త్ర సాంకేతిక రంగాల్లో అద్భుతమైన వారసత్వం ఉంది. మన పూర్వీకులు '0'ను కనిపెట్టకపోతే.. ఇంత దూరం వెళ్లేవాళ్లం కాము. భాస్కరాచార్య, ఆర్యభట్ట లాంటి శాస్త్రవేత్తలు మన అంతరిక్ష విజయాలకు పునాదులు వేశారు. సాంకేతిక విజయాలతో సామాన్యుడికి సంబంధం లేదన్న ఆలో్చనను మానుకోవాలి. మన శరీరంలో ఏమైనా లోపం వస్తే తప్ప.. ఆ భాగం విలువ మనకు తెలియదు. అంతరిక్ష శాస్త్ర ప్రాముఖ్యం ఎంత అనేది అందరికీ తెలియజేయాల్సి ఉంది. టెక్నాలజీకి సామాన్యుడితో సంబంధం ఉంది. వాళ్ల జీవితాన్ని మార్చడానికి అది ఉపయోగపడుతుంది. మన సమస్యలను అది అధిగమించేలా చేస్తుంది. అత్యంత మారుమూల ఉన్న కుటుంబాలను కూడా జనజీవన స్రవంతిలోకి తెస్తుంది. లాంగ్ డిస్టెన్స్ లెర్నింగ్ ద్వారా, టెలి మెడిసిన్ ద్వారా ఎక్కడున్నా సేవలు అందుకోవచ్చు. ల్యాబ్‌లలో కూర్చుని మీరు చేసిన సాధనకు కోట్లాది మంది జీవితాలను మార్చే శక్తి ఉంది. మీరు సాధించిన విజయాలను సామాన్య మానవుడి వద్దకు తీసుకెళ్లడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మీ విజయాల ఫలితాలతో మేం ఎక్కడో ఉన్న అడవుల్లో కూడా నాణ్యమైన జీవనం అందించగలం. డిజిటల్ ఇండియా 125 కోట్ల మంది భారతీయులను ఏకం చేస్తోంది. జీఐఎస్ ద్వారా వాటర్ షెడ్ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇది మా ప్రణాళికల్లో కూడా ఇది ఎంతో ఉపయోగపడుతోంది. ఇది మన సహజవనరుల నిర్వహణకు కూడా ఉపయుక్తంగా ఉంది. హిమాలయ ప్రాంతాల్లోను, తీర ప్రాంతాల్లోను ఉన్న వనరులను ఉపయోగించుకుంటున్నాం. వ్యర్థ భూములను ఉపయుక్తంగా మార్చుకోగలుగుతున్నాం. ల్యాండ్ రికార్డులను కచ్చితంగా నిర్వహించడానికి కూడా ఈ జీఐఎస్ పరిజ్ఞానం ఉపయోగపడుతుంది. నిరుపేద రైతుకు తన భూముల గురించి తెలుస్తుంది. ఎప్పుడో తోడరమల్ తర్వాత ఇంతవరకు భూముల రికార్డులను సమీక్షించలేదు. ప్రతి 35 సంవత్సరాలకు ఒకసారి జరగాలి కానీ, జరగట్లేదు. ఇప్పుడు మీ పరిశోధనల పుణ్యమాని జరగబోతోంది. విపత్తు నివారణ విషయంలో కూడా శాటిలైట్ కమ్యూనికేషన్ ఎంతో ఉపయోగపడుతోంది. ముందస్తు హెచ్చరికలు చేయడం వల్ల కోట్లాది ప్రాణాలు కాపాడగలిగాం. మన అభివృద్ధి విధానం, ఆర్థిక అభివృద్ధి, వనరుల పరిరక్షణ.. అన్నింటికీ స్పేస్ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. కానీ, యే దిల్ మాంగే మోర్. నాకు మరింత కావాలి. పొరుగు దేశాలకు బహుమతిగా అందించేందుకు ఒక సార్క్ ఉపగ్రహ వ్యవస్థను తయారుచేయాలి. మన శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్ మొత్తం దక్షిణాసియాను కవర్ చేసేలా ఉండాలి. ప్రపంచానికే సర్వీస్ ప్రొవైడర్‌గా ఉండగల సామర్థ్యం మనకుంది. యువ శాస్త్రవేత్తలు సాధిస్తున్న విజయాలు చాలా గర్వకారణం. దీన్ని అన్ని యూనివర్సిటీలతో అనుసంధానించాలి. నేను నిన్నటి నుంచి ఇక్కడ ఉన్నాను. నాలుగు తరాల శాస్త్రవేత్తలను కలిశాను. చాలా సంతోషం. ఆర్యభట్ట చూసినవారి నుంచి ఇప్పటివారి వరకు అందరినీ ఒకేచోట చూడటం పెద్ద కుటుంబాన్ని చూసినట్లుంది. ఈనాటి మిషన్ నుంచి మనందరం స్ఫూర్తి పొందుదాం. మనం చేయగలమన్న నమ్మకం నాకుంది.. నాకుంది. ఇప్పుడు మనమంతా గర్వంగా చెప్పుకోవచ్చు.. భారత్ మాతాకీ జై!!