ఐసీడీఎస్‌లో యూనియన్ల రగడ
కొత్తగూడెం అర్బన్, న్యూస్‌లైన్: ఐసీడీఎస్ కొత్తగూడెం అర్బన్ ప్రాజెక్టులో యూనియన్ల గొడవలు తారాస్థాయికి చేరాయి. తమ యూనియనే గొప్పంటూ ఒక వర్గం... కాదు తమ యూనియనే గొప్పంటూ మరో వర్గం వాగ్వాదానికి దిగి ఘర్షణకు పాల్పడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. ఐసీడీఎస్ కొత్తగూడెం అర్బన్ ప్రాజెక్టు కార్యాలయంలో మంగళవారం ప్రాజెక్టు మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్‌కు ఏఐటీయూసీ, సీఐటీయూ యూనియన్లకు చెందిన అంగన్వాడీ కార్యకర్తలు హాజరయ్యారు.
సీడీపీఓ శారదశాంతి మీటింగ్ నిర్వహించి అంగన్వాడీలకు సూచనలు, సెంటర్ల రిపోర్టులు తీసుకుని ముగించారు. అనంతరం ఐసీడీఎస్ కార్యాలయంలో కార్యకర్తలు సెక్టారు మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ కార్యకర్తలు మాట్లాడుతుంటే సీఐటీయూ కార్యకర్తలు వచ్చి తమ యూనియన్ నిర్వహించిన 13 రోజుల సమ్మె మూలంగానే వేతనాలు పెరిగాయని అన్నారు. ఈ క్రమంలో రెండు యూనియన్ల మధ్య వాగ్వాదం జరిగింది. ఒకరిపై ఒకరు విమర్శలు చే సుకున్నారు. దీంతో ఘర్షణ జరిగి ఒకరినొకరు నెట్టుకున్నారు. ఈ ఘర్షణలో పలువురు అంగన్వాడీ కార్యకర్తలు గాయపడ్డారు.
దీంతో సీఐటీయూ కార్యకర్తలు వచ్చిన తమ యూనియన్ కార్యకర్తలపై దాడి చేశారని ఏఐటీయూసీ కార్యకర్తలు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం సీఐటీయూ కార్యకర్తలు ఐసీడీఎస్ కార్యాలయం నుంచి ర్యాలీగా వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఏఐటీయూసీ కార్యకర్తలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఇరువర్గాల వారు పోలీస్‌స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేసి ఆర్డీఓ అమయ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు.
పట్టించుకోని అధికారులు..?
కొత్తగూడెం అర్బన్ ప్రాజెక్టులో ఎప్పటి నుంచి ఏఐటీయూసీ, సీఐటీయూ యూనియన్ల మధ్య గొడవలు జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రతినెలా జరిగే ప్రాజెక్టు మీటింగ్‌లకు యూనియన్ నాయకులు వచ్చి యూనియన్ల విషయాలు మాట్లాడడం వల్లే గొడవలు జరుగుతున్నాయని అంగన్వాడీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.