టీసీఎస్‌ మెగా బైబ్యాక్‌ | TCS board approves buyback of up to 5.6 cr shares at Rs 2850/sh | Sakshi
Sakshi News home page

టీసీఎస్‌ మెగా బైబ్యాక్‌

Published Tue, Feb 21 2017 12:34 AM | Last Updated on Tue, Sep 5 2017 4:11 AM

టీసీఎస్‌ మెగా బైబ్యాక్‌

టీసీఎస్‌ మెగా బైబ్యాక్‌

రూ.16,000 కోట్ల షేర్ల బైబ్యాక్‌కు కంపెనీ బోర్డు ఆమోదం
ఒక్కో షేరుకి రూ.2,850 చొప్పున ఆఫర్‌
ఓపెన్‌ టెండర్‌లో గరిష్టంగా 5.61 కోట్ల షేర్ల కొనుగోలు ప్రతిపాదన
పూర్తయితే అతిపెద్ద బైబ్యాక్‌గా రికార్డు
దూసుకెళ్లిన షేరు... 4 శాతం జంప్‌  


ముంబై: దేశీ ఐటీ అగ్రగామి టీసీఎస్‌... ఇన్వెస్టర్లకు తీపి కబురు తెచ్చింది. భారత స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలో మెగా షేర్ల బైబ్యాక్‌ ఆఫర్‌ను ప్రకటించింది. రూ.16,000 కోట్ల విలువైన షేర్లను ఇన్వెస్టర్ల నుంచి తిరిగి కొనుగోలు చేయనున్నట్లు  వెల్లడించింది. టీసీఎస్‌ సీఈఓ బాధ్యతలకు గుడ్‌బై చెప్పి.. టాటా సన్స్‌ చైర్మన్‌గా ఎన్‌.చంద్రశేఖరన్‌ నేటి నుంచి బాధ్యతలు చేపట్టనున్న  నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం వెలువడింది. సోమవారమిక్కడ సమావేశమైన కంపెనీ బోర్డు సమావేశంలో బైబ్యాక్‌కు ఆమోదముద్ర పడింది.

13 శాతం ప్రీమియం...
కంపెనీ బైబ్యాక్‌ ద్వారా 5.61 కోట్ల వరకూ షేర్లను ఇన్వెస్టర్ల నుంచి కొనుగోలు చేయనుంది. కంపెనీ మొత్తం ఈక్విటీ క్యాపిటల్‌లో ఇది 2.85 శాతానికి సమానం. ఒక్కో షేరుకి బైబ్యాక్‌ ధరను రూ.2,850గా బోర్డు నిర్ణయించింది. సోమవారం నాటి ముగింపు ధర(రూ.2,507)తో పోలిస్తే ఇది 13 శాతం అధికం(ప్రీమియం) కింద లెక్క. టీసీఎస్‌ ఇన్వెస్టర్ల నుంచి టెండర్‌ ఆఫర్‌ పద్ధతిలో షేర్లను తిరిగి కోనుగోలు చేయనుంది. స్టాక్‌ మార్కెట్‌ యంత్రాంగం ద్వారా బైబ్యాక్‌ను చేపట్టనున్నారు. ఒక్కో ఇన్వెస్టర్‌ విక్రయానికి పెట్టిన షేర్ల సంఖ్య ఆధారంగా తగిన నిష్పత్తిలో(దామాషా) కంపెనీ కొనుగోలు చేస్తుంది. ఈ బైబ్యాక్‌ గనుక విజయవంతంగా పూర్తయితే.. దేశీ స్టాక్‌ మార్కెట్లో అతిపెద్ద ఆఫర్‌గా కొత్త రికార్డు నమోదవుతుంది. అంతక్రితం 2012లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చేపట్టిన రూ.10,400 కోట్ల బైబ్యాక్‌ ఆఫర్‌ ఇప్పటిదాకా అతిపెద్దదిగా నిలుస్తోంది. ‘రూ.16,000 కోట్లకు మించకుండా స్టాక్‌ మార్కెట్‌ నుంచి 5.61 కోట్ల వరకూ షేర్లను తిరిగి కొనుగోలు చేసే ప్రతిపాదనకు టీసీఎస్‌ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది’ అని కంపెనీ స్టాక్‌ ఎక్సే్ఛంజీలకు వెల్లడించిన సమాచారంలో పేర్కొంది. టాటాసన్స్‌ చైర్మన్‌గా మంగళవారం(నేడు) బాధ్యతలు చేపడుతున్న ఎన్‌.చంద్రశేఖరన్‌కు టీసీఎస్‌ సీఈఓ హోదాలో ఇదే ఆఖరి బోర్డు సమావేశం కావడం గమనార్హం.

