సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాలకు కేంద్రం పంపిణీ చేసే పన్నుల వాటా పెంచాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతమిచ్చే 32.7% పన్నుల వాటాను 40 శాతానికి పెంచాలని కోరారు. సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు చేయాలంటే కేంద్రం అధిక నిధులు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వాలను ఆదుకోవాలని అన్నారు. 14వ ఆర్థిక సంఘంతో గురువారం జూబ్లీహాల్‌లో జరిగిన సమావేశంలో సీఎం మాట్లాడారు. సంఘం చైర్మన్ డాక్టర్ వైవీ రెడ్డి, సభ్యులు అభిజిత్ సేన్, సుష్మానాథ్, గోవిందరావు, కార్యదర్శి సుధీప్తో ముందాలే, మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, రఘువీరారెడ్డి, పితాని సత్యనారాయణ, బాలరాజు, కన్నా లక్ష్మీనారాయణ, సునీతా లక్ష్మారెడ్డి, డీకే అరుణలు హాజరయ్యారు. రాష్ర్ట తలసరి ఆదాయం జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రాష్ట్రానికి రావాల్సిన నిధులు తగ్గిపోతున్నాయని, ఇలా చేయడం రాష్ట్రానికి అన్యాయం చేయడమే అవుతుందని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రంలోని 23 జిల్లాల్లో కేవలం నాలుగు జిల్లాల్లో తలసరి ఆదాయం ఎక్కువగా ఉందని, మిగిలిన 19 జిల్లాల్లో తక్కువే ఉందని పేర్కొన్నారు.
జనాభా తగ్గించి, తలసరి ఆదాయం పెంచేలా చేస్తున్నందుకు ప్రోత్సాహకాలు ఇవ్వాల్సిందిపోయి ప్రకృతి వైపరీత్యాల కింద చెల్లించే నష్టపరిహారాన్ని కేంద్రం తక్కువగా ఇవ్వడం సమంజసం కాదన్నారు. ప్రకృతి వైపరీత్యాలకు 2012-13 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.1,886 కోట్లు ఖర్చు చేస్తే.. అందులో కేంద్రం కేవలం 43 శాతం నిధులు మాత్రమే సమకూర్చిందని చెప్పారు. ప్రస్తుతమున్న 75% కేంద్రం, 25% రాష్ట్ర ప్రభుత్వ వాటా నిష్పత్తిని సవరించి 90:10గా చేయాలని సూచించారు. 10వ ఆర్థిక సంఘం సమయంలో రాష్ట్రానికి 7.91%గా ఉన్న పన్నుల బదలాయింపు 13వ ఆర్థిక సంఘానికి వచ్చేసరికి 6.94 శాతానికి తగ్గిపోయిందని, 14వ ఆర్థిక సంఘం ఇదే విధానం అనుసరిస్తే రాష్ట్రానికి కేంద్రం నుంచి పన్నుల బదలాయింపు రూ.20 వేల కోట్ల మేర తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
1971 జనాభా లెక్కల ఆధారంగానే పన్నుల బదలాయింపు విధానం అమలు చేయాలని సీఎం సూచించారు. అలాగే పంట 50 శాతానికిపైగా నష్టపోతేనే నష్టపరిహారం ఇవ్వాలన్న నిబంధనను సవరించాలని, పంట 25 శాతం నష్టపోయినా ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లించడానికి అనుగుణంగా నిబంధనలు మార్చాలని కోరారు. తక్కువ మొత్తంలో ఉన్న కేంద్ర రుణాలు మాఫీ చేయాలని, కొన్నిటిని రీషెడ్యూల్ చేయాలని కోరారు. స్థానిక సంస్థలకు ఇచ్చే గ్రాంట్లను 2% నుంచి 5 శాతానికి పెంచితే అవి త్వరగా అభివృద్ధి చెందడానికి వీలుంటుందన్నారు. ఇలావుండగా.. ప్రధాన రంగాలకు గ్రాంట్ల రూపంలో రూ.30,425 కోట్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంఘాన్ని కోరింది. ముఖ్యంగా షెడ్యూల్డ్ ప్రాంతాల అభివృద్ధికి రూ.11,153 కోట్లు, రహదారులు, వంతెనల నిర్వహణకు రూ.3,000 కోట్లు, గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి పథకాలకు రూ.2,635 కోట్లు, నీటిపారుదల ప్రాజెక్టుల నిర్వహణకు రూ.2,500 కోట్లు, అటవీ పరిరక్షణకు రూ.1,259 కోట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.
పన్నుల వాటా పెంచండి
Published Fri, Sep 13 2013 2:01 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
Advertisement
Advertisement