పశ్చిమగోదావరి , నిడమర్రు : పనిచేసే చోట మహిళా ఉద్యోగులకు సురక్షిత వాతావరణం కల్పించేందుకు మన దేశంలో 2013 నుంచి లైంగిక వేధింపుల చట్టం అమల్లో ఉంది. ఈ చట్టం పరిధిలో సంఘటిత, అసంఘటిత రంగాల్లో పనిచేస్తోన్న స్త్రీలందరూ ఉంటారు. ఈ చట్టం ప్రకారం ఆయా కార్యాలయాల్లో పిర్యాదుల కమిటీ ఉండాలి. అయితే ఈ చట్టం అమలు విషయంలో అనేక లోపాల కారణంగా లైంగిక వేధింపుల నుంచి మాత్రం ఉద్యోగినులకు విముక్తి లభించడం లేదు. పనిచేసే చోట నిత్యం ఎదురయ్యే లైంగిక వేధింపులు ఎంత నరకప్రాయమో.. ఆ బాధలు పడేవారికే తెలుస్తుంది. ఆయా సంస్థల్లో చట్టప్రకారం ఫిర్యాదు విభాగాలు ఏర్పాటుపై సరైన పర్యవేక్షణ లేనికారణంగా, ఏదైనా సమస్యతో ఉద్యోగిని ఫిర్యాదు చేసినా ఫలితం లేని పరిస్థితి కూడా అనేక సంస్థల్లో ఉంది. అందుకే, ఉద్యోగం చేస్తున్న మహిళల సంక్షేమం కోసం భారత ప్రభుత్వం కొత్తగా ఆన్‌లైన్ ఫిర్యాదుల విభాగాన్ని ప్రవేశపెట్టింది. అదే షీ–బాక్స్ (సెక్సువల్ హెరాస్‌మెంట్ ఎలక్ట్రానిక్ బాక్స్). ఆ వివరాలు తెలుసుకుందాం.
ఆన్‌లైన్‌లో ఫిర్యాదుకు అవకాశం
మహిళలు పనిచేసే చోట నిశ్చింతగా ఉద్యోగం చేసుకుంటూ, వేధింపులకు గురికాకుండా ఉండటం కోసం ప్రభుత్వం ఇటీవల ‘షీ–బాక్స్’ పేరుతో ఓ వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసింది. ఇది గత ఏడాది నవంబర్ నెల నుంచి కేంద్ర, మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ ఆన్‌లైన్ ఫిర్యాదు సౌకర్యాన్ని ఉద్యోగినులకు కల్పించింది. ప్రభుత్వ/ప్రైవేటు సంస్థలు, పరిశ్రమల్లో అంటే సంఘటిత, అసంఘటిత రంగాల్లో పనిచేసే మహిళా ఉద్యోగులైనా ఫిర్యాదు చేయ్యవచ్చు. తాము ఎదుర్కొంటున్న లైంగిక వేధింపుల గురించి వివరంగా తెలియజేయవచ్చు.
లైంగిక వేధింపులే కాదు..
ఒక్క లైంగిక వేధింపులే కాదు. మహిళలను భయపెట్టడం, జుగుప్సాకరమైన ఉద్యోగ వాతావరణం సృష్టించడం. స్త్రీలను తక్కువ చేసి మాట్లాడటం.. ఇలా ఎటువంటి ఇబ్బందినైనా నిర్భయంగా ఆన్‌లైన్ వేదికగా ఫిర్యాదులో పేర్కొనవచ్చు. వారి ఆరోగ్యానికి, భద్రతకు ముప్పు కలిగించే అన్ని విషయాలనూ ఇందులో నమోదు చేయవచ్చు.
ఆన్‌లైన్‌లో ఇలా..
♦ http://shebox.nic.in/ అనే వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వాలి. స్క్రీన్ మీద కనిపించే రిజిస్టర్ యువర్ కంప్లయింట్ మీద క్లిక్ చేయాలి.
♦ అక్కడ గవర్నమెంట్ ఉద్యోగులా.. ప్రైవేటు ఉద్యోగులా అనే కాలంలు కనిపిస్తాయి. గవర్నమెంట్ అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులా, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగినులా అని అడుగుతుంది.
♦ ఆయా ఉద్యోగులకు సంబంధించిన కాలం క్లిక్ చేసిన వెంటనే ఆన్‌లైన్‌లో ఫిర్యాదు దరఖాస్తు ప్రత్యక్షమవుతుంది. అక్కడ ఫిర్యాదుదారు పేరు, ఉద్యోగం, సెల్ నెంబరు, ఈ–మెయిల్, ఆధార్ నంబర్‌తోపాటు కార్యాలయం వివరాలు నమోదు చేయాలి.
♦ మీ ఆఫీసులో ఏ సందర్భంలో మీరు వేధింపులకు గురి అయ్యారు.. గురవుతున్నారు అనే వివరాలను పొందుపరచడానికి బ్రీఫ్ డిస్క్రిప్షన్ వద్ద అవసరమైన మెజేస్ స్పేస్ వస్తుంది. ఇలా ఫిర్యాదు నమోదు పత్రంలో సమాచారం నింపాక, సబ్‌మిట్ బటన్ క్లిక్ చేయాలి.
♦ ఒకసారి ఫిర్యాదు ఇచ్చారంటే, మీ మెయిల్‌కి కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. అందులో ఒక లింక్ కూడా వస్తుంది. అక్కడ మీ ఈ–మెయిల్ ఐడీని యూజర్ ఐడీగా వాడుకుని, కొత్త పాస్‌వర్డ్‌ని జనరేట్ చేసుకుని, మీ ఫిర్యాదు విచారణ ఎంతవరకు వచ్చిందో ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.
షీ–బాక్స్ ఒక సింగిల్ విండోలా
షీ–బాక్స్ ఒక సింగిల్ విండోలా పనిచేస్తుంది. ఉద్యోగం చేస్తున్న చోట వేధింపులకు గురవుతున్నవారు చేసే ఫిర్యాదు నేరుగా సంబంధిత అధికారులకు చేరుతుంది. వెంటనే వారు.. బాధితురాలు పనిచేస్తున్న సంస్థ యాజమాన్యాలతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటారు. షీ–బాక్స్‌లో ఫిర్యాదు చేయడానికి ఈ–మెయిల్ ఐడీ తప్పనిసరి. ఇందులో రిజిస్టర్ చేసుకోవడం చాలా సులభం. తీసుకునే చర్యలపై నిఘా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment