Sharda River
-
జనసంద్రంగా శారదా నది వంతెన
-
సరదాను హరించిన శారద
భవాని మాల ధరించిన చిన్నారులు రెండు కుటుంబాలకు ఒక్కక్కరే కొడుకులు చూచుకొండలో విషాదం స్నానం కోసం శారద నదిలో మునిగి ఇద్దరు విద్యార్థుల మృత్యువాత మునగపాక:ముక్కుపచ్చలారని ఇద్దరు విద్యార్థులు శారదా నదిలో సరదాగా స్నానానికి వెళ్లి మృత్యువాత పడ్డారు. ఈ సంఘటనతో చూచుకొండ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని చూచుకొండ ఎస్సీ కాలనీకి చెందిన కాండ్రేగుల దార సన్యాసినాయుడు (మణికంఠ, 13) సమీపంలోని గణపర్తి జిల్లా పరిషత్ హైస్కూల్లో 8వతరగతి చదువుకుంటున్నాడు. అదే కాలనీకి చెందిన పేలూరి సాయి (14) కూడా అదే హైస్కూల్లో 9వతరగతి చదువుతున్నాడు. దుర్గాదేవి అమ్మవారి శరన్నవరాత్రుల్లో భాగంగా ఇద్దరూ అమ్మవారి మాల ధరించారు. బుధవారం ఉదయం మణికంఠ, సాయి, అదే కాలనీలో ఉంటున్న సతీష్ అల్పాహారం తీసుకున్న తరువాత గణపర్తి శారదానది పరివాహక ప్రాంతంలో స్నానం చేసేందుకు ఉదయం 9.45 గంటలకు చేరుకుని నదిలోకి దిగారు. మణికంఠ, సాయి ఇద్దరూ ఒక్కసారిగా నదిలో గల్లంతయ్యారు. ఇది గమనించిన సతీష్ కేకలు వేయడంతో పక్కనే ఉన్న కొంతమంది గాలింపు చేపట్టారు. కొంతసేపటికి సాయి మృతదేహం లభ్యమైంది. మణికంఠ మృతదేహం కోసం గణపర్తి, మెలిపాక, పూడిమడక గ్రామాలకు చెందిన ఈతగాళ్లతోపాటు ఎస్ఐ హరి, అగ్నిమాపక శాఖ అధికారులు కూడా సుమారు 4 గంటల పాటు గాలించారు. తాళ్లు, ట్యూబ్‌ల సహాయంతో నదిలో విస్త్రృతంగా గాలింపు చేపట్టగా మధ్యాహ్నం 3 గంటల సమయంలో మణికంఠ మృతదేహం కూడా కనిపించడంతో ఒడ్డుకు తీసుకువచ్చారు. న దీపరివాహక ప్రాంతం వద్ద ఇరు కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. నదిలో స్నానం చేస్తున్న సందర్భంలో తాము వారించినా పిల్లలు వినిపించుకోలేదని అక్కడ ఉన్న రజకులు ఆవేదన వ్యక్తంచేశారు. రెండూ పేద కుటుంబాలే.. మణికంఠ తల్లి ఉమ అచ్యుతాపురంలోని బ్రాండెక్స్ కంపెనీలో పనిచేస్తుండగా తండ్రి స్థానికంగా మేస్త్రీగా పనులు చేస్తుంటాడు. మణికంఠ అక్క మౌలిక అండమాన్‌లో ఉంటోంది. కుటుంబానికి ఆసరాగా ఉంటాడనుకున్న కొడుకు ఇలా నదిలో పడి మృతి చెందడాన్ని కుటుంబ సభ్యులతోపాటు స్థానికులు కూడా తట్టుకోలేకపోతున్నారు. సాయి తండ్రి విష్ణు స్థానికంగా క్షౌర వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఒక్కగానొక్క కొడుకు నదిలో పడి మృతి చెందాడన్న విషయం తెలియడంతో కుటుంబసభ్యుల. ఇద్దరి విగతజీవులను చూసిన గ్రామస్తులు కంటతడి పెట్టారు. ఈ సంఘటన పరిసర ప్రాంతాలకు వ్యాపించడంతో నది ఒడ్డకు వందలాదిగా జనం తరలివచ్చారు. నది ఒడ్డునే పోస్టుమార్టం శారదానదిలో పడి మృత్యువాత పడిన మణికంఠ, సాయిలకు స్థానికంగానే పోస్టుమార్టం నిర్వహించారు. అనకాపల్లి వంద పడకల ఆసుపత్రికి చెందిన వైద్యులు