ప్రత్యేక హోదా శకం ముగిసింది
* కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ వెల్లడి
* కేంద్రం-రాష్ట్రాల మధ్య 14వ ఆర్థిక సంఘం పన్నుల వాటాలను నిర్ధారించింది
* బిహార్ సీఎం నితీశ్ డిమాండ్‌పై మంత్రి స్పందన
* అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తమదేనని ధీమా
పట్నా: రాష్ట్రాలకు ప్రత్యేక హోదా శకం ముగిసిపోయిందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ స్పష్టంచేశారు. 14వ ఆర్థిక సంఘం కేంద్రం, రాష్ట్రాల మధ్య పన్నుల వాటాను నిర్ధారించిన తర్వాత ఇక ప్రత్యేక హోదా అన్న అంశానికి కాలం చెల్లినట్టేనని చెప్పారు.
గురువారం పట్నాలో విలేకరులతో మాట్లాడారు. గతంలో ఈశాన్య రాష్ట్రాలకు ప్రకటించిన ప్రత్యేక హోదా ఎప్పట్లాగే కొనసాగుతుందని ఇటీవల వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన విషయం గమనార్హం. బిహార్‌కు ప్రత్యేక హోదా ప్రకటించాలన్న ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ డిమాండ్‌పై స్పందిస్తూ జైట్లీ ఈ వ్యాఖ్యలు చేశారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని కూటమి విజయదుందుభి మోగిస్తుందని జైట్లీ చెప్పారు.
ఇప్పటివరకు జరిగిన మూడు విడతల ఎన్నికల్లో పరిస్థితి ఎన్డీఏకు అనుకూలంగా ఉన్నట్టు గత అనుభవాల ద్వారా తాను అంచనాకు వచ్చినట్టు తెలిపారు. రానున్న రెండు విడతల ఎన్నికల్లో కూడా ఇదే ధోరణి ఉంటుందని వివరించారు. మోదీకి ప్రజల్లో ఉన్న ఆదరణ, ఆయన నాయకత్వంపై నమ్మకం బీజేపీ కూటమిని విజయతీరాల వైపు నడిపిస్తుందన్నారు. కేంద్రంతో సఖ్యత గా ఉంటూ, రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపే ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.
అది నిరాశావాదుల కూటమి: నితీశ్ కుమార్ నేతృత్వంలోని మహా కూటమిని ‘నిరాశావాదుల కూటమి’ అని జైట్లీ ఎద్దేవా చేశారు. ఆ కూటమిలోని కాంగ్రెస్ రాష్ట్రంలో ఉనికి కోసం పోరాడుతోందన్నారు. ఆర్జేడీది కుటుంబ పార్టీ అని విమర్శించారు. ఇక జే డీయూ నేత, సీఎం నితీశ్ కుమార్ పచ్చి అవకాశవాది అని దుయ్యబట్టారు. ఆయన రాజకీయ జీవితానికి ఇవే చివరి ఎన్నికలని పేర్కొన్నా రు. నితీశ్ తన గోతి తానే తవ్వుకున్నారన్నారు. ఇన్నాళ్లూ తమ బలంతో కారు నడిపి డ్రైవర్ సీట్లో కూర్చున్నారని, ఇప్పుడు తమను వదిలేసి వెళ్లారన్నారు.
దాణా కుంభకోణంలో లాలు దోషి అని తేలిన వెంటనే, ఇక ఆయన జైలుకే పరిమితమవుతారన్న ఉద్దేశంతో కొందరు ఆర్జేడీ నేతలను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారన్నారు. ఇప్పుడు ఉనికి కోసం మళ్లీ ఆ పార్టీతోనే జట్టుకట్టి డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. అభివృద్ధిని, ప్రజల నమ్మకాన్ని గంగలో కలిపి ఆర్జేడీ, కాంగ్రెస్‌తో చేతులు కలిపారని దుయ్యబట్టారు. కుల రాజకీయాలను వ్యతిరేకిస్తూ యువత తీర్పు ఇవ్వబోతోందన్నారు. యువత మద్దతుతో రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు.