She Alerts
-
ఉద్యోగినులకు ‘షీ–బాక్స్’ అండ
పశ్చిమగోదావరి , నిడమర్రు : పనిచేసే చోట మహిళా ఉద్యోగులకు సురక్షిత వాతావరణం కల్పించేందుకు మన దేశంలో 2013 నుంచి లైంగిక వేధింపుల చట్టం అమల్లో ఉంది. ఈ చట్టం పరిధిలో సంఘటిత, అసంఘటిత రంగాల్లో పనిచేస్తోన్న స్త్రీలందరూ ఉంటారు. ఈ చట్టం ప్రకారం ఆయా కార్యాలయాల్లో పిర్యాదుల కమిటీ ఉండాలి. అయితే ఈ చట్టం అమలు విషయంలో అనేక లోపాల కారణంగా లైంగిక వేధింపుల నుంచి మాత్రం ఉద్యోగినులకు విముక్తి లభించడం లేదు. పనిచేసే చోట నిత్యం ఎదురయ్యే లైంగిక వేధింపులు ఎంత నరకప్రాయమో.. ఆ బాధలు పడేవారికే తెలుస్తుంది. ఆయా సంస్థల్లో చట్టప్రకారం ఫిర్యాదు విభాగాలు ఏర్పాటుపై సరైన పర్యవేక్షణ లేనికారణంగా, ఏదైనా సమస్యతో ఉద్యోగిని ఫిర్యాదు చేసినా ఫలితం లేని పరిస్థితి కూడా అనేక సంస్థల్లో ఉంది. అందుకే, ఉద్యోగం చేస్తున్న మహిళల సంక్షేమం కోసం భారత ప్రభుత్వం కొత్తగా ఆన్లైన్ ఫిర్యాదుల విభాగాన్ని ప్రవేశపెట్టింది. అదే షీ–బాక్స్ (సెక్సువల్ హెరాస్మెంట్ ఎలక్ట్రానిక్ బాక్స్). ఆ వివరాలు తెలుసుకుందాం. ఆన్లైన్లో ఫిర్యాదుకు అవకాశం మహిళలు పనిచేసే చోట నిశ్చింతగా ఉద్యోగం చేసుకుంటూ, వేధింపులకు గురికాకుండా ఉండటం కోసం ప్రభుత్వం ఇటీవల ‘షీ–బాక్స్’ పేరుతో ఓ వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసింది. ఇది గత ఏడాది నవంబర్ నెల నుంచి కేంద్ర, మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ ఆన్లైన్ ఫిర్యాదు సౌకర్యాన్ని ఉద్యోగినులకు కల్పించింది. ప్రభుత్వ/ప్రైవేటు సంస్థలు, పరిశ్రమల్లో అంటే సంఘటిత, అసంఘటిత రంగాల్లో పనిచేసే మహిళా ఉద్యోగులైనా ఫిర్యాదు చేయ్యవచ్చు. తాము ఎదుర్కొంటున్న లైంగిక వేధింపుల గురించి వివరంగా తెలియజేయవచ్చు. లైంగిక వేధింపులే కాదు.. ఒక్క లైంగిక వేధింపులే కాదు. మహిళలను భయపెట్టడం, జుగుప్సాకరమైన ఉద్యోగ వాతావరణం సృష్టించడం. స్త్రీలను తక్కువ చేసి మాట్లాడటం.. ఇలా ఎటువంటి ఇబ్బందినైనా నిర్భయంగా ఆన్లైన్ వేదికగా ఫిర్యాదులో పేర్కొనవచ్చు. వారి ఆరోగ్యానికి, భద్రతకు ముప్పు కలిగించే అన్ని విషయాలనూ ఇందులో నమోదు చేయవచ్చు. ఆన్లైన్లో ఇలా.. ♦ http://shebox.nic.in/ అనే వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాలి. స్క్రీన్ మీద కనిపించే రిజిస్టర్ యువర్ కంప్లయింట్ మీద క్లిక్ చేయాలి. ♦ అక్కడ గవర్నమెంట్ ఉద్యోగులా.. ప్రైవేటు ఉద్యోగులా అనే కాలంలు కనిపిస్తాయి. గవర్నమెంట్ అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులా, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగినులా అని అడుగుతుంది. ♦ ఆయా ఉద్యోగులకు సంబంధించిన కాలం క్లిక్ చేసిన వెంటనే ఆన్లైన్లో ఫిర్యాదు దరఖాస్తు ప్రత్యక్షమవుతుంది. అక్కడ ఫిర్యాదుదారు పేరు, ఉద్యోగం, సెల్ నెంబరు, ఈ–మెయిల్, ఆధార్ నంబర్‌తోపాటు కార్యాలయం వివరాలు నమోదు చేయాలి. ♦ మీ ఆఫీసులో ఏ సందర్భంలో మీరు వేధింపులకు గురి అయ్యారు.. గురవుతున్నారు అనే వివరాలను పొందుపరచడానికి బ్రీఫ్ డిస్క్రిప్షన్ వద్ద అవసరమైన మెజేస్ స్పేస్ వస్తుంది. ఇలా ఫిర్యాదు నమోదు పత్రంలో సమాచారం నింపాక, సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి. ♦ ఒకసారి ఫిర్యాదు ఇచ్చారంటే, మీ మెయిల్‌కి కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. అందులో ఒక లింక్ కూడా వస్తుంది. అక్కడ మీ ఈ–మెయిల్ ఐడీని యూజర్ ఐడీగా వాడుకుని, కొత్త పాస్‌వర్డ్‌ని జనరేట్ చేసుకుని, మీ ఫిర్యాదు విచారణ ఎంతవరకు వచ్చిందో ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. షీ–బాక్స్ ఒక సింగిల్ విండోలా షీ–బాక్స్ ఒక సింగిల్ విండోలా పనిచేస్తుంది. ఉద్యోగం చేస్తున్న చోట వేధింపులకు గురవుతున్నవారు చేసే ఫిర్యాదు నేరుగా సంబంధిత అధికారులకు చేరుతుంది. వెంటనే వారు.. బాధితురాలు పనిచేస్తున్న సంస్థ యాజమాన్యాలతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటారు. షీ–బాక్స్‌లో ఫిర్యాదు చేయడానికి ఈ–మెయిల్ ఐడీ తప్పనిసరి. ఇందులో రిజిస్టర్ చేసుకోవడం చాలా సులభం. తీసుకునే చర్యలపై నిఘా ఉంటుంది. -
నా మనసును నలిపేశాడు..ప్రేమను చిదిమేశాడు
షీ అలర్ట్ ! : మహిళలూ జాగ్రత్త! సమాజంలో పలు రకాలుగా అన్యాయానికి, మోసాలకు గురవుతున్న మహిళల ఆవేదనకు అక్షర రూపం ఈ శీర్షిక. వారి అనుభవాలను ఉదాహరణగా చూపిస్తూ, మిమ్మల్ని అప్రమత్తం చేసేందుకు సాక్షి అందిస్తోన్న వాస్తవ సంఘటనలివి... సాయంత్రం కావస్తోంది. అప్పుడే సూర్యుడు తట్టా బుట్టా సర్దేసి, మబ్బుల మాటుకి వెళ్లిపోయాడు. శీతాకాలమేమో... చలి తన పంజా విసురుతోంది. ఎముకల్ని కొరికిస్తోంది. కానీ నాకు మాత్రం చెమటలు పడుతున్నాయి. ఉక్కబోత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. మనసు