శారదానది ఒడ్డునే పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ హరి చెప్పారు. శోకసంద్రంలో చూచుకొండ ఆడుతూ పాడుతూ ఉండే ఇద్దరు చిన్నారులు స్నానానికి వెళ్లి మృతి చెందడంతో చూచుకొండ గ్రామం శోక సముద్రంలో మునిగింది. రెండు కుటుంబాలకు ఒక్కొక్కరే కొడుకులు కావడంతో వారిని ఓదార్చడం ఎవరితరం కాలేదు. నేతలు, అధికారుల పరామర్శ ఇద్దరు విద్యార్థులు మృతి చెందారన్న విషయం తెలుసుకున్న స్థానిక నాయకులు, అధికారులు బుధవారం గ్రామానికి చేరుకున్నారు. తహశీల్దార్ రాంబాబు, ఎంపీడీఒ శాంతలక్ష్మి, ఆర్ఈసీఎస్ మాజీ చైర్మన్ బొడ్డేడ ప్రసాద్, ఎంపీపీ మంజు, ఎంపీటీసీ పెంటకోట అప్పలనాయుడు, చూచుకొండ సర్పంచ్ నరసింగరావు, కర్రి రామనాగేశ్వరరావు తదితరులు మృతదేహాలకు సందర్శించి మృతుల కుటుంబాలను ఓదార్చారు. -
ప్రమాదస్థాయికి జలాశయాలు
2వేల క్యూసెక్కుల నీరు వివిధ నదుల్లోకి విడుదల పొంగి ప్రవహిస్తున్న శారద,పెద్దేరు,బొడ్డేరు చోడవరం : పదిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలన్నీ నిండుకుండలను తలపిస్తున్నాయి. పరీవాహక ప్రాంతాల్లో వర్షాలతో పెద్ద ఎత్తున ఇన్‌ఫ్లో వచ్చిపడుతోంది. ఒక్కసారిగా జిల్లాలోని రైవాడ, కోనాం, పెద్దేరు, కల్యాణపులోవ రిజర్వాయర్లలో నీటి మట్టాలు ప్రమాద స్థాయికి చేరాయి. దీంతో అన్నింటి గేట్లు ఎత్తి వందలాది క్యూసెక్కుల నీటిని నదుల్లోకి విడిచిపెడుతున్నారు. పాలగెడ్డ, గొర్లెగెడ్డ, ఉరకగెడ్డ, తారకరామ,గుండుబాడు మినీ రిజర్వాయర్లలోనూ వరద నీరు ఉరకలు వేస్తోంది. శనివారం రైవాడ జలాశయం మూడు గేట్లు ఎత్తి 800క్యూసెక్కుల నీటిని శారదానదిలోకి వదిలారు. శారదానది పొంగి ప్రవహిస్తోంది. కల్యాణపులోవ రిజర్వాయర్ రెండు గేట్లు ఎత్తి 200 క్యూసెక్కుల నీరు, కోనాం జలాశయం ఒక గేటు ఎత్తి 500 క్యూసెక్కులు బొడ్డేరు నదిలోకి,పెద్దేరు రెండు గేట్లు ఎత్తి 500క్యూసెక్కులు నీరు పెద్దేరు నదిలోకి విడుదల చేస్తున్నారు. శారద,పెద్దేరు, బొడ్డేరు, తాచేరు నదులు నీటితో కళకళలాడుతున్నాయి. రిజర్వాయర్ల పరిధిలో సుమారు లక్ష ఎకరాల సాగు భూమి ఉంది. ఈ ఖరీఫ్‌కు నీటి ఇబ్బందులు ఉండవని రైతులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. -
‘శారద’కు కోత
కశింకోట : మండలంలోని నరసాపురం ఆనకట్ట ప్రాంతంలోని శారదా నది కోతకు గురైంది. ఆనకట్ట ఎగువ భాగంతో పాటు దిగువన కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కొందరు రైతుల పంట భూములు సైతం నదిలో కలిసిపోవడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రాంత రైతుల కోరిక మేరకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఇక్కడ ఆనకట్ట మంజూరైంది. నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో రూ. 