పెట్స్‌కూ లైఫ్‌స్టైల్ ఉంది
‘మనుషులకే కాదు పెంపుడు జంతువుల (పెట్స్)కూ ఓ జీవనశైలి ఉంది. అది గుర్తించి, వాటి భాషను, భావాలను అర్థం చేసుకుంటేనే మనం నిజమైన పెట్ లవర్స్ అనిపించుకుంటాం’ అంటున్నారు శర్వాణి చౌదరి. దేశంలోనే తొలి పెట్స్ లైఫ్‌స్టైల్ మేగజైన్ ‘హైదరాబాద్ పాస్’ను ఆమె రూపొందించి ఇటీవలే విడుదల చేశారు. తొలి పుస్తకంలోనే హీరో సిద్ధార్థకు తన పెట్‌తో అనుబంధాన్ని అందంగా ఆవిష్కరించి ప్రశంసలు పొందిన శర్వాణి... తన తర్వాతి ఎడిషన్ కోసం నటి శ్రీయను ఎంచుకున్నారు. ఈ సందర్భంగా ‘సిటీప్లస్’ ఆమెతో ముచ్చటించింది.
‘ఒక శునకం రోడ్డు మీద మొరుగుతుంటే విసుక్కునే వారేగానీ.. దాని అరుపుల వెనుక ఉన్న వేదన అర్థం చేసుకునేవారెందరు’ అని ప్రశ్నించే శర్వాణి... జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీలో దాదాపు 40కి పైగా వీధికుక్కలకు కొంతకాలంగా ఆహారం, వైద్య సేవలు వంటివి అందేలా చూస్తున్నారు. ‘ఆ క్రమంలోనే నాకు అర్థమైంది. వీటిపై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని’ అన్నారామె. మెదక్‌లో అనాథ వృద్ధులకు ఆశ్రయం అందించే ఎన్జీఓ హోమ్ కూడా ఆమె నిర్వహిస్తున్నారు.
సెలబ్రిటీలే ఎందుకంటే...
‘ప్రముఖులు ఏ విషయమైనా చెబితే అది బాగా ప్రచారంలోకి వస్తుందనేది తెల్సిందే. అదే ఉద్దేశంతో టాలీవుడ్ టాప్‌స్టార్స్‌కు తమ పెట్స్‌తో ఉన్న అనుబంధాన్ని మేగజైన్ కవర్‌స్టోరీగా అందిస్తున్నా’ అన్నారు శర్వాణి. కేవలం ఫ్యాషన్ కోసమో మరోలానో పెట్స్‌ను పెంచుకునేవారిని కాకుండా వాటిని తమ ఫ్యామిలీ మెంబర్స్‌తో సమానంగా చూసేవారికే ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. సృష్టిలో ఉన్న 84 రకాల జీవులకు కూడా మనిషిలాగే ప్రత్యేకమైన జీవనశైలి ఉందనే ఆమె... అవి తమకు నచ్చేలా మనుగడ సాగించడం కోసం ఏ ఎన్జీఓ సరిగా కృషి చేయుడంలేదంటారు. తమ మేగజైన్లో పెట్స్ ఆరోగ్యసమస్యల పరిష్కారాలు మొదలుకుని వాటి కోసం పనిచేసే సంస్థలు, విభిన్న రకాల పెంపుడు జంతువులు, వాటి జీవనశైలి విశేషాలుంటాయని చెప్పారామె.
- ఎస్.సత్యబాబు