మండిపోతోంది కదా! ఆ వేడి అలా బయటకు వస్తున్నట్టుంది. కర్చీఫ్‌తో చెమట తుడుచుకుంటూ ముందుకు నడుస్తున్నాను. నడకలో వేగం లేదు. గమ్యమేమిటో తెలియని మనిషి అడుగుల్లా భారంగా పడుతున్నాయి. మొత్తానికి ఎలాగో ఆ సందు దగ్గరకు చేరుకున్నాను. నాలుగడుగులు వేయగానే ఒకావిడ ఎదురొచ్చింది. ‘ఏంటి రజియా అంత నీరసంగా నడుస్తున్నావ్... ఒంట్లో బాలేదా?’ అంది పలకరింపుగా. ‘బాలేనిది ఒళ్లు కాదు, బతుకు’ అందామనుకున్నాను. నోరు పెగల్లేదు. జవాబుగా జీవం లేని ఓ నవ్వు నవ్వి నడక కొనసాగించాను. ఎట్టకేలకు చేరాల్సిన చోటికి చేరుకున్నాను. ఇంటి మెట్లు ఎక్కుతుంటే కాళ్లు తడబడు తున్నాయి. కాలింగ్‌బెల్ కొడుతుంటే చేతులు వణుకుతున్నాయి. తలుపు ఎవరు తీస్తారో నాకు తెలుసు. కానీ తను అడిగే ప్రశ్నలకి ఏం బదులు చెప్పాలో మాత్రం తెలియదు. అందుకే మనసు రెపరెపలాడుతోంది. రెండు క్షణాల తర్వాత తలుపు తెరచుకుంది. ఎదురుగా నేను ఊహించిన రూపమే ప్రత్యక్షమయ్యింది. నన్ను చూస్తూనే తన కళ్లలో కోటి ప్రశ్నలు కదలాడాయి. ‘ఏంటి రజియా... ఏమైంది?’... అంటూ ఓ ప్రశ్నను వేగంగా సంధించింది. ఏం చెప్పను? నిజం చెప్పనా! చెబితే తను తట్టుకుంటుందా! తట్టుకుని నిలబడుతుందా! పెదవి విప్పాలంటేనే భయంగా ఉంది. నిజం తట్టుకోలేక తనకేదైనా అవుతుందేమోనన్న భయం నా నోటికి తాళం వేస్తోంది. కానీ తప్పదు. చెప్పి తీరాలి. అందుకే మాటల్ని మూటగట్టుకున్నాను. అతి కష్టమ్మీద పెదవుల్ని పలికించాను. ‘అమ్మా... అంతా అయిపోయింది. నా జీవితం నాశనమైపోయింది. నీ కూతురి బతుకు సర్వనాశనమైపోయింది’... నా మాట వింటూనే కొయ్యబారిపోయింది అమ్మ. ‘ఏం జరిగిందమ్మా’ అంటూ కంగారుగా వచ్చి నా చేతులు పట్టుకుంది. సమాధానాన్ని నా కళ్లలో వెతకడానికి ప్రయత్నించింది. దొరకలేదనుకుంటా... ‘ఏం జరిగిందో చెప్పవే’ అంటూ నన్ను పట్టి కుదిపింది. ‘తను... తను వేరే పెళ్లి చేసుకున్నాడమ్మా’... నేను చెప్పింది విని వెయ్యి వోల్టుల కరెంటు షాక్ తిన్నట్టు అదిరిపడింది అమ్మ. ‘ఏంటీ’ అంటూ కూలబడిపోయింది. ధారకట్టిన కన్నీళ్లను కట్టడి చేయలేకపోయింది. వెక్కి వెక్కి ఏడవసాగింది. నా మనసు విలవిల్లాడింది. ఈ వయసులో తనకీ కష్టం అవసరమా? ఇంత దారుణమైన నిజాన్ని విని ఆ ముసలి గుండె తట్టుకోగలదా? అలా అని చెప్పకుండా ఎలా ఉండను! నాకున్న తోడు తనే. నా అండ, నా