shares buyback
-
కావేరీ సీడ్ షేర్ల బైబ్యాక్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విత్తన తయారీ సంస్థ కావేరీ సీడ్ కంపెనీ షేర్ల బైబ్యాక్ ప్రకటించింది. టెండర్ ఆఫర్ రూట్లో రూ.325 కోట్ల విలువైన షేర్లను బైబ్యాక్ చేసేందుకు బోర్డు నిర్ణయం తీసుకుంది. 9% ప్రీమియంతో ఒక్కో షేరు ధరను రూ.725గా నిర్ణయించారు. గరిష్టంగా 44.82 లక్షల షేర్లను కంపెనీ కొనుగోలు చేయనుంది. ప్రస్తుతం కంపెనీలో ప్రమోటర్లు, ప్రమోటర్ గ్రూప్‌నకు 59.9% వాటా ఉంది. బైబ్యాక్ వార్తల నేపథ్యంలో కావేరీ సీడ్స్ షేరు ధర బీఎస్ఈలో శుక్రవారం 1.18% ఎగసి రూ.662.60 వద్ద స్థిరపడింది. -
డిజిన్వెస్ట్‌మెంట్ నిధులు రూ.53,558 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా కేంద్రం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా రూ.53,558 కోట్లు సమీకరించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ.80,000 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఆర్థిక సంవత్సరం మరో నెలలో ముగియ నుండటం, స్టాక్ మార్కెట్ అంతంత మాత్రంగానే ఉండటంతో ఈ లక్ష్యం సాకారమయ్యే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని నిపుణులంటున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ.90,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గత వారంలో రూ.15,379 కోట్లు గత వారంలో కేంద్రం రూ.15,379 కోట్లు సమీకరించింది. భారత్–22 ఈటీఎఫ్ ఎఫ్‌పీఓ ద్వారా రూ.10,000 కోట్లు, యాక్సిస్ బ్యాంక్‌లో ఎస్‌యూయూటీఐకు ఉన్న వాటాను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయించడం ద్వారా రూ.5,379 కోట్లు ప్రభుత్వ ఖజానాకు వచ్చాయి. భారత్–22 ఈటీఎఫ్ ఎఫ్‌పీఓకు మంచి స్పందన లభించింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.38,000 కోట్లు, రిటైల్ ఇన్వెస్టర్లు రూ.2,000 కోట్ల మేర బిడ్ చేశారు. గత ఏడాది జూన్‌లో ఈ ఈటీఎఫ్ ద్వారా ప్రభుత్వం రూ.8,325 కోట్లు సమీకరించగలిగింది. షేర్ల బైబ్యాక్‌ల ద్వారా జోరుగా నిధులు... షేర్ల బైబ్యాక్ ద్వారా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుంచి రూ.2,647 కోట్లు వచ్చాయి. అలాగే భెల్ నుంచి రూ.992 కోట్లు, ఎన్‌హెచ్‌పీసీ నుంచి రూ.398 కోట్లు, కొచ్చిన్ షిప్‌యార్డ్ నుంచి రూ.137 కోట్లు, ఎన్ఎల్సీ నుంచి రూ.990 కోట్లు, నాల్కో నుంచి రూ.260 కోట్లు, కేఐఓసీఎల్ నుంచి రూ.260 కోట్ల మేర నిధులు ప్రభుత్వానికి లభించాయి. హెచ్‌ఎస్‌సీసీలో వ్యూహాత్మక వాటా విక్రయం ద్వారా రూ.285 కోట్లు ప్రభుత్వానికి వచ్చాయి. ఇక ఆఫర్ ఫర్ సేల్ విధానంలో కోల్ ఇండియా ద్వారా ప్రభుత్వానికి రూ.5,218 కోట్లు లభించాయి. సీపీఎస్‌యూ ఈటీఎఫ్ యూనిట్ల విక్రయం ద్వారా రూ.17,000 కోట్లు లభించాయి. ఇక ఐదు ప్రభుత్వ రంగ పీఎస్‌యూల ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) ద్వారా రూ.1,700 కోట్లు కేంద్రం సమీకరించింది. రీట్స్, ఇర్కన్, మిధాని, గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ ఐపీఓల ద్వారా ఈ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం సమీకరించింది. -
రూ.16,000 కోట్ల టీసీఎస్ షేర్ల బైబ్యాక్
న్యూఢిల్లీ: భారత ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) రూ.16,000 కోట్ల మేర షేర్లను బైబ్యాక్ చేయనున్నది. ఒక్కో షేర్‌ను రూ.2,100 ధరకు మొత్తం 7.61 కోట్ల షేర్లను (కంపెనీ చెల్లించిన ఈక్విటీ షేర్ క్యాపిటల్‌లో ఇది 1.99 శాతానికి సమానం) కొనుగోలు చేయనున్నామని టీసీఎస్ తెలిపింది. శుక్రవారం ముగింపు ధర(రూ.1841)తో పోల్చితే షేర్ బైబ్యాక్ ధర (రూ.2,100) 15 శాతం అధికం. శుక్రవారం సమావేశమైన తమ కంపెనీ డైరెక్టర్ల బోర్డ్ ఈ మేరకు నిర్ణయం తీసుకుందని టీసీఎస్ వివరించింది. రెండేళ్లలో కంపెనీ చేపడుతున్న రెండో షేర్ల బైబ్యాక్ ఇదే. గత ఏడాది కూడా ఈ కంపెనీ ఇదే స్థాయిలో షేర్లను బైబ్యాక్ చేసింది. ఒక్కో షేర్‌ను రూ.2,850 ధరకు మొత్తం 5.61 కోట్ల షేర్లను ఈ కంపెనీ కొనుగోలు చేసింది. అప్పటి బైబ్యాక్ మొత్తం రూ.16,000 కోట్లుగా ఉంది. అప్పుడు కూడా 18 శాతం ప్రీమియమ్ ధరను షేర్ల బైబ్యాక్ ధరను కంపెనీ నిర్ణయించింది.మిగులు నగదును వాటాదారులకు తిరిగి ఇచ్చే దీర్ఘకాల మూలధన కేటాయింపు విధానంలో భాగంగా ఈ షేర్ల బైబ్యాక్‌ను చేపడుతున్నామని కంపెనీ ఎమ్డీ, సీఈఓ రాజేశ్ గోపీనాథన్ 50వ ఏజీఎమ్‌లో చెప్పారు. అప్పుడు రూ.850.. ఇప్పుడు రూ.16,000 ఈ ఏడాది సెప్టెంబర్ కల్లా ఈ షేర్ల బైబ్యాక్ పూర్తవ్వగలదని గతంలో టీసీఎస్‌కు అధినేతగా పనిచేసి, టాటా గ్రూప్‌కు ప్రస్తుతం చైర్మన్‌గా వ్యవహరిస్తున్న చంద్రశేఖరన్ చెప్పారు. తాము ఐపీఓకు వచ్చినప్పుడు ఒక్క షేర్‌ను రూ.850కు కొనుగోలు చేస్తే, ఇప్పుడు దాని విలువ రూ.16,000 అయ్యిందని, బోనస్‌లు, షేర్ల విభజనలను కలుపుకుంటే ఈ స్థాయి విలువ వస్తుందని తెలిపారు. వాటాదారులకు 98,000 కోట్ల చెల్లింపులు... 