కౌలుకు ఇవ్వలేదని.. కాటికి పంపారు
భార్యతో కలిసి తమ్ముడు, మరదలును చంపిన అన్న
అనాథలైన పిల్లలు... పోలీసుల అదుపులో నిందితులు
తమకు పొలాన్ని కౌలుకు ఇవ్వలేదన్న కోపంతో తమ్ముడిని, మరదలిని అన్న, వదిన కలిసి చంపేశారు.. దీంతో వారి ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారారు.. ఈ సంఘటనతో ఆ గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ కేసులో నిందితులిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.
మక్తల్ : మండలంలోని రుద్రసముద్రానికి చెందిన చిన్న లింగప్ప (35), నడిపి లింగప్ప సొంత అన్నదమ్ములు. వీరికి శివారులో నాలుగెకరాల చొప్పున పొలం ఉంది. కాగా, పదిరోజుల క్రితం తమ్ముడు తన భూమిని ఇతరులకు కౌలు ఇవ్వటానికి నిర్ణయించుకున్నాడు. దీంతో అన్న తనకు కాకుండా వేరే వారికి ఇవ్వొద్దని మందలించడమేగాక తుదముట్టిస్తానని హెచ్చరించాడు. ఈ క్రమంలోనే గురువారం సాయంత్రం భారీగా ఈదురుగాలులు రావడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయి అంతా చీకటిమయంగా మారింది. అదే రాత్రి భోజనం చేశాక చిన్న లింగప్ప ఆరుబయట, భార్య మణెమ్మ (30) అలియాస్ పద్మమ్మ, కుమారుడు రాకేష్, కూతురు మహేశ్వరి ఇంట్లోనే నిద్రకు ఉపక్రమించారు.
ఇదే అదనుగా భావించిన అన్న నడిపి లింగప్ప, వదిన లక్ష్మి అర్ధరాత్రి దాటాక వచ్చి గొడ్డలితో తమ్ముడు, మరదలిని నరికి చంపేసి పారిపోయారు. కొద్దిసేపటికి మేల్కొన్న చిన్నారులు తమ తల్లిదండ్రులు హత్య కు గురైనట్టు తెలుసుకుని చుట్టుపక్కలవారికి రోదిస్తూ చెప్పారు. ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు సమాచారమివ్వడంతో సంఘటన స్థలాన్ని నారాయణపేట డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, స్థానిక సీఐ శ్రీనివాస్ పరిశీలించారు. జిల్లా కేంద్రం నుంచి జాగిలాన్ని రప్పించి కేసు దర్యాప్తు చేపట్టారు. ఎట్టకేలకు శుక్రవారం సాయంత్రం ఊట్కూర్‌లో నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.
ఇక మాకెవరు దిక్కు?
అభం, శుభం తెలియని చిన్నారుల దీనస్థితి చూసి గ్రామస్తులు చలించి పోయా రు. ప్రాథమిక పాఠశాలలో రాకేష్ నాలుగో, మహేశ్వరి ఒకటో తరగతి చదువుతోంది. ‘మా అమ్మ, నాన్నలను పెద్దమ్మ, పెద్దనాయనలే చంపేశారు..’ అంటూ చిన్నారులు రోదిస్తూ పోలీసులకు చెప్పడం అక్కడి వారిని కలచివేసింది. ఇక మాకెవరు దిక్కు ఎవరంటూ కన్నీరు మున్నీరయ్యారు. ఈ సంఘటనతో వారిద్దరూ అనాథలుగా మారా రు. అలాగే సంఘటన స్థలాన్ని డీసీఎంఎస్ చైర్మన్ నిజాంపాషా, జెడ్పీటీసీ సభ్యుడు వాకిటి శ్రీహరి, డీసీసీ ఉపాధ్యక్షుడు అక్కల సత్యనారాయణ తది తరులు పరిశీలించారు. అనంతరం మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాలను బంధువులకు అప్పగించారు.