ధైర్యం అన్నీ తనే. అందుకే చెప్పేశాను. తీరా చెప్పేశాక తన కన్నీళ్లను చూసి భరించలేకపోయాను. వెళ్తున్నాను అని మాట మాత్రమైనా తనతో చెప్పకుండా వెనుదిరిగాను. తనవైపు చూడటానికి కూడా భయమేసి బయలుదేరిపోయాను. నాకు తెలుసు. ఇక తను ఏడుస్తూనే ఉంటుంది. నన్ను తలచుకుని కుమిలిపోతూనే ఉంటుంది. తననలా చూసే ధైర్యంగానీ, చూసి తట్టుకునే శక్తిగానీ నాకు లేవు. అయినా ఎలా వస్తుంది అంత ధైర్యం? ఎందుకుంటుంది అంతటి శక్తి? నన్ను, తమ్ముడిని కళ్లలో పెట్టుకుని పెంచింది. కడుపు కట్టుకుని మా నోళ్లకు ఇంత ముద్ద అందించింది. డబ్బులో ముంచి తేల్చే శక్తి లేకపోయినా... తన ప్రేమలో తడిపి ముద్ద చేసింది. తమ్ముడికి ఆటో కొనిచ్చి వాడి కాళ్ల మీద నిలబడేలా చేసింది. నన్నో అయ్య చేతుల్లో పెట్టాలని అనుక్షణం తపించింది. తగిన సంబంధం చూసి నిఖా చేసింది. తన బిడ్డ సంతోష సౌభాగ్యాలతో విలసిల్లుతుందన్న నమ్మకాన్ని గుండెల నిండా నింపుకుని నన్ను కాపురానికి పంపింది. తన నమ్మకం వమ్ము అవుతుందని ఆ రోజు తను ఊహించి ఉండదు. నా భర్త లారీ డ్రైవర్. పక్క రాష్ట్రాలకు కూడా సరుకు సప్లై చేస్తాడు. రెండు చేతులా సంపాదిస్తాడు. దాంతో పెద్దగా ఏ లోటూ ఉండేది కాదు. అన్నీ తెచ్చి నా కాళ్ల దగ్గర పెట్టేవాడు. తన ప్రేమతో ఉక్కిరిబిక్కిరి చేసేవాడు. నెలల పాటు డ్యూటీలో ఉన్నా, వచ్చీ రాగానే నన్ను అల్లుకుపోయేవాడు. ఎన్నో ఊసులాడుకునేవాళ్లం. ఆశలు కలబోసుకునేవాళ్లం. తన సాహచర్యంలో రోజులు నెలల య్యాయి. నెలలు సంవత్సరాలయ్యాయి. కానీ అదేంటో... కాలం గడిచేకొద్దీ కలల రంగులు వెలిశాయి. ఆశల గూళ్లు చెదిరాయి. నా భర్త కన్నులు నన్ను చూడటమే మానేశాయి. తన చేతులు నన్ను దగ్గరకు తీసుకోవడమే మరిచాయి. తన ఒంట్లోకి సారాయినీళ్లు, నా కంట్లోకి కన్నీళ్లు వచ్చి తిష్ట వేశాయి. తాగిన మత్తులో తూలనాడేవాడు. అది తన హక్కు అట. భరించడం నా బాధ్యతట. కాదని నోరు మెదిపితే చేతిని చురకత్తిని చేసేవాడు. నా తనువును చీల్చి చెండాడేవాడు. బతుకు నరకమైపోయింది. జీవితం అల్లకల్లోలమైపోయింది. అమ్మ దగ్గరకు వెళ్లిపోదామంటే అప్పటికే ఏడుగురు పిల్లలకు అమ్మనైపోయాను. వారికి తండ్రి లేకుండా చేయలేను. అందుకే అమ్మతో నా బాధను పంచుకున్నానే తప్ప, మా బాధ్యతను పంచుకొమ్మని అడగలేకపోయాను. మనసులో అగ్నిపర్వతాలు రగులుతున్నా మౌనంగా అన్నిటినీ సహిస్తూ వచ్చాను. కానీ నా మౌనం నా కాపురాన్ని ముక్కలు కాకుండా ఆపలేకపోయింది. మెల్లగా అతని మనసులోకి, జీవితంలోకి మరో స్త్రీ ప్రవేశించింది. నా స్థానాన్ని ఆక్రమించింది. నాకు అతణ్ని శాశ్వతంగా దూరం చేసింది. సంవత్సరాల పాటు అతనితో గుట్టుగా కాపురం చేశాను. తన బలాల్ని ప్రేమించాను. బలహీనతల్ని భరించాను. కానీ అతనేం చేశాడు? నా మనసును నలిపేశాడు. నా ప్రేమను చిదిమేశాడు. నన్ను, నా పిల్లల్ని చిత్తు కాగితాల్ని చేసి తన జీవితం నుంచి విసిరేశాడు. ‘తలాక్’ అన్న మూడు అక్షరాలతో మా మధ్య బంధాన్ని ముక్కలు చేసేశాడు. మా మతం తనను నాలుగు పెళ్లిళ్లు చేసుకొమ్మందట. చట్టం తనకు అనుమతినిస్తోందట. ఏ మతం చెప్పింది... తనను నమ్మి వచ్చి, తన కోసం జీవితాన్నే అర్పించిన భార్య బతుకును బండలు చేయమని?! ఏ చట్టం చెబుతోంది తలాక్ అన్న ఒక్క మాటతో ఓ ఆడదాని జీవితాన్ని అతలాకుతలం చెయ్యవచ్చని?! పెళ్లి పేరుతో బంధాన్ని ముడి వేసుకుని, కాపురం పేరుతో సర్వస్వాన్నీ దోచుకుని, నువ్వు నాకొద్దు అని చెప్పే హక్కును నా భర్తలాంటి మగాళ్లకు కల్పించడం న్యాయమేనా? ఈ మతం, చట్టం నా జీవితాన్ని చక్కదిద్దుతాయా? కొన్ని సంవత్సరాలుగా కోర్టుని ఈ ప్రశ్నలడుగుతున్నాను. ఇంతవరకూ సమాధానం దొరకలేదు. దొరికేవరకూ నా గొంతు మూగబోదు. నా పోరాటం ఆగేదీ లేదు!! - రజియా (గోప్యత కోసం పేరు మార్చాం) ప్రెజెంటేషన్: సమీర నేలపూడి ఈమధ్య గృహ హింస కేసులు బాగా ఎక్కువవుతున్నాయి. ఎందుకనో కొందరు భర్తలు చాలా క్రూరంగా ఉంటారు. భార్యను వంచించడం, హింసించడం చేస్తుంటారు. పాపం ఈ అమ్మాయిది చాలా దీన పరిస్థితి. ఏడుగురు పిల్లలు. ముస్లిం కావడంతో భర్త సింపుల్‌గా తలాక్ అనేసి వెళ్లిపోయాడు. మరో పెళ్లి చేసేసుకున్నాడు. ఈమెను ఏ ఆధారమూ లేకుండా వదిలేశాడు. ఒంటరిగా ఎలా బతకాలో తెలియక.. పిల్లల్ని ఎలా పోషించాలో, ఎలా పెంచి పెద్ద చేయాలో తోచక అవస్థ పడుతోంది. కొన్ని సంవత్సరాలుగా కోర్టులో న్యాయం కోసం పోరాడుతోంది. ఈ ప్రాంతంలో ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరగడానికి కారణం చాలావరకూ మద్యపానమే. మద్యానికి బానిసలైపోయి ఆ మత్తులో భార్యలను హింసిస్తున్నారు. కాపురాలను విచ్ఛిన్నం చేసుకుని, జీవితాలను రోడ్డుపాలు చేసుకుంటున్నారు. ఇవన్నీ చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది... మద్యాన్ని దూరం చేస్తేనే వీరి జీవితాలు బాగుపడతాయని!