16.17 కోట్ల అంచనా వ్యయంతో 2009లో నిర్మాణం చేపట్టారు. తుది మెరుగులు తప్ప ఆయకట్టు భూములకు సాగునీరు ఇవ్వడానికి వీలుగా ఆనకట్ట నిర్మాణం గత ఏడాది పూర్తయ్యింది. ఇంతలో కాంట్రాక్టర్ పనులను నిలిపి వేశారు. ఇప్పటికి రూ.15 కోట్ల వరకు ఖర్చు చేసినట్టు అధికారిక సమాచారం. ఆనకట్ట నుంచి కశింకోట, యలమంచిలి మండలాలకు చెందిన సుమారు 3500 ఎకరాల పంట భూములకు నీరు వెళ్లడానికి ఏర్పాటు చేసిన నాలుగు ఖానాలకు గేట్లు అమర్చాల్సి ఉంది. ఇందుకు రూ.2.40 కోట్లు ఖర్చవుతుందని అంచనా చేశారు. ఈ నిధుల మంజూరుకు సాంకేతిక సమస్యతో పాటు ప్రభుత్వం వద్ద నిధుల కొరత వల్ల ఈ ఏడాది గేట్లు ఏర్పాటు చేయని దుస్థితి నెలకొంది. విశాఖ డెయిరీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడానికి చేసిన ప్రయత్నాలు ఫలించ లేదు. ఈ నేపథ్యంలో ఖానాల నుంచి నది నీరు దిగువకు వృథాగాపోతోంది. ఇటీవల హుద్‌హుద్ తుఫాను వల్ల నది ఉప్పొంగి ప్రవహించింది. దీంతో ఆనకట్టకు ఉన్న నాలుగు ఖానాల నుంచి నీరు ఉధృతంగా పారడంతో ఆనకట్ట దిగువన నది కుడి వైపున ఖానాలు ఉన్న ఎక్కువ భాగం కోతకు గురైంది. ఖానాలకు గేట్లు ఏర్పాటు చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని రైతులు అంటున్నారు. తక్షణమే ఆనకట్ట ఖానాలకు గేట్లు ఏర్పాటు చేసి పంట భూములు కోతకు గురి కాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని రైతులంతా కోరుతున్నారు. -
కోట్లు కొల్లగొడుతున్నారు
పేట్రేగిపోతున్న ఇసుక మాఫియా నదులు, చెరువులకూ అడ్డంగా తూట్లు రూ.40 కోట్లకు పైగానే లావాదేవీలు వ్యాపారులకు అధికారపార్టీ నేతల వత్తాసు జిల్లాలో ఇసుక మాఫియా పేట్రేగిపోతోంది. కాదేదీ తవ్వకాలకు అనర్హమన్నట్టు నదులు,కాలువలు,చెరువులు వేటినీ వదలకుండా ఊడ్చేస్తున్నారు. వంతెనలకు ప్రమాదం పొంచి ఉన్నా...భూగర్భజలాలు అడుగంటిపోతున్నా పట్టించుకోవడం లేదు. జిల్లాలో నిర్మాణాలు పెరగడంతో ఇసుకకు ఎక్కడాలేని డిమాండ్‌తో ఒక్కో లారీ రూ.20వేల నుంచి రూ.25వేల వరకు అమ్ముడుపోతోంది. ఈ వ్యాపారులకు కొందరు అధికారపార్టీ నేతల అండదండలు ఉండడంతో అధికారులు కళ్లప్పగించి చూస్తున్నారు. దీంతో జిల్లాలో నెలకు రూ.40కోట్లకుపైగా ఇసుక వ్యాపారం సాగిపోతోంది. సాక్షి, విశాఖపట్నం : ప్రస్తుతం జిల్లాలో ఎక్కడికక్కడ అపార్ట్మెంట్లు, ఇళ్ల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. దీంతో ఇసుకకు డిమాండ్ ఏర్పడింది. అధికారికంగా ఇసుక తవ్వకాలపై నిషేధం ఉంది. ఈమేరకు పలువురు దొంగతనంగా తవ్వకాలకు పాల్పడుతున్నారు. జిల్లాలోని శారదా,తాండవ నదులతోపాటు కోనాం, కల్యాణపులోవ ,గంభీరం ,బొడ్డేరు, తాచేరు, రైవాడ, మేఘాద్రిగెడ్డ జలాశయాల్లో లక్షలాది క్యూబిక్ మీటర్ల ఇసుక నిల్వలున్నాయి. వీటిని పొక్లెయిన్లతో గుట్టుగా తవ్వి వేలల్లో విక్రయిస్తున్నారు. శారద, తాండవ పెద్దేరు, బొడ్డేరు, తాచేరు నదుల్లో దాదాపు ఇసుక నిల్వలు అయిపోయాయి. ఇప్పుడు ఇసుకమాఫియా దృష్టి మాకవరపాలెం.