రూ. 43,169 కోట్ల మిగులు నగదు...
టీసీఎస్‌ వద్ద గతేడాది డిసెంబర్‌ చివరినాటికి రూ.43,169 కోట్ల భారీ మొత్తంలో మిగులు నగదు నిల్వలు ఉన్నాయి. ఇది కంపెనీ మార్కెట్‌ విలువలో దాదాపు 10 శాతానికి సమానం. ప్రస్తుతం టీసీఎస్‌లో ప్రమోటర్లకు(టాటా సన్స్‌) 73.3 శాతం వాటా ఉంది. ఇప్పుడు బైబ్యాక్‌ ద్వారా టాటా సన్స్‌కే అత్యధికంగా లాభం చేకూరనుంది. షేర్ల బైబ్యాక్‌తో పాటు కచ్చితమైన డివిడెండ్‌ పాలసీని ప్రకటించాలంటూ ఇన్వెస్టర్ల నుంచి సూచనలు అందాయని.. దీనికి అనుగుణంగానే మిగులు నగదును వాటాదారులకు పంచేందుకు బైబ్యాక్‌ను ప్రకటించనున్నట్లు గత వారంలో చంద్రశేఖరన్‌ పేర్కొన్న సంగతి తెలసిందే. దీనికి అనుగుణంగానే ఈ బంపర్‌ ఆఫర్‌ ప్రకటన వెలువడింది. కాగా, బైబ్యాక్‌ నిబంధనలకు అనుగుణంగా సంబంధిత ప్రక్రియ, కాలవ్యవధి ఇతర వివరాలను త్వరలో ప్రకటించనున్నట్లు టీసీఎస్‌ తెలిపింది.

షేరు రయ్‌ రయ్‌...
బైబ్యాక్‌ ప్రకటన నేపథ్యంలో టీసీఎస్‌ షేరు ధర సోమవారం దూసుకెళ్లింది. బీఎస్‌ఈలో ఒకానొక దశలో 6 శాతం వరకూ ఎగబాకి రూ. 2,555 గరిష్టాన్ని కూడా తాకింది. చివరకు 4 శాతం లాభంతో రూ.2,507 వద్ద స్థిరపడింది. ఒక్క రోజులోనే కంపెనీ మార్కెట్‌ విలువ రూ.19,380 కోట్లు ఎగబాకి రూ.4,93,888 కోట్లకు చేరింది. మార్కెట్‌ విలువ పరంగా దేశంలో చాన్నాళ్ల నుంచీ టీసీఎస్‌ నంబర్‌ వన్‌ కంపెనీగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

ఇతర కంపెనీలూ ఇదే బాటలో...
మిగులు నగదును వాటాదారులకు పంపిణీ చేయాలంటూ గతకొద్దికాలంగా ఐటీ కంపెనీలపై ఒత్తిడి పెరుగుతున్న సంగతి తెలిసిందే. మరోపక్క, అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అనుసరిస్తున్న రక్షణాత్మక విధానాలు కూడా దేశీ ఐటీ కంపెనీలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. అమెరికాలో హెచ్‌1బీ వీసాలపై నియంత్రణలు, యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ) నుంచి బ్రిటన్‌ వైదొలగడం(బ్రెగ్జిట్‌) వంటి పరిణామాలతో భారతీయ ఐటీ సంస్థల ఆదాయాలకు భారీగానే గండిపడే ప్రమాదం ముంచుకొస్తోంది. వ్యాపార మందగమనం నేపథ్యంలో ఇన్వెస్టర్లలో విశ్వాసం పెంచడం కోసం ఇప్పుడు ఐటీ కంపెనీలన్నీ ఇప్పుడు షేర్ల బైబ్యాక్‌ మంత్రాన్ని జపిస్తున్నాయి. దీనివల్ల షేరు ధరకు ఊతం లభించడంతోపాటు షేరు వారీ ఆర్జన(ఈపీఎస్‌) కూడా మెరుగుపడే అవకాశాలున్నాయి.

ఈ నెల ఆరంభంలో అంతర్జాతీయ ఐటీ దిగ్గజం కాగ్నిజంట్‌ టెక్నాలజీ సర్వీసెస్‌(సీటీఎస్‌) 340 కోట్ల డాలర్ల విలువైన బైబ్యాక్‌ ప్రణాళికను ప్రకటించడం విదితమే. మరోపక్క, ఇటీవలే ప్రమోటర్లకు, బోర్డు సభ్యులకు మధ్య కార్పొరేట్‌ గవర్నెన్స్‌కు సంబంధించి విభేదాలతో వార్తల్లోకి ఎక్కిన ఇన్ఫోసిస్‌ కూడా త్వరలో ఇదే బాట పట్టనున్నట్లు సంకేతాలు వెలువడ్డాయి. కంపెనీ మాజీ సీఎఫ్‌ఓలు వి.బాలకృష్ణన్, మోహన్‌దాస్‌ పాయ్‌లు కూడా ఇన్ఫీ బైబ్యాక్‌ కోసం డిమాండ్‌ చేస్తూవస్తున్నారు. ప్రస్తుతం ఇన్ఫోసిస్‌ వద్ద దాదాపు రూ. 35,697 కోట్ల నగదు నిల్వలు ఉన్నాయి. త్వరలోనే రూ.12,000 కోట్ల బైబ్యాక్‌ను కంపెనీ ప్రకటించొచ్చనేది మార్కెట్‌ వర్గాల అంచనా. మరోపక్క, గతేడాది రూ.2,500 కోట్ల షేర్ల బైబ్యాక్‌ను పూర్తి చేసిన విప్రో కూడా మరోసారి బైబ్యాక్‌ చేయొచ్చని సమాచారం. ప్రస్తుతం కంపెనీ వద్ద రూ.33,155 కోట్ల నగదు నిల్వలు ఉన్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement