యే దిల్ మాంగే మోర్: ప్రధాని మోడీ | narendra modi says yeh dil maange more with shar scientists | Sakshi
Sakshi News home page

యే దిల్ మాంగే మోర్: ప్రధాని మోడీ

Published Mon, Jun 30 2014 10:48 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

యే దిల్ మాంగే మోర్: ప్రధాని మోడీ - Sakshi

యే దిల్ మాంగే మోర్: ప్రధాని మోడీ

ఉపనిషత్తుల నుంచి ఉపగ్రహాల వరకు మానవ జీవనయానాన్ని తీసుకెళ్లిన శాస్త్రవేత్తలకు అభినందనలు అంటూ ప్రధానమంత్రి మోడీ షార్ శాస్త్రవేత్తలను అభినందనలలో ముంచెత్తారు. పీఎస్ఎల్వీ సి-23 ప్రయోగం విజయవంతం అయిన తర్వాత శ్రీహరికోటలోని షార్ మానిటరింగ్ సెంటర్ నుంచి ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. శాస్త్రవేత్తలను వారు సాధించిన విజయాలకు ప్రశంసిస్తూనే.. యే దిల్ మాంగే మోర్ అంటూ సార్క్ దేశాలకు ఉపయోగపడేలా ఓ కొత్త ఉపగ్రహాన్ని రూపొందించాలని, ఇది సార్క్ దేశాలన్నింటికీ సేవలు అందించేలా ఉండాలని కోరారు. అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఉపగ్రహాలు పట్టుకుని మన వద్దకే వస్తున్నాయంటూ అంతరిక్ష రంగంలో విజయాన్ని శ్లాఘించారు. ఇంకా మోడీ ఏమన్నారంటే..
 

