Shetkari Sanghatana
-
సాగు చట్టాల నివేదిక విడుదల చేయండి.. సుప్రీంకోర్టుకు లేఖ
న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై రూపొందించిన నివేదిక త్వరగా విడుదలయ్యేలా చూడాలని ఆ చట్టాలపై సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన ప్యానెల్ సభ్యుడు, షెట్కారీ సంగటన్ నేత అనిల్ ఘన్వత్ కోరారు. ఈ మేరకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. సంబంధిత అధికారులను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సాగు చట్టాలను ఉపసంహరించుకున్న తర్వాత కూడా వ్యవసాయ రంగంలో సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ వచ్చే రెండు నెలల పాటు ధర్నా చేస్తామని, ఇందుకోసం లక్ష మంది రైతులను ఢిల్లీకి తీసుకొస్తానని తెలిపారు. చదవండి: సెల్ఫీ సరదా రెండు నిండు ప్రాణాలను తీసింది కనీస మద్దతు ధరను చట్టబద్ధం చేయాలని, అన్ని పంటలకు ఎంఎస్పీకే కొనుగోలు చేయాలన్న రైతుల డిమాండ్లు అమలుచేయడం సాధ్యం కాదని పేర్కొన్నారు. వచ్చే శీతాకాల సమావేశాల్లో సాగు చట్టాలను కేంద్రం ఉపసంహరించుకుంటే ప్యానెల్ ఇచ్చిన నివేదిక అసంబద్ధం అవుతుందని, ప్రజా ప్రయోజనార్థం సలహాలు ఉపయోగపడతాయని వివరించారు. సాగు చట్టాలపై కొంతమంది నేతలు రైతులను తప్పుదోవ పట్టించారని, ఈ నివేదిక ద్వారా వారికి అసలు విషయాలు తెలుస్తాయని పేర్కొన్నారు. ఈ ప్యానెల్ తన నివేదికను సుప్రీంకోర్టుకు నివేదికను సమర్పించింది. -
రైతు నేత శరద్ జోషి కన్నుమూత
పుణె : ప్రముఖ రైతు నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు శరద్ జోషి(81) శనివారం పుణెలో కన్నుమూశారు. మహారాష్ట్రకు చెందిన జోషి రైతు సంక్షేమం కోసం అలుపెరుగని పోరాటాలు చేసి రైతు బాంధవుడిగా పేరు గాంచారు. రైతుల పక్షాన పోరాడేందుకు 1979లో షెట్కారీ సంఘటన్ పేరుతో సంస్థ స్థాపించారు. అలాగే స్వతంత్ర భారత్ అనే పార్టీని కూడా స్థాపించారు. ముఖ్యంగా 1980లో ఉల్లి మద్దతు ధర కోసం జోషి జరిపిన ఉద్యమం దేశ వ్యాప్తంగా అందరినీ ఆకర్షించింది. ఆర్ధికవేత్తగా ప్రఖ్యాత జర్నలిస్టుగా కూడా సమాజానికి ఎనలేని సేవలందించారు. 2004 నుంచి 2010 వరకు రాజ్యసభ సభ్యునిగా పనిచేసిన జోషికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన మరణం రైతు లోకానికి, రైతు ఉద్యమాలకు తీరని లోటని భారతీయ కిసాన్ యూనియన్ నేత భూపిందర్ సింగ్ అన్నారు. ఆయన మృతి పట్ల వివిధ పార్టీల నేతలు, రైతు సంఘాల నేతలు సంతాపం వ్యక్తం చేశారు. -
ఆప్ గూటికి షెత్కారీ సంఘటన నేత పాటిల్
ముంబై: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ని పటిష్టపరిచే దిశగా చర్యలు ఊపందుకుంటున్నాయి. ఆప్ నాయకులు మయాంక్ గాంధీ, అంజలి దమానియా సమక్షంలో తన అనుచరులతో కలిసి షెత్కారీ సంఘటన నాయకుడు రఘునాథన్ పాటిల్ మంగళవారం ఆ పార్టీలో చేరారు. అనంతరం మాట్లాడుతూ ఈ రోజు నుంచి తాము ఆప్ సభ్యులమని, రేపటి నుంచి తమ కార్యక్రమాలను ప్రారంభిస్తామని చెప్పారు. వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు మోడల్ ఏపీఎంసీ చట్టాన్ని సమర్థంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. 2003లో వచ్చిన ఈ చట్టం ఇప్పటివరకు సమర్థంగా అమలవుతున్న దాఖలాలు లేవన్నారు. షెత్కారీ సంఘటన మహారాష్ట్ర విభాగం ఉనికిలోనే ఉంటుందని ఆయన తెలిపారు. రైతుల సమస్యల కోసం గతంలో కాషాయకూటమికి తాము ఎన్నోసార్లు మద్దతిచ్చామని, అయితే ఆ సమస్యలను పరిష్కరించడంలో వాళ్లు పోరాటంలో చేయడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. మూడు లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నా, ప్రధాన ప్రతిపక్షమైన కాషాయకూటమి ప్రభుత్వాన్ని నిలదీసినా సంఘటనలు ఎక్కడా చోటుచేసుకోలేదన్నారు. ఈ ఏడాది జరిగే ఎన్నికల్లో రైతు సమస్యల ప్రధాన ఎజెండాగా ప్రచారం ఉంటుందని, అందుకే ప్రజా ఉద్యమాల్లో నుంచి వచ్చిన ఆప్‌కు మద్దతివ్వాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. స్వాభిమాన్ షెత్కారీ సంఘటన్ ఎంపీ రాజు శెట్టి ఇటీవల కాషాయకూటమిలో చేరడంతో పాటిల్ ఆప్ తీర్థాన్ని పుచ్చుకోవడం గమనార్హం. అవినీతి అధికారుల ఆటకట్టించేందుకు హెల్ప్‌లైన్ లంచగొండి అధికారుల ఆగడాలను అరికట్టేందుకు నాసిక్ ఆప్ విభాగం హెల్ప్‌లైన్‌ను ప్రారంభిస్తామని ప్రకటించింది. లంచాలు ఇవ్వలేక తీవ్ర నిరాశలో ఉన్న నగరవాసులకు 60 మంది సభ్యులు గల బృందం సహకరిస్తుందని ప్రకటించింది. ఈ బృందంలో న్యాయవాదులు, ఆర్టీఐ కార్యకర్తలు, సామాజిక కార్యకర్తలు ఉంటారు. రేషన్ కార్డు జారీ చేసే విషయంలో, మరో ఇతర పనికోసమైనా ప్రభుత్వ అధికారి లంచం అడిగితే అందుబాటులోకి రానున్న తమ హెల్ప్‌లైన్ 9823026131, 9823209131 నంబర్లలలో సంప్రదించాలని ఆప్ కన్వీనర్ జితేంద్ర భవే తెలిపారు. ఈ కాల్‌ను మాట్లాడిన వ్యక్తులు సదరు బృందాన్ని అప్రమత్తం చేసి బాధితులకు న్యాయం చేస్తారని చెప్పారు. ఇప్పటివరకు ఆప్‌లో 30వేల మంది సభ్యులు సభ్యత్వం తీసుకున్నారని తెలిపారు. 15వేల మంది ఆన్లైన్లో తమ పేర్లను నమోదుచేసుకున్నారని వివరించారు.