share of taxes
-
మరోసారి మొండిచేయి
సాక్షి, అమరావతి/న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ తాజా బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు మళ్లీ నిరాశే ఎదురైంది. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరంను తీవ్ర నిరుత్సాహపర్చింది. కేంద్ర పన్నుల వాటా నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో భారీ కోత పడింది. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర పన్నుల వాటాలో రాష్ట్రాలకు 42 శాతం ఇవ్వాలని ఉండగా ఆ ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పూర్తిస్థాయి బడ్జెట్లో రూ.34,833.18 కోట్లు కేటాయించింది. కానీ, ఇప్పుడు సవరించిన అంచనా మేరకు కేంద్ర పన్నుల వాటా నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులు కేవలం రూ.28,242.39 కోట్లేనని కేంద్రం పేర్కొంది. అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర పన్నుల వాటా నుంచి వస్తాయనుకున్న నిధుల్లో రూ.6,590.79 కోట్ల మేర కోత పడింది. మరోపక్క.. వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో కేంద్ర పన్నుల వాటా నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులను 4.11 శాతానికి తగ్గించేయడం విచిత్రంగా ఉంది. ఇందులో భాగంగా వచ్చే ఆర్థిక ఏడాదికి రాష్ట్రానికి రూ.32,237.68 కోట్లు వస్తాయని కేంద్రం పేర్కొంది. రెవెన్యూ లోటు భర్తీ కూడా లేదు రాష్ట్ర విభజన అనంతరం ఏపీ వరుసగా ప్రతీ ఏడాది రెవెన్యూ లోటులో ఉంటున్న నేపథ్యంలో వచ్చే ఐదేళ్లపాటు కూడా రెవెన్యూ లోటులోనే ఉంటుందని.. ఇందుకు గ్రాంటును సిఫార్సు చేయాల్సిందిగా 15వ ఆర్థిక సంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దీంతో 2020–21 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ లోటు భర్తీ కింద రూ.5,897 కోట్లు మంజూరు చేయాలని 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. కానీ, బడ్జెట్లో ఇందుకు ఎలాంటి కేటాయింపులు చేయలేదు. పలు సందర్భాల్లో ప్రత్యేక హోదాతో పాటు వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతూ వస్తున్నా ఈసారి బడ్జెట్లో కూడా రాష్ట్రానికి కేంద్రం తీవ్ర నిరాశే మిగిల్చింది. పోలవరం, రాజధానికీ కేటాయింపుల్లేవు పోలవరం ప్రాజెక్టుకు గత ఆర్థిక ఏడాది (2018–19), ప్రస్తుత ఆర్థిక ఏడాది బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులు చేయలేదు. ఈ బడ్జెట్లోనూ మొండిచెయ్యే చూపింది. అలాగే.. - రాజధాని నిర్మాణానికి ఇప్పటివరకు రూ.1,500 కోట్లు ఇవ్వగా ఇంకా రూ.వెయ్యి కోట్లు ఇస్తామని కేంద్రం ప్రకటించింది. ఆ మొత్తాన్నీ బడ్జెట్లో పొందపర్చలేదు. - రాష్ట్రంలో వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమలోని ఏడు జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ కింద కేంద్రం నిధులు ఇవ్వాల్సి ఉండగా ఆ విషయాన్నీ బడ్జెట్లో అస్సలు ప్రస్తావించలేదు. - దుగరాజపట్నం పోర్టుకు యోగ్యత లేని పక్షంలో ప్రత్యామ్నాయంగా రామాయపట్నం పోర్టు అభివృద్ధి, వైఎస్సార్ కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు, విశాఖ–చెన్నై కారిడార్, బెంగళూరు–చెన్నై కారిడార్‌ను కూడా కేంద్రం ఉసూరుమనిపించింది. జాతీయ విద్యా సంస్థలకు అరకొరగా.. పునర్విభజన చట్టంలో పొందుపరిచిన జాతీయ విద్యా సంస్థలకు మాత్రం కేంద్రం అరకొరగా నిధులు కేటాయించింది. ఇందులో భాగంగా.. కేంద్రీయ, గిరిజన విశ్వవిద్యాలయానికి స్వల్పంగా కేటాయింపులు పెరిగాయి. ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ వర్సిటీకి రూ.60.35 కోట్లు, గిరిజన విశ్వవిద్యాలయానికి రూ.26.90 కోట్లు, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (ఐఐపీఈ)కి రూ.31.82 కోట్లు కేటాయించారు. దేశవ్యాప్తంగా నూతన ఐఐటీలకు రూ. 7,182 కోట్లు, ఐఐఎంలకు రూ. 476 కోట్లు, ఎన్ఐటీలకు రూ. 3,885 కోట్లు, ఐఐఎస్ఈఆర్ సంస్థలకు రూ. 896 కోట్లు, ఐఐఐటీలకు రూ. 226.35 కోట్లు కేటాయించారు. వీటిల్లోనే ఏపీలోని సంస్థలకు కూడా కలిసి ఉన్నాయని బడ్జెట్ అంచనాల్లో ప్రస్తావించారు. ఇక ఐఐటీ, ఐఐఎం, ఎన్ఐటీ, ఐఐఎస్ఈఆర్, ఐఐఐటీ తదితర జాతీయ విద్యా సంస్థలకూ నిర్ధిష్ట కేటాయింపులు చేయలేదు. అలాగే, మౌలిక వసతుల ప్రాజెక్టుల గురించి.. పారిశ్రామికాభివృద్ధికి ఇవ్వాల్సిన రాయితీలను ఎక్కడా ప్రస్తావించలేదు. విశాఖలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్ నిర్మాణం.. విశాఖ, విజయవాడ నగరాల్లో మెట్రో రైలు, ఎయిమ్స్‌కు నిర్ధిష్ట కేటాయింపుల్లేవు. మౌలిక ప్రాజెక్టులు రాష్ట్రానికి చేరేనా? దేశవ్యాప్తంగా మౌలిక వసతుల ప్రాజెక్టుల అమలు లక్ష్యంగా రూ.103 లక్షల కోట్ల వ్యయం కాగల ప్రాజెక్టులు ప్రారంభ దశలో ఉన్నాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్లో ప్రకటించారు. వీటిలో రాష్ట్రాల వారీగా నిర్ధిష్ట వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. అలాగే, తాజా బడ్జెట్లో రూ.1.72 లక్షల కోట్ల మేర రవాణా మౌలిక వసతుల స్థాపనకు వెచ్చిస్తామని ఆమె తెలిపారు. వీటిలో కూడా రాష్ట్రానికి ఏ మేరకు ప్రాజెక్టులు రానున్నాయో అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు.. దేశవ్యాప్తంగా 200 లక్షల టన్నుల మత్స్య సంపద ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నామని కేంద్ర ఆర్థికమంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. సుదీర్ఘ కోస్తా తీరం ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు ఇది మేలు చేసే అవకాశంగా ఉంది. ఇలా మొత్తం మీద ఏ విధంగా చూసినా రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్లో తీరని అన్యాయం జరిగిందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. పెద్దపీట వేయడమంటే ఇలాగేనా? 2019–20లో సబ్సిడీలకు రూ.3,38,153.67 కోట్లు కేటాయిస్తే అందులో ఖర్చు చేసింది రూ.2,63,557.33 కోట్లు. 2020–21కి ఆహార, ఎరువుల సబ్సిడీలు తగ్గించి రూ.2,62,108.76 కోట్లు మాత్రమే కేటాయించారు. దృష్టి సారించాల్సిన వ్యవసాయ యాంత్రీకరణను విస్మరించారు. విధాన పరమైన కేటాయింపులు పెంచకుండా కిసాన్ రైలు వేస్తామని చెప్పి దేశవ్యాప్తంగా 26 లక్షల సోలార్ పుంపు సెట్లు ఏర్పాటు చేస్తామనడమే వ్యవసాయానికి పెద్దపీట వెయ్యడమా? – ఎంవీఎస్ నాగిరెడ్డి, వైస్ చైర్మన్, ఏపీ రాష్ట్ర వ్యవసాయ మిషన్ -
ప్రత్యేక హోదా శకం ముగిసింది
* కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ వెల్లడి * కేంద్రం-రాష్ట్రాల మధ్య 14వ ఆర్థిక సంఘం పన్నుల వాటాలను నిర్ధారించింది * బిహార్ సీఎం నితీశ్ డిమాండ్‌పై మంత్రి స్పందన * అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తమదేనని ధీమా పట్నా: రాష్ట్రాలకు ప్రత్యేక హోదా శకం ముగిసిపోయిందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ స్పష్టంచేశారు. 14వ ఆర్థిక సంఘం కేంద్రం, రాష్ట్రాల మధ్య పన్నుల వాటాను నిర్ధారించిన తర్వాత ఇక ప్రత్యేక హోదా అన్న అంశానికి కాలం చెల్లినట్టేనని చెప్పారు. గురువారం పట్నాలో విలేకరులతో మాట్లాడారు. గతంలో ఈశాన్య రాష్ట్రాలకు ప్రకటించిన ప్రత్యేక హోదా ఎప్పట్లాగే కొనసాగుతుందని ఇటీవల వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన విషయం గమనార్హం. బిహార్‌కు ప్రత్యేక హోదా ప్రకటించాలన్న ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ డిమాండ్‌పై స్పందిస్తూ జైట్లీ ఈ వ్యాఖ్యలు చేశారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని కూటమి విజయదుందుభి మోగిస్తుందని జైట్లీ చెప్పారు. ఇప్పటివరకు జరిగిన మూడు విడతల ఎన్నికల్లో పరిస్థితి ఎన్డీఏకు అనుకూలంగా ఉన్నట్టు గత అనుభవాల ద్వారా తాను అంచనాకు వచ్చినట్టు తెలిపారు. రానున్న రెండు విడతల ఎన్నికల్లో కూడా ఇదే ధోరణి ఉంటుందని వివరించారు. మోదీకి ప్రజల్లో ఉన్న ఆదరణ, ఆయన నాయకత్వంపై నమ్మకం బీజేపీ కూటమిని విజయతీరాల వైపు నడిపిస్తుందన్నారు. కేంద్రంతో సఖ్యత గా ఉంటూ, రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపే ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. అది నిరాశావాదుల కూటమి: నితీశ్ కుమార్ నేతృత్వంలోని మహా కూటమిని ‘నిరాశావాదుల కూటమి’ అని జైట్లీ ఎద్దేవా చేశారు. ఆ కూటమిలోని కాంగ్రెస్ రాష్ట్రంలో ఉనికి కోసం పోరాడుతోందన్నారు. ఆర్జేడీది కుటుంబ పార్టీ అని విమర్శించారు. ఇక జే డీయూ నేత, సీఎం నితీశ్ కుమార్ పచ్చి అవకాశవాది అని దుయ్యబట్టారు. ఆయన రాజకీయ జీవితానికి ఇవే చివరి ఎన్నికలని పేర్కొన్నా రు. నితీశ్ తన గోతి తానే తవ్వుకున్నారన్నారు. ఇన్నాళ్లూ తమ బలంతో కారు నడిపి డ్రైవర్ సీట్లో కూర్చున్నారని, ఇప్పుడు తమను వదిలేసి వెళ్లారన్నారు. దాణా కుంభకోణంలో లాలు దోషి అని తేలిన వెంటనే, ఇక ఆయన జైలుకే పరిమితమవుతారన్న ఉద్దేశంతో కొందరు ఆర్జేడీ నేతలను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారన్నారు. ఇప్పుడు ఉనికి కోసం మళ్లీ ఆ పార్టీతోనే జట్టుకట్టి డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. అభివృద్ధిని, ప్రజల నమ్మకాన్ని గంగలో కలిపి ఆర్జేడీ, కాంగ్రెస్‌తో చేతులు కలిపారని దుయ్యబట్టారు. కుల రాజకీయాలను వ్యతిరేకిస్తూ యువత తీర్పు ఇవ్వబోతోందన్నారు. యువత మద్దతుతో రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. -
ఆంధ్రా ఆదాయం రూ.60 వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మిగతా పది నెలల్లో అన్ని రకాల ఆదాయం కలిపి రూ.60 వేల కోట్లు రానున్నట్లు అధికార వర్గాలు అంచనా వేశాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెవెన్యూ మిగుల్లో ఉండగా, ద్రవ్య లోటు కూడా నిబంధనలకు మించకుండా రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో మూడు శాతం లోపే ఉండేది. విభజన తర్వాత ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మిగతా పది నెలల్లో ఆంధ్రప్రదేశ్‌కు ఏ రంగం నుంచి ఎంత ఆదాయం వస్తుంది, కేంద్రం నుంచి పన్నుల వాటా, గ్రాంట్ల రూపంలో ఎంత ఆదాయం వస్తుందో అధికారులు అంచనా వేశారు. రాష్ట్ర సొంత పన్నులు, పన్నేతర, కేంద్ర పన్నుల వాటా, గ్రాంట్ల రూపంలో రూ.60 వేల కోట్లు వస్తాయని అంచనా వేశారు. ఇందులో రాష్ట్ర సొంత పన్నుల రూపంలో రూ.27 వేల కోట్లు, రాష్ట్ర పన్నేతర రంగం ద్వారా రూ.8 వేల కోట్ల ఆదాయం వస్తుందని లెక్కకట్టారు. ఇక కేంద్ర పన్నుల వాటా, గ్రాంట్ల రూపంలో రూ.25 వేల కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేశారు. -
ఖజానాకు గండి!
సాక్షి, హైదరాబాద్: సమైక్య, విభజనోద్యమాల నేపథ్యంలో ఈసారి కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటా రూ.5 వేల కోట్ల మేరకు తగ్గవచ్చని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. కానీ పన్నుల వాటాను పెంచాలన్న రాష్ట్రాల డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుంటే మాత్రం పెద్దగా మార్పు ఉండకపోవచ్చని అంటున్నారు. వివిధ పద్దుల కింద రాష్ట్రాల నుంచి వచ్చే పన్నుల్లో కేంద్రం 33 శాతం తిరిగి రాష్ట్రాలకు కేటాయిస్తుంది. జనాభా తలసరి వినియోగం, ఆదాయంతో పాటు ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ అంశాలను ఇందుకు కొలమానంగా తీసుకుంటుంది. అయితే రాష్ట్రంలో తలసరి ఆదాయం పెరిగిందన్న ప్రణాళిక సంఘం నివేదిక కొంత నిరాశాజనకంగా ఉంది. వరుస ఉద్యమాల కారణంగా ఆర్థిక వ్యవస్థ కూడా గాడితప్పింది. ఫలితంగా ఆర్థిక నిర్వహణ విషయంలోనూ రాష్ట్రానికి ప్రతికూలత తప్పదనే భావిస్తున్నారు. రాష్ట్రాల నుంచి కేంద్రానికి ప్రధానంగా ఆదాయం పన్ను, కస్టమ్స్, సంపద, కార్పొరేట్ పన్నుల రూపేణా ఆదాయం వెళ్తుంది. ఇందులో ఆదాయం పన్ను వాటా రూ. 59,803.36 కోట్లు. కార్పొరేట్ టాక్స్ రూ.1,10,535.36 కోట్లు. కస్టమ్స్ కింద రూ. 55,006.90 కోట్లు, సంపద పన్ను రూ. 39,562 కోట్లు, సెంట్రల్ ఎక్సైజ్ రూ. 37,667.41 కోట్లు, సర్వీస్ టాక్స్ రూ. 385.2 కోట్లుగా ఉంది. ప్రస్తుతం ఉన్న విధానం ప్రకారం మన రాష్ట్రానికి కేంద్ర పన్నుల్లో రూ. 24,132 కోట్లు దక్కుతోంది. అయితే ఈ సంవత్సరం కేంద్రం విధించిన పన్నుల టార్గెట్‌లో రాష్ట్రం నుంచి నాలుగు శాతం తక్కువ వసూళ్లు ఉన్నట్టు అధికారులు విశ్లేషిస్తున్నారు. దీనికి తోడు ఆర్థిక నిర్వహణ సరిగా లేకపోవడంతో తాజా ఆర్థిక సంఘం సిఫార్సుల్లో రాష్ట్రానికి కేంద్ర పన్నుల రాబడి తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. దాదాపు రూ.5 వేల కోట్ల మేర ఆదాయం తగ్గవచ్చని భావిస్తున్నారు. అలా కాకుండా ఆర్థిక నిర్వహణ, తలసరి ఆదాయం అంశాలను పక్కనబెడితే రాష్ట్రానికి కొంత ప్రయోజనం చేకూరే వీలుంది. తలసరి ఆదాయం విషయంలో కేవలం రెండు జిల్లాల్లోనే పురోగతి ఉందని, మిగతా జిల్లాల్లో ఆదాయం తక్కువగా ఉందని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తెలిపింది. నిధుల కేటాయింపులో ఈ రెండు జిల్లాలనే కొలమానంగా తీసుకుని వ్యవహరించవద్దని కోరింది. -
పన్నుల వాటా పెంచండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాలకు కేంద్రం పంపిణీ చేసే పన్నుల వాటా పెంచాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతమిచ్చే 32.7% పన్నుల వాటాను 40 శాతానికి పెంచాలని కోరారు. సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు చేయాలంటే కేంద్రం అధిక నిధులు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వాలను ఆదుకోవాలని అన్నారు. 