2004లో స్టాక్ మార్కెట్లో లిస్టయ్యామని, అప్పటి నుంచి ఇప్పటిదాకా నగదు నిల్వల్లో 60 శాతం వరకూ(సుమారుగా రూ.98,192 కోట్లు) వాటాదారులకు పంచామని గోపీనాథన్ చెప్పారు. డివిడెండ్లు, షేర్ల బైబ్యాక్‌ల ద్వారా ఈ స్థాయిలో వాటాదారులకు నజరానాలిచ్చామని వివరించారు. కేవలం నాలుగు శాతం నగదు నిల్వలు (రూ.4,420 కోట్లు)ను మాత్రమే కంపెనీల కొనుగోళ్లకు వెచ్చించామని పేర్కొన్నారు. ఆల్‌టైమ్ హైకి టీసీఎస్ షేర్ల బైబ్యాక్ ప్రకటన నేపథ్యంలో టీసీఎస్ షేర్ జోరుగా పెరిగింది. ఇంట్రాడేలో 3.1 శాతం లాభంతో జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.1,849ను తాకింది. చివరకు 2.75 శాతం లాభంతో రూ.,1841 వద్ద ముగిసింది. ఈ జోరుతో కంపెనీ మార్కెట్ క్యాప్‌రూ.18,837 కోట్లు పెరిగి రూ.7,05,013 కోట్లకు ఎగసింది. రూ.7 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌ను దాటిన తొలి భారత కంపెనీగా అవతరించింది. మార్కెట్ క్యాప్ పరంగా అగ్రస్థానంలో ఈ కంపెనీ నిలిచింది. తర్వాతి స్థానాల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్(రూ.6,42,363 కోట్ల మార్కెట్ క్యాప్), హెచ్డీఎఫ్సీ బ్యాంక్(రూ.5,28,652కోట్లు), హిందుస్తాన్ యూనిలివర్(రూ.3,50,929 కోట్లు), ఐటీసీ(రూ.3,22,804 కోట్లు) లు నిలిచాయి. గత నెల 25న ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ తొలిసారిగా రూ,.7 లక్షల కోట్లను దాటేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో పదివేల కోట్ల డాలర్ల మార్కెట్ క్యాప్ సాధించిన తొలి భారత కంపెనీగా టీసీఎస్ రికార్డ్ సృష్టించింది. -
టీసీఎస్ మెగా బైబ్యాక్
రూ.16,000 కోట్ల షేర్ల బైబ్యాక్‌కు కంపెనీ బోర్డు ఆమోదం • ఒక్కో షేరుకి రూ.2,850 చొప్పున ఆఫర్ • ఓపెన్ టెండర్లో గరిష్టంగా 5.61 కోట్ల షేర్ల కొనుగోలు ప్రతిపాదన • పూర్తయితే అతిపెద్ద బైబ్యాక్‌గా రికార్డు • దూసుకెళ్లిన షేరు... 4 శాతం జంప్ ముంబై: దేశీ ఐటీ అగ్రగామి టీసీఎస్... ఇన్వెస్టర్లకు తీపి కబురు తెచ్చింది. భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో మెగా షేర్ల బైబ్యాక్ ఆఫర్‌ను ప్రకటించింది. రూ.16,000 కోట్ల విలువైన షేర్లను ఇన్వెస్టర్ల నుంచి తిరిగి కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించింది. టీసీఎస్ సీఈఓ బాధ్యతలకు గుడ్‌బై చెప్పి.. టాటా సన్స్ చైర్మన్‌గా ఎన్.