  • మనం ఐదు ఉపగ్రహాలను 660 కిలోమీటర్ల ఎత్తున కక్ష్యలోకి ప్రవేశపెట్టాం. దీనివల్ల ప్రతి భారతీయుడి గుండె ఉప్పొంగిపోతోంది. మీ ముఖాల్లోఆ ఆనందం కనిపిస్తోంది.
  • అంతరిక్ష పరిజ్ఞానం విషయంలో మన విజయాన్ని ప్రత్యక్షంగా చూసినందుకు గర్వకారణంగా ఉంది. ప్రపంచంలోని ఐదారు దేశాల్లో మనది కూడా ఒకటిగా నిలిచింది. అభివృద్ధి చెందిన దేశాల ఉపగ్రహాలను కూడా మనం ప్రవేశపెట్టాం. ఒక్క పీఎస్ఎల్వీయే 67 ఉపగ్రహాలను ఇప్పటివరకు ప్రవేశపెట్టింది. ఫ్రాన్స్, కెనడా, జర్మనీ, సింగపూర్ లాంటి దేశాలు కూడా శాటిలైట్లు పట్టుకుని మనదగ్గరకే వస్తున్నాయి. ఇదే మన అంతరిక్ష సామర్థ్యానికి నిదర్శనం.
  • మనది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానం. అంతర్జాతీయంగా ఒత్తిళ్లు వచ్చినా, అవరోధాలు వచ్చినా, మన శాస్త్రవేత్తలు వాటిని అధిగమించారు. అందుకు అందరికీ కృతజ్ఞతలు. వనరుల కొరత ఉన్నా, అనేక పరిమితులున్నా, మనం అనేక విజయాలు సాధించాం.
  • నేనిక్కడ సైకిల్ మీద రాకెట్ను తీసుకెళ్తున్న ఫొటో చూశాను. అలాంటి రోజు నుంచి ఈ స్థితికి వచ్చాం. ఇప్పుడు ప్రపంచంలోనే మనం అత్యంత విజయవంతమైన బృందంగా ఉన్నాం.
  • హాలీవుడ్ సినిమా గ్రావిటీ కంటే కూడా తక్కువ ఖర్చుతో మనం మార్స్ మిషన్ చేస్తున్నాం. ఇంధన ఇంజనీరింగ్ విషయంలో మన శాస్త్రవేత్తలు ప్రపంచానికి తమ సత్తా చాటి చూపించారు.
  • మనకు శాస్త్ర సాంకేతిక రంగాల్లో అద్భుతమైన వారసత్వం ఉంది. మన పూర్వీకులు '0'ను కనిపెట్టకపోతే.. ఇంత దూరం వెళ్లేవాళ్లం కాము. భాస్కరాచార్య, ఆర్యభట్ట లాంటి శాస్త్రవేత్తలు మన అంతరిక్ష విజయాలకు పునాదులు వేశారు.
  • సాంకేతిక విజయాలతో సామాన్యుడికి సంబంధం లేదన్న ఆలో్చనను మానుకోవాలి. మన శరీరంలో ఏమైనా లోపం వస్తే తప్ప.. ఆ భాగం విలువ మనకు తెలియదు. అంతరిక్ష శాస్త్ర ప్రాముఖ్యం ఎంత అనేది అందరికీ తెలియజేయాల్సి ఉంది.
  • టెక్నాలజీకి సామాన్యుడితో సంబంధం ఉంది. వాళ్ల జీవితాన్ని మార్చడానికి అది ఉపయోగపడుతుంది. మన సమస్యలను అది అధిగమించేలా చేస్తుంది. అత్యంత మారుమూల ఉన్న కుటుంబాలను కూడా జనజీవన స్రవంతిలోకి తెస్తుంది. లాంగ్ డిస్టెన్స్ లెర్నింగ్ ద్వారా, టెలి మెడిసిన్ ద్వారా ఎక్కడున్నా సేవలు అందుకోవచ్చు.
  • ల్యాబ్లలో కూర్చుని మీరు చేసిన సాధనకు కోట్లాది మంది జీవితాలను మార్చే శక్తి ఉంది.
  • మీరు సాధించిన విజయాలను సామాన్య మానవుడి వద్దకు తీసుకెళ్లడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మీ విజయాల ఫలితాలతో మేం ఎక్కడో ఉన్న అడవుల్లో కూడా నాణ్యమైన జీవనం అందించగలం.
  • డిజిటల్ ఇండియా 125 కోట్ల మంది భారతీయులను ఏకం చేస్తోంది. జీఐఎస్ ద్వారా వాటర్ షెడ్ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇది మా ప్రణాళికల్లో కూడా ఇది ఎంతో ఉపయోగపడుతోంది.
  • ఇది మన సహజవనరుల నిర్వహణకు కూడా ఉపయుక్తంగా ఉంది. హిమాలయ ప్రాంతాల్లోను, తీర ప్రాంతాల్లోను ఉన్న వనరులను ఉపయోగించుకుంటున్నాం. వ్యర్థ భూములను ఉపయుక్తంగా మార్చుకోగలుగుతున్నాం.
  • ల్యాండ్ రికార్డులను కచ్చితంగా నిర్వహించడానికి కూడా ఈ జీఐఎస్ పరిజ్ఞానం ఉపయోగపడుతుంది. నిరుపేద రైతుకు తన భూముల గురించి తెలుస్తుంది. ఎప్పుడో తోడరమల్ తర్వాత ఇంతవరకు భూముల రికార్డులను సమీక్షించలేదు. ప్రతి 35 సంవత్సరాలకు ఒకసారి జరగాలి కానీ, జరగట్లేదు. ఇప్పుడు మీ పరిశోధనల పుణ్యమాని జరగబోతోంది.
  • విపత్తు నివారణ విషయంలో కూడా శాటిలైట్ కమ్యూనికేషన్ ఎంతో ఉపయోగపడుతోంది. ముందస్తు హెచ్చరికలు చేయడం వల్ల కోట్లాది ప్రాణాలు కాపాడగలిగాం. మన అభివృద్ధి విధానం, ఆర్థిక అభివృద్ధి, వనరుల పరిరక్షణ.. అన్నింటికీ స్పేస్ టెక్నాలజీ ఉపయోగపడుతుంది.
  • కానీ, యే దిల్ మాంగే మోర్. నాకు మరింత కావాలి. పొరుగు దేశాలకు బహుమతిగా అందించేందుకు ఒక సార్క్ ఉపగ్రహ వ్యవస్థను తయారుచేయాలి. మన శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్ మొత్తం దక్షిణాసియాను కవర్ చేసేలా ఉండాలి. ప్రపంచానికే సర్వీస్ ప్రొవైడర్గా ఉండగల సామర్థ్యం మనకుంది.
  • యువ శాస్త్రవేత్తలు సాధిస్తున్న విజయాలు చాలా గర్వకారణం. దీన్ని అన్ని యూనివర్సిటీలతో అనుసంధానించాలి. నేను నిన్నటి నుంచి ఇక్కడ ఉన్నాను. నాలుగు తరాల శాస్త్రవేత్తలను కలిశాను. చాలా సంతోషం. ఆర్యభట్ట చూసినవారి నుంచి ఇప్పటివారి వరకు అందరినీ ఒకేచోట చూడటం పెద్ద కుటుంబాన్ని చూసినట్లుంది.
  • ఈనాటి మిషన్ నుంచి మనందరం స్ఫూర్తి పొందుదాం. మనం చేయగలమన్న నమ్మకం నాకుంది.. నాకుంది. ఇప్పుడు మనమంతా గర్వంగా చెప్పుకోవచ్చు.. భారత్ మాతాకీ జై!!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement