ఖజానాకు గండి!
సాక్షి, హైదరాబాద్: సమైక్య, విభజనోద్యమాల నేపథ్యంలో ఈసారి కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటా రూ.5 వేల కోట్ల మేరకు తగ్గవచ్చని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. కానీ పన్నుల వాటాను పెంచాలన్న రాష్ట్రాల డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుంటే మాత్రం పెద్దగా మార్పు ఉండకపోవచ్చని అంటున్నారు. వివిధ పద్దుల కింద రాష్ట్రాల నుంచి వచ్చే పన్నుల్లో కేంద్రం 33 శాతం తిరిగి రాష్ట్రాలకు కేటాయిస్తుంది. జనాభా తలసరి వినియోగం, ఆదాయంతో పాటు ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ అంశాలను ఇందుకు కొలమానంగా తీసుకుంటుంది. అయితే రాష్ట్రంలో తలసరి ఆదాయం పెరిగిందన్న ప్రణాళిక సంఘం నివేదిక కొంత నిరాశాజనకంగా ఉంది. వరుస ఉద్యమాల కారణంగా ఆర్థిక వ్యవస్థ కూడా గాడితప్పింది. ఫలితంగా ఆర్థిక నిర్వహణ విషయంలోనూ రాష్ట్రానికి ప్రతికూలత తప్పదనే భావిస్తున్నారు. రాష్ట్రాల నుంచి కేంద్రానికి ప్రధానంగా ఆదాయం పన్ను, కస్టమ్స్, సంపద, కార్పొరేట్ పన్నుల రూపేణా ఆదాయం వెళ్తుంది.
ఇందులో ఆదాయం పన్ను వాటా రూ. 59,803.36 కోట్లు. కార్పొరేట్ టాక్స్ రూ.1,10,535.36 కోట్లు. కస్టమ్స్ కింద రూ. 55,006.90 కోట్లు, సంపద పన్ను రూ. 39,562 కోట్లు, సెంట్రల్ ఎక్సైజ్ రూ. 37,667.41 కోట్లు, సర్వీస్ టాక్స్ రూ. 385.2 కోట్లుగా ఉంది. ప్రస్తుతం ఉన్న విధానం ప్రకారం మన రాష్ట్రానికి కేంద్ర పన్నుల్లో రూ. 24,132 కోట్లు దక్కుతోంది. అయితే ఈ సంవత్సరం కేంద్రం విధించిన పన్నుల టార్గెట్‌లో రాష్ట్రం నుంచి నాలుగు శాతం తక్కువ వసూళ్లు ఉన్నట్టు అధికారులు విశ్లేషిస్తున్నారు. దీనికి తోడు ఆర్థిక నిర్వహణ సరిగా లేకపోవడంతో తాజా ఆర్థిక సంఘం సిఫార్సుల్లో రాష్ట్రానికి కేంద్ర పన్నుల రాబడి తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. దాదాపు రూ.5 వేల కోట్ల మేర ఆదాయం తగ్గవచ్చని భావిస్తున్నారు. అలా కాకుండా ఆర్థిక నిర్వహణ, తలసరి ఆదాయం అంశాలను పక్కనబెడితే రాష్ట్రానికి కొంత ప్రయోజనం చేకూరే వీలుంది. తలసరి ఆదాయం విషయంలో కేవలం రెండు జిల్లాల్లోనే పురోగతి ఉందని, మిగతా జిల్లాల్లో ఆదాయం తక్కువగా ఉందని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తెలిపింది. నిధుల కేటాయింపులో ఈ రెండు జిల్లాలనే కొలమానంగా తీసుకుని వ్యవహరించవద్దని కోరింది.