చంద్రశేఖరన్ నేటి నుంచి బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం వెలువడింది. సోమవారమిక్కడ సమావేశమైన కంపెనీ బోర్డు సమావేశంలో బైబ్యాక్‌కు ఆమోదముద్ర పడింది. 13 శాతం ప్రీమియం... కంపెనీ బైబ్యాక్ ద్వారా 5.61 కోట్ల వరకూ షేర్లను ఇన్వెస్టర్ల నుంచి కొనుగోలు చేయనుంది. కంపెనీ మొత్తం ఈక్విటీ క్యాపిటల్‌లో ఇది 2.85 శాతానికి సమానం. ఒక్కో షేరుకి బైబ్యాక్ ధరను రూ.2,850గా బోర్డు నిర్ణయించింది. సోమవారం నాటి ముగింపు ధర(రూ.2,507)తో పోలిస్తే ఇది 13 శాతం అధికం(ప్రీమియం) కింద లెక్క. టీసీఎస్ ఇన్వెస్టర్ల నుంచి టెండర్ ఆఫర్ పద్ధతిలో షేర్లను తిరిగి కోనుగోలు చేయనుంది. స్టాక్ మార్కెట్ యంత్రాంగం ద్వారా బైబ్యాక్‌ను చేపట్టనున్నారు. ఒక్కో ఇన్వెస్టర్ విక్రయానికి పెట్టిన షేర్ల సంఖ్య ఆధారంగా తగిన నిష్పత్తిలో(దామాషా) కంపెనీ కొనుగోలు చేస్తుంది. ఈ బైబ్యాక్ గనుక విజయవంతంగా పూర్తయితే.. దేశీ స్టాక్ మార్కెట్లో అతిపెద్ద ఆఫర్‌గా కొత్త రికార్డు నమోదవుతుంది. అంతక్రితం 2012లో రిలయన్స్ ఇండస్ట్రీస్ చేపట్టిన రూ.10,400 కోట్ల బైబ్యాక్ ఆఫర్ ఇప్పటిదాకా అతిపెద్దదిగా నిలుస్తోంది. ‘రూ.16,000 కోట్లకు మించకుండా స్టాక్ మార్కెట్ నుంచి 5.61 కోట్ల వరకూ షేర్లను తిరిగి కొనుగోలు చేసే ప్రతిపాదనకు టీసీఎస్ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది’ అని కంపెనీ స్టాక్ ఎక్సే్ఛంజీలకు వెల్లడించిన సమాచారంలో పేర్కొంది. టాటాసన్స్ చైర్మన్‌గా మంగళవారం(నేడు) బాధ్యతలు చేపడుతున్న ఎన్.చంద్రశేఖరన్‌కు టీసీఎస్ సీఈఓ హోదాలో ఇదే ఆఖరి బోర్డు సమావేశం కావడం గమనార్హం. రూ. 43,169 కోట్ల మిగులు నగదు... టీసీఎస్ వద్ద గతేడాది డిసెంబర్ చివరినాటికి రూ.43,169 కోట్ల భారీ మొత్తంలో మిగులు నగదు నిల్వలు ఉన్నాయి. ఇది కంపెనీ మార్కెట్ విలువలో దాదాపు 10 శాతానికి సమానం. ప్రస్తుతం టీసీఎస్‌లో ప్రమోటర్లకు(టాటా సన్స్) 73.3 శాతం వాటా ఉంది. ఇప్పుడు బైబ్యాక్ ద్వారా టాటా సన్స్‌కే అత్యధికంగా లాభం చేకూరనుంది. షేర్ల బైబ్యాక్‌తో పాటు కచ్చితమైన డివిడెండ్ పాలసీని ప్రకటించాలంటూ ఇన్వెస్టర్ల నుంచి సూచనలు అందాయని.. దీనికి అనుగుణంగానే మిగులు నగదును వాటాదారులకు పంచేందుకు బైబ్యాక్‌ను ప్రకటించనున్నట్లు గత వారంలో చంద్రశేఖరన్ పేర్కొన్న సంగతి తెలసిందే. దీనికి అనుగుణంగానే ఈ బంపర్ ఆఫర్ ప్రకటన వెలువడింది. కాగా, బైబ్యాక్ నిబంధనలకు అనుగుణంగా సంబంధిత ప్రక్రియ, కాలవ్యవధి ఇతర వివరాలను త్వరలో ప్రకటించనున్నట్లు టీసీఎస్ తెలిపింది. షేరు రయ్ రయ్... బైబ్యాక్ ప్రకటన నేపథ్యంలో టీసీఎస్ షేరు ధర సోమవారం దూసుకెళ్లింది. బీఎస్ఈలో ఒకానొక దశలో 6 శాతం వరకూ ఎగబాకి రూ. 