ప్రమాదస్థాయికి జలాశయాలు
2వేల క్యూసెక్కుల నీరు వివిధ నదుల్లోకి విడుదల
పొంగి ప్రవహిస్తున్న శారద,పెద్దేరు,బొడ్డేరు
చోడవరం : పదిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలన్నీ నిండుకుండలను తలపిస్తున్నాయి. పరీవాహక ప్రాంతాల్లో వర్షాలతో పెద్ద ఎత్తున ఇన్‌ఫ్లో వచ్చిపడుతోంది. ఒక్కసారిగా జిల్లాలోని రైవాడ, కోనాం, పెద్దేరు, కల్యాణపులోవ రిజర్వాయర్లలో నీటి మట్టాలు ప్రమాద స్థాయికి చేరాయి. దీంతో అన్నింటి గేట్లు ఎత్తి వందలాది క్యూసెక్కుల నీటిని నదుల్లోకి విడిచిపెడుతున్నారు. పాలగెడ్డ, గొర్లెగెడ్డ, ఉరకగెడ్డ, తారకరామ,గుండుబాడు మినీ రిజర్వాయర్లలోనూ వరద నీరు ఉరకలు వేస్తోంది. శనివారం రైవాడ జలాశయం మూడు గేట్లు ఎత్తి 800క్యూసెక్కుల నీటిని శారదానదిలోకి వదిలారు. శారదానది పొంగి ప్రవహిస్తోంది.
కల్యాణపులోవ రిజర్వాయర్ రెండు గేట్లు ఎత్తి 200 క్యూసెక్కుల నీరు, కోనాం జలాశయం ఒక గేటు ఎత్తి 500 క్యూసెక్కులు బొడ్డేరు నదిలోకి,పెద్దేరు రెండు గేట్లు ఎత్తి 500క్యూసెక్కులు నీరు పెద్దేరు నదిలోకి విడుదల చేస్తున్నారు. శారద,పెద్దేరు, బొడ్డేరు, తాచేరు నదులు నీటితో కళకళలాడుతున్నాయి. రిజర్వాయర్ల పరిధిలో సుమారు లక్ష ఎకరాల సాగు భూమి ఉంది. ఈ ఖరీఫ్‌కు నీటి ఇబ్బందులు ఉండవని రైతులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.