14వ ఆర్థిక సంఘంతో గురువారం జూబ్లీహాల్లో జరిగిన సమావేశంలో సీఎం మాట్లాడారు. సంఘం చైర్మన్ డాక్టర్ వైవీ రెడ్డి, సభ్యులు అభిజిత్ సేన్, సుష్మానాథ్, గోవిందరావు, కార్యదర్శి సుధీప్తో ముందాలే, మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, రఘువీరారెడ్డి, పితాని సత్యనారాయణ, బాలరాజు, కన్నా లక్ష్మీనారాయణ, సునీతా లక్ష్మారెడ్డి, డీకే అరుణలు హాజరయ్యారు. రాష్ర్ట తలసరి ఆదాయం జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రాష్ట్రానికి రావాల్సిన నిధులు తగ్గిపోతున్నాయని, ఇలా చేయడం రాష్ట్రానికి అన్యాయం చేయడమే అవుతుందని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రంలోని 23 జిల్లాల్లో కేవలం నాలుగు జిల్లాల్లో తలసరి ఆదాయం ఎక్కువగా ఉందని, మిగిలిన 19 జిల్లాల్లో తక్కువే ఉందని పేర్కొన్నారు. జనాభా తగ్గించి, తలసరి ఆదాయం పెంచేలా చేస్తున్నందుకు ప్రోత్సాహకాలు ఇవ్వాల్సిందిపోయి ప్రకృతి వైపరీత్యాల కింద చెల్లించే నష్టపరిహారాన్ని కేంద్రం తక్కువగా ఇవ్వడం సమంజసం కాదన్నారు. ప్రకృతి వైపరీత్యాలకు 2012-13 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.1,886 కోట్లు ఖర్చు చేస్తే.. అందులో కేంద్రం కేవలం 43 శాతం నిధులు మాత్రమే సమకూర్చిందని చెప్పారు. ప్రస్తుతమున్న 75% కేంద్రం, 25% రాష్ట్ర ప్రభుత్వ వాటా నిష్పత్తిని సవరించి 90:10గా చేయాలని సూచించారు. 10వ ఆర్థిక సంఘం సమయంలో రాష్ట్రానికి 7.91%గా ఉన్న పన్నుల బదలాయింపు 13వ ఆర్థిక సంఘానికి వచ్చేసరికి 6.94 శాతానికి తగ్గిపోయిందని, 14వ ఆర్థిక సంఘం ఇదే విధానం అనుసరిస్తే రాష్ట్రానికి కేంద్రం నుంచి పన్నుల బదలాయింపు రూ.20 వేల కోట్ల మేర తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 1971 జనాభా లెక్కల ఆధారంగానే పన్నుల బదలాయింపు విధానం అమలు చేయాలని సీఎం సూచించారు. అలాగే పంట 50 శాతానికిపైగా నష్టపోతేనే నష్టపరిహారం ఇవ్వాలన్న నిబంధనను సవరించాలని, పంట 25 శాతం నష్టపోయినా ఇన్పుట్ సబ్సిడీ చెల్లించడానికి అనుగుణంగా నిబంధనలు మార్చాలని కోరారు. తక్కువ మొత్తంలో ఉన్న కేంద్ర రుణాలు మాఫీ చేయాలని, కొన్నిటిని రీషెడ్యూల్ చేయాలని కోరారు. స్థానిక సంస్థలకు ఇచ్చే గ్రాంట్లను 2% నుంచి 5 శాతానికి పెంచితే అవి త్వరగా అభివృద్ధి చెందడానికి వీలుంటుందన్నారు. ఇలావుండగా.. ప్రధాన రంగాలకు గ్రాంట్ల రూపంలో రూ.30,425 కోట్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంఘాన్ని కోరింది. ముఖ్యంగా షెడ్యూల్డ్ ప్రాంతాల అభివృద్ధికి రూ.11,153 కోట్లు, రహదారులు, వంతెనల నిర్వహణకు రూ.3,000 కోట్లు, గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి పథకాలకు రూ.2,635 కోట్లు, నీటిపారుదల ప్రాజెక్టుల నిర్వహణకు రూ.2,500 కోట్లు, అటవీ పరిరక్షణకు రూ.1,259 కోట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.