- పేట్రేగిపోతున్న ఇసుక మాఫియా
- నదులు, చెరువులకూ అడ్డంగా తూట్లు
- రూ.40 కోట్లకు పైగానే లావాదేవీలు
- వ్యాపారులకు అధికారపార్టీ నేతల వత్తాసు
జిల్లాలో ఇసుక మాఫియా పేట్రేగిపోతోంది. కాదేదీ తవ్వకాలకు అనర్హమన్నట్టు నదులు,కాలువలు,చెరువులు వేటినీ వదలకుండా ఊడ్చేస్తున్నారు. వంతెనలకు ప్రమాదం పొంచి ఉన్నా...భూగర్భజలాలు అడుగంటిపోతున్నా పట్టించుకోవడం లేదు. జిల్లాలో నిర్మాణాలు పెరగడంతో ఇసుకకు ఎక్కడాలేని డిమాండ్‌తో ఒక్కో లారీ రూ.20వేల నుంచి రూ.25వేల వరకు అమ్ముడుపోతోంది. ఈ వ్యాపారులకు కొందరు అధికారపార్టీ నేతల అండదండలు ఉండడంతో అధికారులు కళ్లప్పగించి చూస్తున్నారు. దీంతో జిల్లాలో నెలకు రూ.40కోట్లకుపైగా ఇసుక వ్యాపారం సాగిపోతోంది.
సాక్షి, విశాఖపట్నం : ప్రస్తుతం జిల్లాలో ఎక్కడికక్కడ అపార్ట్‌మెంట్లు, ఇళ్ల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. దీంతో ఇసుకకు డిమాండ్ ఏర్పడింది. అధికారికంగా ఇసుక తవ్వకాలపై నిషేధం ఉంది. ఈమేరకు పలువురు దొంగతనంగా తవ్వకాలకు పాల్పడుతున్నారు. జిల్లాలోని శారదా,తాండవ నదులతోపాటు కోనాం, కల్యాణపులోవ ,గంభీరం ,బొడ్డేరు, తాచేరు, రైవాడ, మేఘాద్రిగెడ్డ జలాశయాల్లో లక్షలాది క్యూబిక్ మీటర్ల ఇసుక నిల్వలున్నాయి. వీటిని పొక్లెయిన్లతో గుట్టుగా తవ్వి వేలల్లో విక్రయిస్తున్నారు. శారద, తాండవ పెద్దేరు, బొడ్డేరు, తాచేరు నదుల్లో దాదాపు ఇసుక నిల్వలు అయిపోయాయి.
ఇప్పుడు ఇసుకమాఫియా దృష్టి మాకవరపాలెం.నక్కపల్లి,చోడవరం, అనకాపల్లి, ఏజెన్సీ ప్రాంతంలో నదులు, చెరువులపై పడింది. రోజూ లారీలు,ట్రాక్టర్‌లతో ఇసుక తరలిస్తున్నారు. జిల్లాలోని 18 మండలాల్లో ఈ విధానం పెద్ద ఎత్తున సాగుతోందని అధికారులే అనధికారికంగా వివరిస్తున్నారు. ఒక్కో మండలంలో నెలకు రూ.కోటి నుంచి రూ.5 కోట్ల వరకు ఇసుక వ్యాపారం సాగుతోంది. రాత్రికిరాత్రి పొక్లెయిన్లతో ఇసుకను తవ్వి తెల్లారేసరికి తరలించేస్తున్నారు.
శారదానది పరిధిలో ఇది ఎక్కువగా జరుగుతోంది. అధికారులు అడ్డుకునే ప్రయత్నం చేస్తే వారిపై దాడికి కూడా తవ్వకం, తరలింపుదారులు వెనుకాడడంలేదు. దేవరాపల్లిలో ఓ రెవెన్యూ అధికారిపై దాడి, శారదానదిలో ఇసుక తవ్వకాలను అడ్డుకునేందుకు వెళ్లిన అదనపు రెవిన్యూ ఇన్‌స్పెక్టర్, ఇతర సిబ్బందిపై దాడి సంఘటనలు ఈ కోవకే చెందుతాయి.
చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లో గనులు, విజిలెన్స్‌శాఖల అధికారులను లారీలతో మట్టించేస్తామంటూ బె దిరించడం విశేషం. ఆయా మండలాల్లో అధికారపార్టీ నేతల అడందండలతోనే కొందరు ఇలా తెగబడుతున్నారన్న వాదన ఉంది. నక్కపల్లి,పాయకరావుపేట పరిధిలో కొందరు సముద్రపు ఇసుకను నది ఇసుకతో కలిపి విక్రయిస్తుండడం ఇసుక మాఫియా తీరుకు అద్దంపడుతోంది.
అడ్డుకట్ట వేస్తారా?
గతంలో జిల్లాలో అధికారికంగా ఆరు ఇసుక రీచ్‌లుండేవి. వీటికి వేలం వేస్తే రూ.2 నుంచి రూ.4.5 కోట్ల వరకు ఆదాయం వచ్చేది. అయితే పర్యావరణ సమస్యలు దృష్ట్యా సుప్రీం,హైకోర్టులు తవ్వకాలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం ఇసుక అక్రమాల నివారణకు రీచ్‌లకు వేలంపాటలు నిర్వహిస్తామంటోంది. కానీ ఇది ఆచరణ రూపం దాల్చడం లేదు. దీంతో ఇసుక మాఫియా మరింత అడ్డగోలుగా తవ్వకాలు చేపట్టి ఇప్పటి నుంచే భారీగా నిల్వ చేస్తున్నారు.
అడ్డుకున్న రైతుపై వ్యాపారుల దాడి
చోడవరం టౌన్: అక్రమంగా ఇసుక తరలింపును అడ్డుకున్న గ్రామస్తునిపై వ్యాపారులు మూకుమ్మడిగా దాడి చేశారు. మండలంలోని గవరవరంలో మంగళవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. శారదానది నుంచి నిత్యం టైరు బళ్లతో ఇసుక తరలిస్తున్నారు. గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త గొల్లవిల్లి రామకృష్ణ అడ్డుకున్నాడు. టైరుబళ్లదారులు మూకుమ్మడిగా దాడి చేసి రామకృష్ణను గాయపరిచారు. బాధితుడు చోడవరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
చప్పగడ్డి సింహాచలంనాయుడు(గారిబాబు), చప్పగడ్డి కాశీరావు, తాతబాబు, లక్ష్మణరావు, అవతారం, దారపు రాము, తాటికొండ అవతారం, జొన్నపల్లి చినవెంకటరమణ, జొన్నపల్లి అప్పారావు, మజ్జినాయుడు, బొబ్బిలి అప్పారావు, బొబ్బిలి దేముళ్లు తదితరులపై ఫిర్యాదు చేశాడు.