2,555 గరిష్టాన్ని కూడా తాకింది. చివరకు 4 శాతం లాభంతో రూ.2,507 వద్ద స్థిరపడింది. ఒక్క రోజులోనే కంపెనీ మార్కెట్ విలువ రూ.19,380 కోట్లు ఎగబాకి రూ.4,93,888 కోట్లకు చేరింది. మార్కెట్ విలువ పరంగా దేశంలో చాన్నాళ్ల నుంచీ టీసీఎస్ నంబర్ వన్ కంపెనీగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇతర కంపెనీలూ ఇదే బాటలో... మిగులు నగదును వాటాదారులకు పంపిణీ చేయాలంటూ గతకొద్దికాలంగా ఐటీ కంపెనీలపై ఒత్తిడి పెరుగుతున్న సంగతి తెలిసిందే. మరోపక్క, అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న రక్షణాత్మక విధానాలు కూడా దేశీ ఐటీ కంపెనీలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. అమెరికాలో హెచ్1బీ వీసాలపై నియంత్రణలు, యూరోపియన్ యూనియన్(ఈయూ) నుంచి బ్రిటన్ వైదొలగడం(బ్రెగ్జిట్) వంటి పరిణామాలతో భారతీయ ఐటీ సంస్థల ఆదాయాలకు భారీగానే గండిపడే ప్రమాదం ముంచుకొస్తోంది. వ్యాపార మందగమనం నేపథ్యంలో ఇన్వెస్టర్లలో విశ్వాసం పెంచడం కోసం ఇప్పుడు ఐటీ కంపెనీలన్నీ ఇప్పుడు షేర్ల బైబ్యాక్ మంత్రాన్ని జపిస్తున్నాయి. దీనివల్ల షేరు ధరకు ఊతం లభించడంతోపాటు షేరు వారీ ఆర్జన(ఈపీఎస్) కూడా మెరుగుపడే అవకాశాలున్నాయి. ఈ నెల ఆరంభంలో అంతర్జాతీయ ఐటీ దిగ్గజం కాగ్నిజంట్ టెక్నాలజీ సర్వీసెస్(సీటీఎస్) 340 కోట్ల డాలర్ల విలువైన బైబ్యాక్ ప్రణాళికను ప్రకటించడం విదితమే. మరోపక్క, ఇటీవలే ప్రమోటర్లకు, బోర్డు సభ్యులకు మధ్య కార్పొరేట్ గవర్నెన్స్‌కు సంబంధించి విభేదాలతో వార్తల్లోకి ఎక్కిన ఇన్ఫోసిస్ కూడా త్వరలో ఇదే బాట పట్టనున్నట్లు సంకేతాలు వెలువడ్డాయి. కంపెనీ మాజీ సీఎఫ్ఓలు వి.బాలకృష్ణన్, మోహన్‌దాస్ పాయ్లు కూడా ఇన్ఫీ బైబ్యాక్ కోసం డిమాండ్ చేస్తూవస్తున్నారు. ప్రస్తుతం ఇన్ఫోసిస్ వద్ద దాదాపు రూ. 35,697 కోట్ల నగదు నిల్వలు ఉన్నాయి. త్వరలోనే రూ.12,000 కోట్ల బైబ్యాక్‌ను కంపెనీ ప్రకటించొచ్చనేది మార్కెట్ వర్గాల అంచనా. మరోపక్క, గతేడాది రూ.2,500 కోట్ల షేర్ల బైబ్యాక్‌ను పూర్తి చేసిన విప్రో కూడా మరోసారి బైబ్యాక్ చేయొచ్చని సమాచారం. ప్రస్తుతం కంపెనీ వద్ద రూ.33,155 కోట్ల నగదు నిల్వలు ఉన్నాయి.