నక్కపల్లి,చోడవరం, అనకాపల్లి, ఏజెన్సీ ప్రాంతంలో నదులు, చెరువులపై పడింది. రోజూ లారీలు,ట్రాక్టర్లతో ఇసుక తరలిస్తున్నారు. జిల్లాలోని 18 మండలాల్లో ఈ విధానం పెద్ద ఎత్తున సాగుతోందని అధికారులే అనధికారికంగా వివరిస్తున్నారు. ఒక్కో మండలంలో నెలకు రూ.కోటి నుంచి రూ.5 కోట్ల వరకు ఇసుక వ్యాపారం సాగుతోంది. రాత్రికిరాత్రి పొక్లెయిన్లతో ఇసుకను తవ్వి తెల్లారేసరికి తరలించేస్తున్నారు. శారదానది పరిధిలో ఇది ఎక్కువగా జరుగుతోంది. అధికారులు అడ్డుకునే ప్రయత్నం చేస్తే వారిపై దాడికి కూడా తవ్వకం, తరలింపుదారులు వెనుకాడడంలేదు. దేవరాపల్లిలో ఓ రెవెన్యూ అధికారిపై దాడి, శారదానదిలో ఇసుక తవ్వకాలను అడ్డుకునేందుకు వెళ్లిన అదనపు రెవిన్యూ ఇన్స్పెక్టర్, ఇతర సిబ్బందిపై దాడి సంఘటనలు ఈ కోవకే చెందుతాయి. చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లో గనులు, విజిలెన్స్శాఖల అధికారులను లారీలతో మట్టించేస్తామంటూ బె దిరించడం విశేషం. ఆయా మండలాల్లో అధికారపార్టీ నేతల అడందండలతోనే కొందరు ఇలా తెగబడుతున్నారన్న వాదన ఉంది. నక్కపల్లి,పాయకరావుపేట పరిధిలో కొందరు సముద్రపు ఇసుకను నది ఇసుకతో కలిపి విక్రయిస్తుండడం ఇసుక మాఫియా తీరుకు అద్దంపడుతోంది. అడ్డుకట్ట వేస్తారా? గతంలో జిల్లాలో అధికారికంగా ఆరు ఇసుక రీచ్లుండేవి. వీటికి వేలం వేస్తే రూ.2 నుంచి రూ.4.5 కోట్ల వరకు ఆదాయం వచ్చేది. అయితే పర్యావరణ సమస్యలు దృష్ట్యా సుప్రీం,హైకోర్టులు తవ్వకాలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం ఇసుక అక్రమాల నివారణకు రీచ్‌లకు వేలంపాటలు నిర్వహిస్తామంటోంది. కానీ ఇది ఆచరణ రూపం దాల్చడం లేదు. దీంతో ఇసుక మాఫియా మరింత అడ్డగోలుగా తవ్వకాలు చేపట్టి ఇప్పటి నుంచే భారీగా నిల్వ చేస్తున్నారు. అడ్డుకున్న రైతుపై వ్యాపారుల దాడి చోడవరం టౌన్: అక్రమంగా ఇసుక తరలింపును అడ్డుకున్న గ్రామస్తునిపై వ్యాపారులు మూకుమ్మడిగా దాడి చేశారు. మండలంలోని గవరవరంలో మంగళవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. శారదానది నుంచి నిత్యం టైరు బళ్లతో ఇసుక తరలిస్తున్నారు. గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త గొల్లవిల్లి రామకృష్ణ అడ్డుకున్నాడు. టైరుబళ్లదారులు మూకుమ్మడిగా దాడి చేసి రామకృష్ణను గాయపరిచారు. బాధితుడు చోడవరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చప్పగడ్డి సింహాచలంనాయుడు(గారిబాబు), చప్పగడ్డి కాశీరావు, తాతబాబు, లక్ష్మణరావు, అవతారం, దారపు రాము, తాటికొండ అవతారం, జొన్నపల్లి చినవెంకటరమణ, జొన్నపల్లి అప్పారావు, మజ్జినాయుడు, బొబ్బిలి అప్పారావు, బొబ్బిలి దేముళ్లు తదితరులపై ఫిర్యాదు చేశాడు.